నవంబర్‌ 2వ తేదీ నుంచి స్కూళ్లు 

20 Oct, 2020 17:39 IST

తాడేపల్లి: నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండురోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులు మరో రోజు నిర్వహిస్తారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడురోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేస్తాయి. మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు. నవంబర్‌ నెలలో ఇది అమలవుతుంది. డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే వారి కోసం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు’’ అని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు.