ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదు
తాడేపల్లి: తాగునీటి మీద ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించాలని, ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్లడ్ శాంపిళ్లలో లెడ్, ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పరస్ కనిపిస్తోంది.. ఎలా వచ్చిందన్నది కచ్చితంగా కనిపెట్టాలని సూచించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే.. ఇది ఎలా జరిగిందన్న దానిపై కచ్చితంగా కనిపెట్టాలని, ఈ కోణంలో అందరూ దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు.
ఏలూరులో పలువురి అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య బృందాలు, వివిధ సంస్థల నిపుణులు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ మంగళగరి, ఎన్‌ఈఈఆర్‌ఐ (నీరీ), సీసీఎంబీకి చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్, వైద్యాధికారులు పాల్గొన్నారు. క్యాంపు ఆఫీస్ నుంచి సీఎంతో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వల్లభనేని బాలశౌరి, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
'గత రాత్రి నుంచి ఇద్దరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో 8 మంది, ఏలూరులో 5గురు మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు అంతా డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన వారు తిరిగి ఆస్పత్రులకు వచ్చిన దాఖలాలు లేవు. పశువుల నుంచి కూడా కొన్ని శాంపిళ్లు తీసుకుని భోపాల్‌కు పంపాం. అలాగే చేపల శాంపిళ్లు కూడా తీసుకున్నాం. గాలిలో కాలుష్యంపైనా కూడా పరీక్షలు చేయించాం. అన్ని ప్రమాణాల ప్రకారమే ఉన్నాయి' అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారులు తెలిపారు.
సీఎం ఏం మాట్లాడారంటే..
‘ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీని వేశాం. ఈ అంశంపై పరీక్షలు చేస్తున్న వివిధ సంస్థలు, ఏజెన్సీలు, నిపుణులను సమన్వయం చేస్తూ ముందడుగు వేయాలి. బుధవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిద్దాం. విచ్చలవిడిగా పురుగు మందులు, అలాగే నిషేధిత పురుగు మందుల వినియోగాన్ని అడ్డుకోవాలి. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిషేధించిన పురుగు మందులు అమ్మితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా అనుమతించిన పురుగు మందులు, ఎరువులు మాత్రమే రైతులకు చేరవేయాలి. వాటి వినియోగంపైన రైతులకు అవగాహన కల్పించాలి. తద్వారా ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అడ్డుకోగలుగుతాం. ప్రస్తుతం వినియోగిస్తున్న పురుగుల మందులను పరీక్షలు చేయాలి. వచ్చే నెలరోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగాలి.
ప్రస్తుత పరిస్థితికి నీరు కారణమా? కాదా? అన్నదానిపై ముందు పూర్తి స్థాయిలో నిర్ధారణలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టిపెట్టాలి. దానిపై అవగాహన కల్పించాలి. సేంద్రీయ పద్ధతుల ద్వారా ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బియ్యం శాంపిల్స్ కూడా తీసుకుని పరీక్షలు చేయించండి. పెస్టిసైడ్స్ రూపంలో కూడా చేరే అవకాశాలున్నాయని చెప్తున్నారు కాబట్టి పరిశీలన చేయాలని’ సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.