అంతుచిక్కని వ్యాధిపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో అంతుచిక్కని వ్యాధిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు వెంటనే వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పూళ్లకు సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, కమిషనర్, ఉన్నతాధికారులు బయలుదేరారు. పూళ్లలో పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ..ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలా పడిపోయిన వారిలో కొందరికి ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి. వైద్య అధికారులు అప్రమత్తమై వెంటనే గ్రామంలో వైద్య బృందాలు ఏర్పాటుచేశారు.
ఇంటింటికి వెళ్లి అధికారులు సర్వే చేస్తున్నారు. ఆశ వర్కర్లు గ్రామంలోని 6 నీళ్ల ట్యాంక్‌లో వాటర్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. ప్రస్తుతం బాధితులంతా ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.