రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి
తాడేపల్లి: ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉండకూడదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. అగ్రికల్చర్, పౌరసరఫరాలు, మార్కెటింగ్ రంగాలపై మరింత ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. నిల్వచేయలేని పంటల విషయంలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మదనపల్లె మార్కెట్లో టమోటాలు కొనుగోలు చేసి రైతు బజార్లకు సప్లై చేస్తున్నామని అధికారులు చెప్పారు. దీంతో డిమాండ్ పెరిగి టమోటా రేటు కిలో రూ.4ల నుంచి రూ.8లకు పెరిగిందని అధికారులు చెప్పారు. అరటిపై కూడా దృష్టి పెట్టామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో చిన్న చిన్న మార్కెట్లకూ అరటిని అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో అరటిని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కోసం గ్రామాల వారీగా ప్రణాళిక వేసుకోవాలని చెప్పారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. ఏప్రిల్ 2న 803.4 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేశామని, ఈరెండు మూడు రోజుల్లో మొత్తంగా 1530 మెట్రిక్ టన్నులను విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులనుంచి ఎగుమతి చేశామని అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, మార్కెటింగ్, పౌరసరఫరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంత్రులు కన్నబాబు, మోపిదేవి, కొడాలి నాని, టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా దృష్టిపెట్టాలన్నారు. ఆకలితో ఉన్నామని, భోజనం దొరకడం లేదనే మాట రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదని అధికారులకు పదేపదే సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు.