ఏలూరు ఘటనపై సీఎం వైయస్ జగన్ ఆరా
పశ్చిమ గోదావరి: ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రాత్రంతా మేల్కొని ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి ఆళ్ల నానిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. ప్రభుత్వం అన్ని విధాల సహాయ చర్యలు తీసుకుంటుందని, బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 'వ్యాధి లక్షణాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏలూరుకు వైద్యబృందాలను పంపిస్తున్నాం. ఎలాంటి భయాందోళన చెందొద్దు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులయిన వైద్య పరీక్షలు చేయిద్దాం. అవసరమయితే మెరుగైన వైద్యసదుపాయం కల్పించడం కోసం అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రత్యేక వైద్యబృందాలు ఈ ఉదయం ఏలూరుకు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని' సీఎం వైయస్ జగన్ మంత్రి ఆళ్లనానికి భరోసా ఇచ్చారు.
ఏలూరులో ప్రాంతంలోని ప్రజలు ఉన్నట్టుండి అస్వస్తతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరుతున్నారు. పూర్తిస్థాయి పరీక్షల అనంతరం 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. అదే విధంగా టెస్టుల కోసం శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంత్రి ఆళ్ల నాని ఆదేశంతో ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌లు, ఇంటింటి సర్వే చేపడుతున్నారు.