పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్‌తో పాటు డ్యామ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. స్పిల్ వేపై నడుచుకుంటూ వెళ్లి పనుల పురోగతిని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనుల తీరు, కొనసాగుతున్న విధానానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన మ్యాప్‌లు, ఫొటో గ్యాలరీని వీక్షించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి.. దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, పేర్ని నాని, రంగనాథరాజు, విశ్వరూప్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎంపీ మార్గాని భరత్ తదితరులు ఉన్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.