బలిరెడ్డి మరణం చోడవరానికి తీరనిలోటు
28 Sep, 2019 11:55 IST
విశాఖపట్నం: బలిరెడ్డి మృతి చోడవరం నియోజకవర్గానికి తీరనిలోటని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బలిరెడ్డి సత్యారావు మృతిచెందారు. వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సత్యారావును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. బలిరెడ్డి సత్యారావు మృతిచెందిన వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చోడవరం వెళ్లారు. బలిరెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బలిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తదితరులు ఉన్నారు.