ఇదంతా మీ అందరి ఆశీర్వాదమే
కాకుళం: పాదయాత్రలో నేను చెప్పిన ప్రతి హామీ వంద రోజుల పాలనలో నెరవేర్చుతున్నానంటే మీ అందరి ఆశీర్వాదమే అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను మరచిపోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితులకు పెన్షన్ రూ.10 వేలు ఇస్తూ మొదటి సంతకం చేశానని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శుక్రవారం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే..సీఎం మాటల్లోనే..
మీ అందరి ఆశీర్వాదం, తోడు, దీవెనలతో 175 స్థానాలకు గాను 151 స్థానాలిచ్చి అఖండమైన మెజార్టీతో 50 శాతంపైచిలుకు ఓటు బ్యాంకుతో మీ తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నా పాదయాత్రలో చూశాను. 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ప్రతి గ్రామం తిరిగాను. ఆ సమస్యలు మీరు చెబుతున్నప్పుడు విన్నాను. చూశాను. ఆ రోజు నేను చెప్పాను. నేను విన్నాను.. నేను ఉన్నానని చెప్పాను. వంద రోజుల పాలన తిరగ్గ ముందే మళ్లీ మీ దగ్గరకు వచ్చి మీ అందరి సమక్షంలో నిల్చొని ఆ రోజు చెప్పిన మాటను మీ సమక్షంలో ఈ రోజు శంకుస్థాపన చేయగలుగుతున్నాను అంటే ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పాదయాత్ర ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. కిడ్నీ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్ అందడం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోవడం లేదని చెప్పారు. మీరు చెప్పిన ప్రతి మాటను గుర్తుపెట్టుకున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం చేశాను. కిడ్నీ బాధితులకు పెన్షన్ రూ. 10 వేలు ఇస్తూ మొదటి సంతకం చేశాను. ఈ రోజు అదే అడుగుల్లో ముందుకు వేస్తూ.. కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చి శంకుస్థాపన చేశాను. ఆస్పత్రితో పాటు కిడ్నీ బాధితులను గుర్తుపెట్టుకొని మంచి చేసేందుకు అడుగులు వేస్తున్నాం. డయాలసిస్ చేసుకునే రోగులకు రూ. 10 వేలు పెన్షన్ ఇస్తున్నామని సగర్వంగా చెబుతూ.. ఆ రూ. 10 వేల పెన్షన్ స్టేజ్ అంటే డయాలసిస్ బాధితులకు అందుతుంది. ఆ పరిహారం స్టేజ్ 3 నుంచి కూడా ఇస్తే డయాలసిస్‌కు పోకమునుపే మందుల వాడకం నుంచి తోడ్పాటు ఇవ్వండి అని ఎమ్మెల్యే అప్పలరాజు అడిగిన కోరిక మేరకు స్టేజ్ 3 బాధితుల నుంచి స్పెషల్ ప్యాకేజీ కింద రూ. 5 వేల పెన్షన్ ఇవ్వబోతున్నామని గర్వంగా చెబుతున్నాం.
పెన్షన్ తీసుకునే వారికి మేలు జరగాలి. కిడ్నీ బాధితులను ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పడమే కాదు చేసి చూపించాలి. ప్రతి 500 సీకేడీ పేషంట్లకు ఒక హెల్త్ వర్కర్ని కూడా నియమించడం జరుగుతుంది. హెల్త్ వర్కర్లు ఆ పేషంట్లకు తోడుగా ఉంటూ అన్ని రకాలుగా అండదండలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. ఒక అటెండర్‌కు ఫ్రీ బస్‌పాస్ ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్‌లలో పరీక్షలు ఫ్రీగా చేస్తారు. క్వాలిటీ మెడిసిన్ పూర్తిగా అందుబాటులోకి వస్తాయని సర్వంగా చెబుతున్నాను. కిడ్నీ బాధితులకు తోడుగా ఉండడమే కాకుండా.. రోగానికి కారణం ఏంటని మొట్టమొదటగా ఆ పరిస్థితి రాకుండా అడుగులు వేస్తున్నాం. ఉద్దానం ప్రాంతం అంతా రెండు నియోజకవర్గాలు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని 807 గ్రామాలు, రెండు నియోజకవర్గాల్లోని ప్రతి ఒక్కరికీ నేరుగా ఇంటికే తాగునీరు అందించడం కోసం సర్ఫేస్ వాటర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్షరాల రూ. 6 వందల కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ శంకుస్థాపన చేయబోతున్నాం.
ఇది ఒక్కటే కాకుండా పాదయాత్ర జరుగుతున్నప్పుడు మత్స్యకార సోదరులు నా దగ్గరకు వచ్చారు. అన్నా.. మాకు ఫిషింగ్ జెట్టీ కావాలన్నా.. దాన్ని వల్ల మాకు మేలు జరుగుతుందని కోరారు. ఫిషింగ్ జెట్టీ ఇవ్వాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. పట్టించుకోలేనే తపన చేయలేదు. ఆ రోజు మాట చెప్పా.. ఆ మేట మేరకు ఫిషింగ్ జెట్టీకి ఇక్కడే శంకుస్థాపన చేయబోతున్నామని సగర్వంగా చెబుతున్నా. మంచినీళ్లపేట, నువ్వలరేవు గ్రామాలకు మంచి జరిగించేందుకు ఫిషింగ్ జెట్టీ తీసుకువచ్చాం. ఫిషింగ్ జెట్టీ పెట్టడమే కాకుండా మత్స్యకారులకు తోడుగా ఉండేందుకు అన్నిరకాల వసతులు కల్పించి తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడే పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ఒక హాల్, మత్స్యకారులందరూ తెచ్చిన చేపల కోసం కోల్డ్‌స్టోరేజీ, వారి సామగ్రి భద్రపరుచుకునేందుకు షెడ్డులు, చుట్టూ కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు, అక్కడే చేపలు అమ్ముకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయబోతున్నాం.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతోరియాలు వచ్చి ఎస్టీ సర్టిఫికెట్లు రావడం లేదన్న మాటలు మర్చిపోలేదు. ఆ మాటలు గుర్తుపెట్టుకొని నేను విన్నాను.. నేను ఉన్నానని చెప్పాను. వారికి మంచి జరిగేందుకు వన్‌మ్యాన్ కమిషన్ నియమిస్తూ.. బుడగజంగాలకు కూడా మాట చెప్పాను. వీరిద్దరి సమస్యలు పరిగణలోకి తీసుకొని మంచి చేసేందుకు అడుగులు వేయాలని జేసీ శర్మతో కూడా వన్‌మ్యాన్ కమిషన్ వేస్తూ జీవో నంబర్ 104 నిన్ననే విడుదల చేయడం జరిగిందని సగర్వంగా చెబుతున్నా. అదే రకంగా తిత్లీ తుఫాన్ బాధితులకు కూడా అండగా ఉంటానని చెప్పాను. తత్లీ తుఫాన్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతున్నాం. ప్రతి కొబ్బరి చెట్టుకు రూ. 15 వందల నుంచి రూ. 3 వేలకు పెంచుతున్నామని చెప్పాను. ఆ చెక్కులు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదేరకంగా జీడితోటకు హెక్టార్‌కు రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతామని చెప్పాం. దానికి కూడా పెంచిన పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని సగర్వంగా చెబుతున్నాం.
మేనిఫెస్టోలో ఇచ్చిన మాటలను మర్చిపోకుండా అన్నిరకాలుగా ప్రజలకు తోడుగా ఉండేందుకు అడుగులు వేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దపీట వేయబోతున్నాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న పరిస్థితులు ఐదేళ్లుగా చూశాం. వంశధార నదిపై నేరేడి వద్ద బ్యారేజీ కట్టడమే కాకుండా ఆ పనులను యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు అడుగులు వేయబోతున్నాం. మహేంద్రతనయ ప్రాజెక్టు పనులు జరగడం లేదు. అడుగులు ముందుకు వేయిస్తాం. యుద్ధప్రాతిపదికన ఆ ప్రాజెక్టు పరుగులు తీయిస్తామని ఇదే వేదికపై నుంచి చెబుతున్నా. నారాయణపురం వద్ద ఉన్న ఆనకట్టు, తోటపల్లి ప్రాజెక్టు పాత కాల్వల ఆధునీకరణ పూర్తి, ప్రతి అడుగు ముందుకు వేస్తూ మీకు తోడుగా ఉంటానని ఈ వేదిక నుంచి భరోసా ఇస్తున్నా.
వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు సగర్వంగా ఈ వేదికపై నుంచి చెబుతున్నా. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలోని ప్రతి వాగ్దానం ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక బైబిల్లా భావిస్తానని ఆరోజు మాట చెప్పా. ఆ మాట ప్రకారం అడుగులు వేస్తున్నాం. సెప్టెంబర్ చివరికి సొంత ఆటో, సొంత ట్యాక్సీ ఉండి నడుపుకుంటున్న వారికి రూ. 10 వేలు ఇవ్వబోతున్నామని సగర్వంగా చెబుతున్నా. ప్రమాణస్వీకారం చేసే రోజు అవ్వాతాతల కోసం మొదటి సంతకం చేశా. పెన్షన్ అక్షరాల గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పెన్షన్ కంటే సగటున సంవత్సరానికి మూడు రెట్లు పెంచి వారికి అండగా ఉండే కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడక ముందు అక్షరాల రూ. వెయ్యి పెన్షన్ ఇవ్వని పరిస్థితిని మార్చేస్తూ రూ. 2250 పెన్షన్ ఇస్తూ మొదటి సంతకం అవ్వాతాతల కోసం చేశా. ఆ పెన్షన్ కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతాం. పెన్షన్ పెంచుకుంటూ ఐదేళ్లలో రూ. 3 వేలకు తీసుకెళ్తాం.
అక్టోబర్ నెలలో అడుగుపెట్టే సరికే 15వ తేదీన రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రతి రైతు కుటుంబానికి అక్షరాల రూ. 12500 ఇవ్వబోతున్నామని సగర్వంగా చెబుతున్నా. అక్టోబర్ 15వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు నెలల కాలంలోనే అక్షరాల నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వమని సగర్వంగా చెబుతున్నాను. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకువచ్చాం. రూ. 5 వేల జీతం ఇస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పథకం పెన్షన్ నుంచి బియ్యం పంపిణీ వరకు, అమ్మ ఒడి నుంచి రైతు భరోసా దాకా, ఇళ్ల పట్టాల నుంచి ఇళ్ల స్థలాల దాకా ప్రతి ప్రభుత్వ పథకం ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేకుండా మీ గడప దగ్గరకు వచ్చి మీ చేతుల్లో పెట్టే పథకానికి శ్రీకారం చుట్టాం.
నవంబర్‌లో మత్స్యకారులకు తోడుగా ఉండేందుకు నవంబర్ 21వ తేదీన ప్రతి మత్స్యకార సోదరుడికి అండగా నిలిచేందుకు ఆ కుటుంబానికి అక్షరాల రూ. 10 వేలు ఇవ్వబోతున్నాం. డీజిల్ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియక అవస్థలు పడుతున్న ప్రతి మత్స్యకార సోదరుడికి చెబుతున్నా. నవంబర్ 21వ తేదీ నుంచి మీ బంకుల్లోనే ప్రతి జిల్లాకు కొన్ని బంకులను డెడికేట్ చేస్తున్నాం. ఆ బంకుల్లో మత్స్యకారులు డీజిల్ తీసుకుంటే సబ్సిడీ వాళ్లకు వస్తుంది. సబ్సిడీ రూ. 6 నుంచి 9 రూపాయలకు పెంచుతున్నాం.
డిసెంబర్ మాసం వచ్చే సరికి మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం తలుపుతట్టి వారి చేతుల్లో రూ. 24 వేలు ఇవ్వబోతున్నాం. జనవరి 26వ తేదీ రిపబ్లిక్‌డే రోజున అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పిల్లలను బడులకు పంపిన తల్లుల చేతుల్లో రూ. 15 వేలు పెట్టబోతున్నాం. ఇంజనీరింగ్, పెద్ద పెద్ద చదువులకు కాలేజీలకు వెళ్లే పిల్లలకు పూర్తి ఫీజురియంబర్స్మెంట్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఆ ప్రతి పిల్లాడికి కాలేజీలకు వెళ్లి చదువుకునేందుకు బోడింగ్, లాడ్జింగ్ కింద రూ. 20 వేలు ఆ పిల్లాడి తల్లి చేతుల్లో పెట్టబోతున్నాం. ఫిబ్రవరి చివరి వారంలో షాపులు ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న టైలర్లకు, రజకులకు రూ. 10 వేలు ఇవ్వబోతున్నాం. మార్చి చివరి వారంలో దూపదీప నైవేద్యాల కోసం అర్చులకు, మసీదుల్లోని ఇమామ్‌లు, మౌజమ్‌లకు, చర్చిల్లోని పాస్టర్లకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చబోతున్నాం. ఉగాది నాడున రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా.. ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు ప్రతి గ్రామంలో అక్కచెల్లెమ్మల పేరిట 25 లక్షల ఇళ్ల పట్టాలను ఇవ్వబోతున్నాం. నాలుగు సంవత్సరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి అక్కకు ఇల్లు కూడా కట్టిస్తానని తమ్ముడిగా చెబుతున్నాను. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామనవమి రోజు వైయస్ఆర్ పెళ్లి కానుక కూడా ఇవ్వబోతున్నాం. ఇలా ప్రతి కార్యక్రమం ఏదైతే చెప్పామో.. లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ము పాత అప్పులు జమ చేసుకునే అధికారం లేకుండా మంచి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం.