కాసేపట్లో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి భూమి పూజ
అనంతపురం: జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి కాసేపట్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఈ పనులకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభాస్థలి, రిజర్వాయర్ల పైలాన్, వాహనాల పార్కింగ్, భోజన కౌంటర్లు, ఎల్‌ఈడీ స్క్రీన్స్ వంటి ఏర్పాట్లను మంగళవారం పూర్తి చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు, జేసీ నిశాంత్‌కుమార్, ఆర్డీఓ మధుసూదన్‌లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నారు. ‘ప్రజాసంకల్ప’ యాత్రలో నియోజకవర్గ సమస్యలను స్వయంగా చూసిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకిచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలో దేవరకొండ రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణాల ద్వారా రైతాంగానికి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.