నేతన్నకు అండగా జగనన్న

20 Jun, 2020 11:13 IST

తాడేపల్లి: కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాటను నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను అమలు చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని రెండో విడత ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేల నగదును నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్‌లోకి జమ చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయనున్నారు. 

వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ప్రారంభం అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్దిదారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 81,024 మంది చేనేతలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం మొత్తం రూ.194.46 కోట్లను పంపిణీ చేయనుంది. కరోనా కారణంగా 6 నెలల ముందుగానే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  అంతేకాకుండా గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లను, కోవిడ్‌ మాస్క్‌లు తయారు చేసిన ఆప్కోకు ఉన్న రూ.109 కోట్ల బకాయిలను సీఎం వైయస్‌ జగన్‌ కాసేపట్లో విడుదల చేయనున్నారు.