ముగిసిన సీఎం వైయస్ జగన్ తిరుమల పర్యటన
తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండ్రోజుల తిరుమల పర్యటన ముగిసింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 11వ తేదీన మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్.. అక్కడి నుంచి నేరుగా తిరుపతి బర్డ్ ఆస్పత్రికి చేరుకొని శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకొని అలిపిరి నుంచి తిరుమల జీఎన్‌సీ టోల్‌గేట్ వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును ప్రారంభించారు. అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేసి శ్రీవేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరాన్ని, గోతులాభారం ప్రారంభించారు.
11వ తేదీ సాయంత్రం బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న స్వామివారిని దర్శించుకొని తిరునామం, పంచెకట్టు, తలకు పట్టువస్త్రంతో కట్టిన పరివట్టంతో, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణాల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తీర్థప్రసాదాలు స్వీకరించి 2022 తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. అనంతరం గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బస చేశారు.
12వ తేదీ ఉదయం శ్రీవారిని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీయోగనరసింహ స్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామి భక్తి ఛానల్‌కు సంబంధించి ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను సీఎం ప్రారంభించారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం రూ.10 కోట్లతో నిర్మించిన నూతన బూందీపోటు భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండ్రోజుల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.