థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకూడదు
తాడేపల్లి: థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం నిశితంగా సమీక్షించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం వైయస్ జగన్‌కు అధికారులు తెలిపారు. మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి రెండు ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని అధికారులు వివరించారు. జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.
బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు చేయాలని, దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు సూచించారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు తెలిపారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలన్నారు. 6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.