బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం
తాడేపల్లి: మహిళలు, బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యక్రమం లక్ష్యమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశంలో దాదాపు 23 శాతం మంది చిట్టితల్లుల చదువులు ఆగిపోవడానికి రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులే ప్రధాన కారణమని యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ కొలబరేటీవ్ కౌన్సిల్ నివేదికలో స్పష్టమైందని, ఇటువంటి పరిస్థితులు మారాలనే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. చిట్టితల్లులకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని, ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మందికి పైగా ఉన్న చిట్టితల్లులకు బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్కిన్స్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ వివరించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బాలికల ఆరోగ్య, పరిశుభ్రత కోసం చేపట్టే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ఏం మాట్లాడారంటే..
‘నాడు–నేడు పథకం ద్వారా మరుగుదొడ్లు మెరుగుపర్చడం జరుగుతుంది. స్వేచ్ఛ పేరుతో మనందరి ప్రభుత్వం తీసుకువస్తున్న కార్యక్రమం కూడా బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతలో భాగమే. దేవుడి సృష్టిలో భాగమైన రుతుక్రమానికి సంబంధించిన అంశాలను పిల్లలు ఎదుర్కొనే సమస్యలను, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం ఒక తప్పు అనే పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి పోయి.. ఇటువంటి విషయాల్లో ఆ చిట్టితల్లులకు తగినంత అవగాహన కల్పించాలి. ఒక బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రామ సచివాలయంలోని ఏఎన్ఎంలు అందరూ కూడా అవగాహన కార్యక్రమం చేపట్టి పిల్లలను చైతన్యం చేయాలి.
నెలకు ఒకసారి 7 నుంచి 12 తరగతి చదువుతున్న పిల్లలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టాలి. నెలకు ఒకసారి జరిగే అవగాహన కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్న మహిళా అధ్యాపకురాలే కాకుండా.. ఏఎన్ఎం, గ్రామ సచివాలయంలోని మహిళా పోలీస్ కూడా భాగం కావాలి. ఓరియంటేషన్లో జాగ్రత్తలు ఏమేమీ తీసుకోవాలనే అంశాలే కాకుండా మహిళా పోలీస్.. దిశ యాప్ డౌన్లోడ్, దిశ యాక్ట్ గురించి మహిళా పోలీస్ అవగాహన కల్పిస్తారు. ఇవన్నీ స్తీ్ర, శిశు సంక్షేమ శాఖ, హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో చేపట్టాలి. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలోని ఆసరా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ జరగాలి.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా ఉన్న 7 నుంచి 12 తరగతి వరకు ఉన్న పిల్లలందరికీ దాదాపు రూ.32 కోట్లతో నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అన్నీంటిలో కూడా దాదాపు 10 లక్షల పైచిలుకు ఉన్న చిట్టితల్లులకు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్‌కు చెందిన విష్పర్ శానిటరీ న్యాప్కిన్స్ కాకుండా యూపీ గొరక్పూర్కు చెందిన నైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో ప్రఖ్యాత బ్రాండ్‌ను కూడా తీసుకువచ్చాం. నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్స్ ఒక్కో చిట్టితల్లికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 ఉచితంగా అందజేయడం జరుగుతుంది. సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు స్కూల్స్‌లో ఒకేసారి ఇచ్చేస్తారు.
స్వేచ్ఛ పథకం అమలు కోసం ప్రతి పాఠశాల, కళాశాలలో నోడల్ అధికారిగా ఒక మహిళా అధ్యాపకురాలిని నియమిస్తున్నాం. వినియోగించిన శానిటరీ న్యాప్కిన్స్ను కూడా ఎలా డిస్పోస్ చేయాలనే విషయాల మీద కూడా అవగాహన కల్పిస్తారు. వినియోగించిన శానిటరీ న్యాప్కిన్స్ సురక్షితంగా డిస్పోస్ చేసేందుకు వాటిని భస్మం చేసి పర్యావరణ రహితంగా మార్చేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6,417 ఇన్స్నరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీలు అయితే సపరేట్ డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. స్కూల్స్‌లో బాత్రూమ్లలోనే ఇన్స్నరేటర్ పెట్టడం జరిగింది. వీటిపై నోడల్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తారు.
ఇది గ్రామస్థాయిలో కూడా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో తక్కువ ధరకే నాణ్యమైన శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నాం. వైయస్ఆర్ చేయూత దుకాణాల ద్వారా విక్రయించే కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 56,703 ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో, మన బడి నాడు–నేడు ద్వారా నిరంతర నీటి సరఫరాతో కూడిన బాత్రూమ్లను కూడా చిట్టితల్లుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నాం. మొదటి దశ నాడు–నేడు కింద 15,715 పాఠశాలల్లో బాలిక టాయిలెట్స్ నిర్మాణం పూర్తయింది. జూలై 2023 నాటికి అన్ని పాఠశాలల్లో నిర్మాణం పూర్తిచేసి ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా హెడ్మాస్టర్తో కూడిన పేరెంట్స్ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నాం.
మహిళా సాధికారతలో దేశంలో 28 రాష్ట్రాలకంటే ముందున్నాం. అమ్మఒడి, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ సున్నావడ్డీ రుణాలు, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఇళ్ల పట్టాలు, వైయస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం, ఇలా ఏ పథకం తీసుకున్నా.. అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం మనదని రెండున్నరేళ్ల మన ప్రభుత్వ పాలన చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. చరిత్రను మార్చే శక్తి మన రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు ఉందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. కచ్చితంగా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇవాళ చేస్తున్న పాలన కంటే ఇంకా మెరుగైన పాలన ఇవ్వాలని ప్రార్థిస్తూ ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెప్పారు.