సరైన కార్యాచరణ రూపొందించండి

1 May, 2020 16:09 IST

తాడేపల్లి: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేఅవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. కరోనా నివారణ చర్యలపై జరిగిన సమీక్షలో అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ ఈ విషయాన్ని చర్చించారు. క్వారంటైన్‌లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నవారి విషయంలో కూడా సరైన విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజలను స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు.