రైతుల ప్రీమియం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది
అసెంబ్లీ: పవిత్రమైన శాసనసభలో ప్రతిపక్షం దారుణమైన అబద్ధాలు ఆడుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి ప్రభుత్వం క్లియర్‌గా చెబుతున్నా.. దారుణమైన అబద్ధాలతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలంటే భయపడేవాళ్లన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ‘2016కి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లయిమ్స్ సొమ్ము 2017 ఆగస్టులో రూ.228 కోట్లు ఇవ్వడం జరిగింది. 2017కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము 2018లో రూ.535 కోట్లు, 2018 ఖరీఫ్‌కు సంబంధించి 2019 అక్టోబర్ రూ.415 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా తెలిసినా కూడా ప్రతిపక్షం కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తోంది.
2019కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము డిసెంబర్ 15న రూ.1227 కోట్లు రైతులకు చెల్లిస్తున్నాం. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనలో ఇన్సూరెన్స్ కట్టాలంటే రైతు భయపడేవాళ్లు. బాబు పాలనలో సగటున 20 లక్షల మంది ఇన్సూరెన్స్ కడితే.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత 2019–20 సంవత్సరంలో 58.77 లక్షల రైతులు ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చారు. దానికి కారణం రైతుల వాటాగా ఒక్క రూపాయి కడితే చాలు.. రైతుల తరఫున ప్రభుత్వమే భారం భరిస్తుంది కాబట్టే. 2019కి సంబంధించిన రైతుల తరుఫున, ప్రభుత్వం వాటాగా ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.1030 కోట్లు మన ప్రభుత్వం కట్టింది’ అని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు.