లడ్డూపై అసత్య ప్రచారం బట్టబయలయ్యాక డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర
కోనసీమ జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేయడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారం పూర్తిగా బట్టబయలైందన్నారు. స్వామివారి లడ్డులో ఎటువంటి జంతు కొవ్వు పదార్థాలు కలవలేదని సీబీఐ స్పష్టంగా వెల్లడించడంతో, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధాలు ప్రజల ముందుకు వచ్చాయని చెప్పారు. ఈ నిజం ప్రజల దృష్టిలో నిలిచిపోకుండా చేయడానికే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయడం, ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురిచేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ దాడికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు.