అసూయతో వచ్చే కడుపు మంటకు చికిత్స లేదు
కర్నూలు: వైయస్ఆర్ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కు చికిత్స ఉంది కానీ..అసూయతో వచ్చే కడుపు మంటకు చికిత్స లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూ నిజాయితీతో పని చేస్తున్నామని సీఎం చెప్పారు. మంగళవారం కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ఆర్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. సీఎం ఏమన్నారంటే..వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాటల్లోనే..
అక్కచెల్లెమ్మలు బాగున్నారా?..అమ్మ ఒడి సొమ్ము అందిందా..సంక్రాంతి పండుగ బాగా జరిగిందా? అన్న దమ్ముళ్లు బాగున్నారా..రైతు భరోసా సొమ్ము మీ ఖాతాల్లో పడిందా?..అవ్వాతాతలు బాగున్నారా? పెంచిన పింఛన్ సొమ్ము మీ ఇంటికి వస్తుందా? ఆటో డ్రైవర్లు, న్యాయవాదులు, చేనేతలు, మత్స్యకార సొదరులు, ఆగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు చేయదగిన సాయం దేవుడి దయతో, మీ అందరికి సహకారంతో చేయగలిగిన సాయం చేశాను. ఇందులో భాగంగానే ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాను. మొట్ట మొదటగా అవ్వాతాతల విషయంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అవ్వాతాతలకు ఎంత చేసినా కూడా తక్కువే అని భావించే వాళ్లలో నేను మొదటి వ్యక్తిని. ఇది నాకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి నుంచి రెండు పథకాలు ప్రారంభిస్తున్నాం. మొదటిది ఆసుపత్రుల రూపురేఖలు మార్చే కార్యక్రమం. ఇంతకు ముందు ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా, కొత్త ఆసుపత్రులను నిర్మించేందుకు ఆరోగ్య రంగంలో నాడు- నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పేదలు వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం. ప్రతి ప్రభుత్వాసుపత్రుల్లో ఐపీహెచ్ ప్రమాణాలకు తీసుకువస్తాం. గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రులన్నింటిని మూడు దశల్లో, మూడేళ్లలో పూర్తిగా మార్చబోతున్నాం. ప్రతి ఆసుపత్రి, సబ్ సెంటర్, కమ్యూనిటి హెల్త్ సెంటర్, టీచింగ్ ఆసుపత్రి అన్నింటిని కూడా ఇవాళ ఫోటోలు తీస్తున్నాం, ఆ ఫోటోలు మీ ముందు పెడతాం. మూడేళ్ల తరువాత మళ్లీ ఈ ఫోటోలు మీ అందరికి చూపుతాం. దీని కోసం ఏకంగా రూ.15,333 కోట్లతో పనులు ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను. మూడేళ్లలో నాడు-నేడు తరువాత ఫోటోలు చూపిస్తాం. మొదటి దశను ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. మొదటి దశలో 7458 సబ్ సెంటర్లలో నాడు-నేడుకు శ్రీకారం చుడుతున్నాం. కొత్తగా 4700 కొత్త భవనాలను నిర్మిస్తున్నాం. మిగిలిన సబ్ సెంటర్ల రూపు రేఖలు మార్చేందుకు రూ.1129 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రెండో దశలో 14045 పీహెచ్సీ సెంటర్లను, 149 కొత్తగా నిర్మిస్తున్నాం, మిగిలిన వాటికి మరమ్మతులు చేసి అత్యాధునిక సౌకర్యాలతో పీహెచ్‌సీలను మార్చబోతున్నాం. ఇవి కాక రెండో దశలోనే 169 కమ్యూనిటి సెంటర్ల రూపురేఖలు మార్చబోతున్నాం. 52 ఏరియా ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నాం. వీటి కోసం రూ.700 కోట్లు, సీహెచ్‌సీ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడో దశలో జిల్లా ఆసుపత్రులను, టీచింగ్ ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. కొత్తగా సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను, నర్సింగ్ హాస్పిటల్స్‌ను కడుతున్నాం. వీటి కోసం రూ.12300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా ఆసుపత్రుల కోసం రూ.15,337 కోట్లు ఖర్చు చేయడానికి మీ బిడ్డ గర్వపడుతున్నాడు.
దేశానికి స్వాంతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పటి వరకు టీచింగ్ ఆసుపత్రులు కేవలం 11 మాత్రమే ఉన్నాయి. వీటిని పూర్తిగా మార్చడమే కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి టీచింగ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాం. 16 టీచింగ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాం. మొత్తంగా 27 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. ప్రతి టీచింగ్ ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. పీజీ కోర్స్ చదువుతున్న డాక్టర్లు అందుబాటులో ఉంటారు. స్టూడెంట్స్ అందుబాటులో ఉంటారు. నర్సులు కూడా ఉంటారు కాబట్టి ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు లేరన్న మాట రాకూడదని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. 3 క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో వైద్య రంగం రూపురేఖలు మార్చబోతున్నాం. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదు. మనమే ఎక్కువగా ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాను.
రెండోది అవ్వాతాతల కోసం వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. మూడో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అవ్వాతాతలకు వృద్ధాప్యంలో కంటి చూపు సమస్య రాకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. అవ్వాతాతల సమస్యలు మనందరికి తెలుసు. ఆ పరిస్థితులు ఇవాళ నుంచి మారబోతున్నాయి. నాకెంతో ఇష్టమైన అవ్వాతాతలకు మూడో దశ కంటి వెలుగు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. జులై 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్షరాల 56, 88,420 మంది అవ్వాతాతలకు గ్రామ సచివాలయాల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయి. ఈ అవ్వాతాతలకు ఉచిత కంటి పరీక్షలు చేస్తునే..మరో వైపు అద్దాలు కూడా అందజేస్తాం. మరోవైపు మార్చి 1 నుంచి అవ్వాతాతలకు అవసరమైన మేరకు ఆపరేషన్లు చేయిస్తాం. రెండు వారాల తరువాత కళ్లజోళ్లు నేరుగా మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇస్తారు. 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆపరేషన్లకు 133 కేంద్రాల్లో ఆపరేషన్లు చేస్తారు. 11 టీచింగ్ ఆసుపత్రుల్లో, 28 ఏరియా ఆసుపత్రుల్లో, 81 ఎన్జీవోలతో కూడిన కంటి ఆసుపత్రుల్లో చికిత్సలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది. మన వద్ద ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమానికి రూ.560 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఒక మనవడిగా గర్వంగా చెబుతున్నాను. మొదటి దశగా 2019 అక్టోబర్ 10న ప్రారంభించాం. మొదట స్కూల్ పిల్లలకు ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాం. దాదాపు 60 వేల మంది సిబ్బంది ఈ మహాయజ్ఞంలొ పాల్గొన్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కంటి వెలుగు రెండో దశను పూర్తి చేసాం. 4.36 లక్షల పిల్లలకు కంటి పరీక్షలు చేయించి, ఆపరేషన్లు చేయించాం. రెండోసారి సెంకడరీ స్క్రీనింగ్ చేయించి 1.50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం. 46 వేల మందికి వేసవిలో కంటి ఆపరేషన్లు చేయిస్తాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మీ బిడ్డ మేలు చేస్తుందని గర్వంగా చెబుతున్నాను. ఇటువంటి మంచి పరిపాలన చేస్తున్నప్పుడు సహజంగా ఓర్వలేని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఎంతటి కడుపు మంట ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబులో ఆ కడుపు మంట మరి ఎక్కువగా ఉంది. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కు ఉచితంగా వైద్యం చేయించవచ్చు కానీ..అసూయతో వచ్చే కడుపు మంటకు ఎక్కడ వైద్యం చేయించే అవకాశం లేదు. కంటి చూపు మందగిస్తే..కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ..చెడు దృష్టికి ఎక్కడా చికిత్స లేదు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ..మెదడు కుళ్లితే చికిత్సలు లేనే లేవు. ఇలాంటి లక్షణాలు ఉన్నా మనుషులను మహానుబావులుగా చూపించే కొన్ని చానల్స్, పత్రికలు ఉన్నాయి. వాళ్లను బాగు చేయించే మందులు ఎక్కడా లేవు. వీటన్నింటి మధ్య మీ బిడ్డ ..మీ కోసం పని చేస్తున్నాడు. నిజాయితీగా పని చేస్తున్నాను. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. పిల్లలకు చదువులు చెప్పిస్తున్నాం. వైద్యం, ఆరోగ్యంపై దృష్టిపెట్టాం. వ్యవసాయానికి అండగా ఉన్నాం. ప్రజలందరి ఆరోగ్యం, ఆనందం కోసం గట్టిగా నిలబడుతాను. ప్రతి ఒక్కరి తోడ్పాటు కోసం మీ బిడ్డకు ఎల్లప్పుడు మీ చల్లని దీవెనలు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా..