నేడు 4 ఫిషింగ్ హార్బర్లకు సీఎం శంకుస్థాపన
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో మత్స్యకారుల కలలు సాకారం కానున్నాయి. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నేడు 4 కొత్త ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా నియోజకవర్గానికో ఆక్వా హబ్ నిర్మాణ కార్యక్రమానికి కూడా సీఎం శ్రీకారం చుట్టనున్నారు. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. రూ.1,510 కోట్లతో 4 ఫిషింగ్ హార్బర్లు, రూ.225 కోట్లతో మొదట 25 ఆక్వా హబ్‌ల నిర్మాణం జరగనుంది. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.3 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.