భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్ష
తాడేపల్లి: వచ్చే రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఈ స్థాయి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకూ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.