కరకట్ట 4 లైన్ రోడ్ త్వరగా పూర్తిచేయాలి
తాడేపల్లి: అమరావతి ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డే కీలకమని, కరకట్ట 4 లైన్ల రోడ్డును వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఏఎంఆర్‌డీఏ కమిషనర్ పి లక్ష్మీ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరకట్ట రోడ్డును 4 లైన్లుగా విస్తరించే ప్రతిపాదనపై అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరాలు అందించారు. రోడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.150 కోట్లు అవుతుందని అంచనా రూపొందించినట్లు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందన్నారు. కరకట్ట రోడ్డును ఆనుకొని ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును మెయిన్‌రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.