రాష్ట్ర ప్రజలకు సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు
25 Dec, 2021 09:28 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని సీఎం అన్నారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం, ఇవీ జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేర్కొన్నారు.