సీఎం వైయస్‌ జగన్‌ బీసీల పక్షపాతి

10 Sep, 2019 15:19 IST

విజయవాడ: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బీసీలకు అండగా నిలిచారని, తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారని రవాణా, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సమస్యలు పరిష్కరించడమే కాకుండా, చట్ట సభల్లో బీసీలను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని వివరించారు. మంగళవారం విజయవాడలో జరిగిన నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించమని వెళ్లిన నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బెదిరించారని గుర్తుచేశారు. మత్స్యకారులను బెల్టుతో తోలు ఊడదిస్తానని చంద్రబాబు హెచ్చరించారని గుర్తుచేశారు. బీసీల పట్ల  చంద్రబాబు కించపరిచేలా వ్యహరించారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మాత్రం బీసీలకు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. 

షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని ప్రజా సంకల్ప  పాదయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం రూ. 10 వేలు ప్రకటించారని మంత్రి కొడాలి నాని చెప్పారు.  అణగారిన వర్గాలు, పేదల కష్టాలను దగ్గరుండి చూశారు కాబట్టే వారికి నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. నాయీ బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నారని, వారికి ఇచ్చిన హామీలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.