ఈనెల 11న తిరుపతికి సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: ఈనెల 11, 12 తేదీల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. 11వ తేదీ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం వైయస్ జగన్.. మధ్యాహ్నం 2.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బర్డ్ ఆస్పత్రి ప్రారంభోత్సవం, అలిపిరి శ్రీవారి పాదాల వద్ద పైకప్పు నిర్మాణ పనులు, పాదాల మండపం వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరం ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం తిరుమలలో శిరోవస్త్రం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బసచేస్తారు. 12వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఎస్వీబీసీ (కన్నడ, హిందీ) ఛానల్స్‌ను, రూ.12కోట్లతో ఆధునీకరించిన బూందీ పోటును ప్రారంభిస్తారు. ఆ తర్వాత టీటీడీ అమలుచేస్తున్న నూతన కార్యక్రమాల ప్రజెంటేషన్, టీటీడీ–రైతు సాధికారక సంస్థ ఎంఓయూ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి తాడేపల్లికి తిరుగుప్రయాణమవుతారు.