నెలాఖరులోగా మిగిలినవారిని రిక్రూట్ చేయాలి
తాడేపల్లి: కరోనా నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా మరో రెండు వారాల పాటు రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగించాలని, ఆంక్షలు కచ్చితంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఆరోగ్య శాఖలో 39 వేల మందిని నియమిస్తున్నామని, ఇప్పటి వరకు 27 వేల మందిని రిక్రూట్ చేశామని, నెలాఖరులోగా మిగిలిన వారిని రిక్రూట్ చేయాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు, మెడికల్ సిబ్బంది లేరనే మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. మార్చి 1 నుంచి ఈ విషయంలో కలెక్టర్లను బాధ్యులను చేస్తామని చెప్పారు. అందుబాటులో ఉండటం, సమస్యలు చెప్పిన వారి పట్ల సానుభూతితో ఉండటం అన్నది ఉద్యోగుల బాధ్యత అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ గుర్తుచేశారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా పూర్తి హక్కులు ఇంటి యజమానులకే ఉంటాయని, లబ్ధిదారుల్లో అవగాహన పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. డాక్యుమెంట్లు ఉన్న ఆస్తికి, డాక్యుమెంట్లు లేని ఆస్తికి తేడాను లబ్ధిదారులకు వివరించాలని సూచించారు. స్పందన కోసం కొత్త పోర్టల్‌ను ప్రారంభించామని సీఎం చెప్పారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. 43 సూచికలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని, ఈరంగాల్లో ప్రగతి ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. దీని వల్ల మన ప్రమాణాలు మరింత పెరుగుతాయి. దేశంలో అత్యుత్తమంగా నిలుస్తాం.. దేశం మొత్తం మన రాష్ట్రంవైపు చూస్తుందన్నారు.