ఈనెల 8న క‌ల్యాణ‌దుర్గంలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌

5 Jul, 2023 17:14 IST

అనంత‌పురం: ఈనెల 8వ తేదీన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ల్యాణ‌దుర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఉషా శ్రీ‌చ‌ర‌ణ్‌, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్, ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం ప‌రిశీలించారు. అనంత‌రం అధికారుల‌తో మంత్రులు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి, కాపు రామ‌చంద్రారెడ్డి, వెంక‌ట్రామిరెడ్డి, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాస రావు, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 8న కల్యాణదుర్గంలో నిర్వ‌హించే రైతు దినోత్స‌వంలో సీఎం వైయస్‌ జగన్ పాల్గొంటార‌ని చెప్పారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జయంతి రోజున ప్రభుత్వం ప్రతియేటా రైతు దినోత్సవం నిర్వహిస్తోంద‌ని గుర్తుచేశారు. కల్యాణదుర్గం సభలో ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్య‌మంత్రి విడుదల చేస్తారని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి అని,  రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే సొంత‌మ‌న్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని, ఆర్బీకేల ద్వారా విత్త‌నం నుంచి విక్ర‌యం వ‌ర‌కు రైతుల‌కు అన్ని విధాలుగా తోడుగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిలుస్తోంద‌ని చెప్పారు.