దెందులూరు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరు పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన సీఎం వైయస్ జగన్ మరికాసేపట్లో దెందులూరు చేరుకోనున్నారు. `వైయస్ఆర్ ఆసరా` బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రసంగం అనంతరం వరుసగా మూడో ఏడాది వైయస్ఆర్ ఆసరా పథకం సాయాన్ని విడుదల చేయనున్నారు. రూ. 6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైయస్ఆర్ ఆసరా పథకం కింద ఇప్పటివరకు వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. పది రోజుల పాటు జరిగే ‘ఆసరా’ పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్దిదారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారు.