అక్కచెల్లెమ్మలకు మాటిచ్చా.. అండగా నిలిచా
చిత్తూరు: ‘‘అక్కచెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని మాటిచ్చా.. గత 18 నెలలుగా అదే దిశగా అడుగు వేస్తూ వచ్చా. అక్కచెల్లెమ్మలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండేలా ప్రతి పథకాన్ని రూపొందించా’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ పండుగ– ఇంటి నిర్మాణం ప్రారంభించే పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో ఇళ్లు లేని అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వుతో పండుగ జరుగుతుందన్నారు. ‘ప్రతి అక్కచెల్లెమ్మకు అన్నగా, తమ్ముడిగా ఇంతకన్నా నా జీవితానికి ఇంకేం కావాలి. దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు’ అని సీఎం అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ స్థలాల్లో 28.30 లక్షల ఇళ్లు, 2.62 లక్షల టిడ్కో ప్లాట్లు అన్నీ కలిపి 30.75 లక్షల ఇళ్ల నిర్మాణం రెండు దశల్లో పూర్తిచేయబోతున్నామని మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నానని సీఎం అన్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 2.50 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని, మొదటి దశ కింద 1,78,840 ఇళ్లను ఈ జిల్లాలో నిర్మించడానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించిన సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
సీఎం ఏం మాట్లాడారంటే..
ఊరందూరులో 6,232 మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఇళ్ల నిర్మాణ ప్లాన్‌లో ఆర్బీకే, వైయస్‌ఆర్ హెల్త్ క్లినిక్, వార్డు సెక్రటేరియట్, కల్యాణ మండపం, పార్కులు, గవర్నమెంట్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, ఆటో స్టాండ్, వైయస్‌ఆర్ జనతా బజార్ తీసుకురాబోతున్నాం.
వేదికపై రాకముందు కలెక్టర్‌ను అడిగా.. ఊరందూరులో మనం ఇచ్చే స్థలాలకు మార్కెట్ రేట్ ఎంత అని అడిగాను. పక్కనే ఒక లేఅవుట్ ఉంది.. ఆ లేఅవుట్‌లో రెండున్నర సెంట్ల భూమి రూ.18 లక్షలకు అమ్ముతున్నారని కలెక్టర్ చెప్పారు. అంటే సెంటు రూ.7 లక్షలు. ఇవాళ మనం ఇచ్చే ప్లాట్ విలువే రూ.7 లక్షలు. ప్రతి అక్కచెల్లెమ్మకు అన్నగా, తమ్ముడిగా ఇంతకన్నా.. నా జీవితానికి ఇంకేం కావాలి. దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు.
రూపాయి విలువ అక్కచెల్లెమ్మలు తెలిసినంతగా పురుషులకు తెలియదు. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఇళ్లు బాగుంటుంది. అక్కచెల్లెమ్మల ఇళ్లులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మాను కాబట్టే.. ప్రతి అడుగు అక్కచెల్లెమ్మలను మంచిస్థానంలో కూర్చోబెట్టే దిశగా అడుగులు వేశా.
అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ప్రతి రూపాయి తన కుటుంబం బాగుండాలని ఖర్చు చేస్తుంది. ఇది నిజం కాబట్టే అక్కచెల్లెమ్మల కోసం అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చా. అక్షరాల 43 లక్షల మంది తల్లులకు రూ.6,350 కోట్లు ఇచ్చే అవకాశం నాకు ఆ దేవుడు కల్పించాడు. విద్యాదీవెన కింద 18.52 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4000 కోట్లు ఇవ్వగలిగాను. వసతి దీవెన కింద 15.56 లక్షల మంది తల్లుల చేతుల్లో రూ.1,221 కోట్లు పెట్టగలిగాం. ఆసరా కింద ప్రతి పొదుపు సంఘాల్లో ఉన్న 87.74 లక్షల అక్కచెల్లెమ్మలకు తొలి విడతగా రూ.6,792 కోట్లు ఇచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మ సంతోషంగా ఉండాలని, వారి కాళ్ల మీద వారు నిలబడాలని వైయస్‌ఆర్ చేయూత పథకం తీసుకువచ్చాం. 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు అందజేశాం. పొదుపు సంఘాలకు సున్నావడ్డీ పథకం కింద 87 లక్షల అక్కచెల్లెమ్మల తరఫున కట్టాల్సిన వడ్డీ రూ.1400 కోట్లు ప్రభుత్వం కట్టింది. కాపు నేస్తం కింద 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.491 కోట్లు వారి చేతికే అందజేశాం.
ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా.. అక్కచెల్లెమ్మలపై మమకారంతో.. ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎక్కడా అవినీతికి, వివక్షకు తావులేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశాం. ఈ పథకాలు అన్నింటితో పాటు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమం కూడా అక్కచెల్లెమ్మల పేరు మీదనే చేస్తున్నాం.
అక్కచెల్లెమ్మలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా వారిని ఉన్నతస్థానంలో కూర్చోబెట్టాలనే ఆరాటంతో చట్టాలు చేశాం. ఆలయ ట్రస్టు బోర్డు పదవులు, మార్కెట్ కమిటీ పోస్టులు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, రాజకీయ నియామకాల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకు చెందాలని ఏకంగా చట్టాలు చేసిన ప్రభుత్వం.. మీ అందరి ప్రభుత్వం.. మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నా.
ఇలా ఏ కుటుంబానికి అయినా కూడా పక్కా ఇళ్లు లేకపోవడం అంటే ఎండా,వాన, చలి ఈ మూడింటిని భరిస్తూ బతకడం. పేదవాడు ఎలా బతుకుతున్నాడని నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో నా కళ్లారా చూశా. వానకు, గాలి వచ్చినా ఎత్తిపోయే ఇరుకు గుడిసెలు చూశా. అలాంటి గుడిసెల్లో నివసిస్తున్న ఎందరో అక్కచెల్లెమ్మలను చూశా. అద్దె ఇళ్లలో వారు సంపాదించే డబ్బులో కనీసం 35 శాతం అద్దెలు కట్టుకునేందుకు ఖర్చు చేస్తున్న అక్కచెల్లెమ్మలను చూశా. ఇలా ఇళ్లు లేని పరిస్థితుల్లో గడుపుతున్న అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రణాళికలో చెప్పా.. రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు కట్టించి.. అక్కచెల్లెమ్మల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పా. ఈ రోజు గర్వంగా చెబుతున్నాను.. చెప్పిన 25 లక్షలకు మించి 31 లక్షల పక్కా ఇళ్లను సంతృప్తస్థాయిలో అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నాను.
ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో, ఇళ్లు కట్టించి ఇచ్చే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కులం, మతం, ప్రాంతం చూడలేదు, చివరకు రాజకీయాలు చూడలేదు, వారు ఏ పార్టీ వారు అని కూడా చూడలేదు. నాకు ఓటు వేయనివారైనా సరే అర్హత ఉన్నవారందరికీ ఇళ్ల స్థలాలు రావాలనే దృక్పథంతోనే అడుగులు ముందుకువేశాం. ఒక బాధ్యతగా ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నాం. స్థలం కొనుగోలు చేసి మరీ ఇస్తున్నాం.
పారదర్శకత అనేది ఏస్థాయికి తీసుకెళ్లామంటే.. ఇళ్లు ఇచ్చే అక్కచెల్లెమ్మల జాబితాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం డిస్‌ప్లే చేశాం. ఇంకా ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే వెరిఫై చేసి 90 రోజుల్లోనే ఇంటి పట్టా ఇచ్చే నిరంతర ప్రక్రియగా చేశామని గర్వంగా చెబుతున్నాను.
మన ప్రభుత్వం 31 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టించబోతుంది. ఒక్కో కుటుంబంలో సగటున నలుగురు ఉంటారనుకుంటే.. ఏకంగా 1.24 కోట్ల మందికి పక్కా ఇంటిని భూమితో సహా ఇస్తున్న ప్రభుత్వం మనదని గర్వంగా చెబుతున్నాను. 1.24 కోట్ల మంది అంటే.. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా 4.95 కోట్లు. అటువంటిది.. 1.24 కోట్ల మందికి మేలు జరిగేలా ఇళ్లు కట్టిస్తున్నాం. అది కూడా ఒక్క రూపాయి కూడా వారు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కట్టిస్తున్నాం. ఏకంగా మూడు, నాలుగు జిల్లాల జనాభా కలిపితే ఏమేరకు అవుతుందో.. ఆ మేరకు ఈ రోజు వైయస్‌ఆర్ జగనన్న కాలనీలు రాబోతున్నాయి. 17 వేల రెవెన్యూ గ్రామాలు మన రాష్ట్రంలో ఉంటే.. 17,005 లేఅవుట్‌లు వస్తున్నాయని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇవి కాలనీలు కాదు.. ఊర్లు రాబోతున్నాయి.
ఇళ్లు మాత్రమే కట్టించడం కాదు.. ఆ ఇళ్లకు సంబంధించి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇంకా ఇటువంటి మౌలిక సదుపాయలు కల్పించేందుకు దాదాపుగా రూ. 7 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేయబోతున్నాం. ఇంకా ఈ కాలనీల విస్తీర్ణాన్ని బట్టి, జనాభా సంఖ్యను బట్టి పార్కులు, స్కూళ్లు, అంగన్‌వాడీలు, విలేజ్ క్లినిక్స్, కమ్యూనిటీ హాల్స్ తీసుకురాబోతున్నాం.
గతంలో 224 చదరపు అడుగుల ఇల్లును కడితే.. ఆ ఇంటిని 344 చదరపు అడుగుల ఇంటిని నిర్మించేందుకు శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇచ్చే ఇంటి స్థలాల విలువ అక్షరాల 68,361 ఎకరాల భూమిలో లేఅవుట్‌లు వేసి అభివృద్ధి చేసి ఇస్తున్నాం. వీటి మార్కెట్ విలువ అక్షరాల రూ.25,530 కోట్లు అని గర్వంగా చెబుతున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి 1.5 సెంట్ల వరకు ఎంత వీలైతే అంత ఇచ్చేట్లుగా లేఅవుట్లను తయారు చేశాం.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాల పంపిణీ రోజే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా స్వాధీనపరుస్తున్నాం. ప్రతి లేఅవుట్‌లో ఒక మోడల్ హౌస్ కట్టిస్తున్నాం. అదే మాదిరిగా ప్రతి కాలనీలో ఇళ్లు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక బెడ్‌రూం, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, సింటెక్స్ ట్యాంక్‌తో పాటు రెండు ఫ్యాన్స్‌లు, రెండు ట్యూబ్‌లైట్లు, రెండు ఎల్‌ఈడీ బల్బులు కూడా ఇవ్వబోతున్నాం.
కాలనీల్లో పచ్చదనం పెంపొందించడం కోసం అక్షరాల 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతుంది. దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇందులో మొదటి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. రెండో దశ కింద మిగిలిన 12.75 లక్షల ఇళ్ల నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.
2.62 లక్షల టిడ్కో ప్లాట్లను అక్కచెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. ఈ ఏడాది కొన్ని, వచ్చే ఏడాది కొన్ని , ఆ తరువాతి సంవత్సరం మిగిలినవి అన్నీ పూర్తిచేస్తాం. టిడ్కో ప్లాట్లు పూర్తిచేయడం కోసం దాదాపుగా రూ.9,500 కోట్లు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. ఈ టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటికి అయ్యే పూర్తి ఖర్చును మన ప్రభుత్వం భరిస్తుంది. కేవలం ఒక్క రూపాయికే అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. అందులో భాగంగా సేల్ అగ్రిమెంట్ కూడా ఇవ్వబోతున్నాం.
టిడ్కో ప్లాట్లకు సంబంధించి దాదాపుగా 2.62 లక్షల లబ్ధిదారులు ఉంటే.. దాంట్లో 1.40 లక్షల 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులను.. మీకు ఒక్క రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న స్కీమ్ కావాలా..? లేక రూ.2.65 లక్షల బ్యాంకు లోన్ మీ పేరు మీద రాసి.. ఆ అప్పును తీర్చడం కోసం నెలనెలా రూ.3 వేలు కడుతూ.. వడ్డీతో సహా రూ.7.20 లక్షలు కట్టే చంద్రబాబు స్కీమ్ కావాలా..? అని ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అడిగాం. దాంట్లో చంద్రబాబు స్కీమ్ కావాలని చెప్పినవారు ఒక్కరు మాత్రమే. అడిగినట్లుగానే చంద్రబాబు స్కీమ్ ఇస్తాం.
300 చదరపు అడుగుల ప్లాట్లు రూపాయికే ఇస్తున్నాం. 365 చ.అ, 435 చ.అ ప్లాట్లు వారు కూడా కట్టాల్సిన ముందస్తు వాటా సొమ్మును మన ప్రభుత్వం 50 శాతం భరిస్తుంది. ఈ మాదిరిగాఒక్కరూపాయికి టిడ్కో ప్లాట్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ.3,805 కోట్లు. 365, 435 చదరపు అడుగుల ప్లాట్లకు సంబంధించి వారు కట్టాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం మనందరి ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి దాని భారం రూ.482 కోట్లు. టిడ్కోలో అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వంపై అదనంగా రూ.4287 కోట్ల భారం పడుతుంది. ఈ భారాన్ని చిరునవ్వుతో భరిస్తాం.
ఇంటి స్థలానికి వస్తే.. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు మీ చేతికి ఇస్తుంది.. మీరే దగ్గరుండి ఇళ్లు కట్టుకోవచ్చు. రెండవది.. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని లబ్ధిదారుడు తెచ్చుకుంటే దానికి కూడా మీకే అవకాశం ఇస్తాం.. సామగ్రి తెచ్చుకోండి.. ఇల్లు కట్టుకోండి.. దశల వారీగా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మూడవ ఆప్షన్... మీరే కట్టించి ఇవ్వండి అని చెప్పినా పర్వాలేదు.. దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సామగ్రి సరఫరా చేయడంతో పాటు దగ్గరుండి మీ చెయ్యి పట్టుకొని అన్ని రకాల అవసరాలకు సహాయ సహకారాలు అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వాలేదు.. అధికారులు వచ్చి ఇంటి నిర్మాణ పత్రాల ఇచ్చి ఫొటో కూడా తీస్తారు. మీరు టిక్ పెట్టిన ఆప్షన్ పేపర్‌ను తీసుకుంటారు.
ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకున్న ఐదేళ్ల తరువాత అక్కచెల్లెమ్మలకు అనుకోని అవసరం వస్తే అమ్ముకోవాలన్నా.. తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చుకోవాలన్నా.. అన్ని హక్కులు ఉండే విధంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని నేను తాపత్రయపడ్డాను.
కొందరు స్వార్థపరుల కుట్రల వల్ల అడ్డంకులు ఏర్పడి.. ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం వల్ల అక్కచెల్లెమ్మలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అర్హులైన అక్కచెల్లెమ్మలందరికీ డీ–ఫాం పట్టాలు పంపిణీ చేస్తున్నాం. దేవుడి ఆశీసులు, ప్రజల చల్లని దీవెనలతో అడ్డంకులు తొలగిన వెంటనే డీ–ఫాం పట్టాల స్థానంలో సర్వహక్కులతో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం.
చంద్రబాబు, ఆయన సహచరులు కలిసి కేసులు వేసి స్టేలు తీసుకురావడంతో 25వ తేదీన ఇవ్వాలనుకున్న 31.75 లక్షల ఇళ్ల పట్టాలకు గానూ అందులో 10 శాతం అంటే 3.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. డిసెంబర్ 25వ తేదీన వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, శుక్రవారం కలిసి వచ్చిన మంచి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిసి కూడా అంతకు ముందు రోజు ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకునేందుకు హైకోర్టులో పిల్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు, ఆయన సహచరులు ఎంత శాడిస్టులుగా ఉన్నారంటే.. నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకుంటూ స్టే తీసుకువచ్చారు.. ఈ రాక్షసులు, దుర్మార్గులు.
అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని కార్యాచరణ చేస్తే.. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని.. చంద్రబాబు మనుషులు కోర్టుకు వెళ్లి కేసులు వేశారు.. ఆ పిటీషన్ చూసి కోర్టు స్టే ఇవ్వడం నాకు ఆశ్చర్యం అనిపించింది.
విశాఖపట్నంలో 1.80 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం పూనుకొని.. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు తీసుకున్నాం. భూమలు ఇచ్చినవారికి ఎటువంటి అభ్యంతరం లేదు.. పట్టాలు తీసుకునే పేదవాడు సంతోషంగా ఉన్నాడు.. కానీ, ఆ భూములకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి కోర్టులో కేసులు వేయడం.. ఆ కేసుల మీద స్టేలు రావడం. ఇలాంటి ఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది.
రాజమండ్రిలో ఇళ్ల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది. ఆ భూములు ఆవా భూములు కాకపోయినా.. కోర్టులో కేసు వేయడం.. స్టేలు తీసుకురావడం. ఆ స్టే వల్ల 27 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందకుండా అడ్డంకులు సృష్టించారు. చివరకు వీళ్లు స్టే తీసుకువచ్చే పరిస్థితి ఎలా ఉందంటే.. ఏపీఐఐసీ, మైనింగ్ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ భూములను ప్రభుత్వమే నిరుపేదలకు ఇస్తున్నా కూడా.. కోర్టులకు వెళ్లి స్టే తీసుకురావడం. దీని వల్ల మరో 34 వేల ఇళ్ల పట్టాలను అడ్డుకున్నారు.
1978లోనే జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ఇల్లు అనేది లీగల్ రైట్. దీని కోసం ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే.. రకరకాల సందర్భాల్లో కోర్టుకు వెళ్లడం.. స్టే ఇవ్వడం చూస్తుంటే.. నిజంగా బాధ అనిపిస్తుంది. వీరికి మానమత్వం ఉందా..? పేదవాడికి జరిగే మంచిని అడ్డుకునేవారు ప్రజాజీవితంలో ఉండేందుకు అర్హులేనా అని సందేహం కలుగుతుంది. కచ్చితంగా ఇటువంటి వారికి దేవుడు మొట్టికాయలు వేస్తాడు..
మిగిలిపోయి ఉన్న 3.74 లక్షల అక్కచెల్లెమ్మలకు కూడా త్వరలోనే కోర్టుల్లో కేసులు పరిష్కారమై.. ఇళ్ల పట్టాలను దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఇస్తామని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తున్నాను.
ఇంటి నిర్మాణం అంటే ముగ్గుపోసి పునాదులు తవ్వడంతో మొదలుపెడితే ఇటుకలు చేసేవారికి, సిమెంట్ మోసేవారికి, కంకర తయారీ చేసేవారికి, తాపీ మేస్త్రీలకు, కూలీలకు, వడ్రంగులకు, కరెంట్ పనిచేసే వారికి, వెల్డర్లు, టైల్స్, చివరకు ఆటో తోలేవారికి కూడా మేలు జరుగుతుంది. ఇలా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా.. 31 లక్షల ఇళ్ల నిర్మాణంలో మొదటి దశలో 15.60 ఇళ్లకు 69.70 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 7.4 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ ఇవన్నీ అవసరం అవుతాయి. ఈ కార్యక్రమంతో వ్యవస్థలోకి ఎకనామిక్ బూస్టు వస్తుంది. ఉపాధి పెరుగుతుంది.. ఆదాయం పెరుగుతుంది. ఎకనామిక్ యాక్టివ్ వల్ల రాష్ట్రానికి జీఎస్‌డీపీ కూడా భారీగా పెరిగే పరిస్థితి వస్తుంది.
దేవుడు ఆశీర్వదించి.. మీ అందరి చల్లని దీవెనల వల్ల ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం వల్ల మీ అందరి జీవితాలు మారాలని, మీ అందరి జీవితాల్లో చిరునవ్వులు చూడాలని, వెలుగులు రావాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తిలో శ్రీకారం చుడుతున్నాం.