ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీసింది చంద్రబాబే

9 Dec, 2025 20:06 IST

 తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయానికి ఆలవాలం కాగా, అది మన రాష్ట్ర బ్రాండింగ్‌ అని, అలాంటి బ్రాండింగ్‌ను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారని వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆక్షేపించారు. దేశానికి దక్షిణ ధాన్యాగారంగా ఉన్న ఏపీ బ్రాండ్‌ను సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా? అని ఆయన నిలదీశారు. రైతు హితాన్ని గాలిలో కలిపింది చంద్రబాబే అని గుర్తు చేశారు. చంద్రబాబు సంపద సృష్టి ఒక అభూతి కల్పన అన్న ఆయన, రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేయడం మాత్రమే వాస్తవం అని చెప్పారు. ఏడాదిన్నరలో రికార్డుస్థాయిలో అప్పులకు అదే తార్కాణం అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..:

బ్రాండింగ్‌పై బాబు మాటలు సిగ్గుచేటు:
    విభజనతో సహజ వనరులు కోల్పోయిన రాష్ట్రానికి వ్యవసాయం ప్రధాన ఆధారం. అది ఏపీ అసలు బ్రాండ్‌. ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రాన్ని దెబ్బ తీసింది చంద్రబాబు పాలనే. ఎన్టీఆర్‌ను కూలదోసి కుర్చీలో కూర్చున్న రోజు నుంచే చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. ఆయన పాలనలో రైతు హితం ఎప్పుడూ లేదు. తన పాలనలో ఎప్పుడూ రైతు సంక్షేమాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు ఇప్పుడు బ్రాండింగ్‌పై మాట్లాడటం సిగ్గు చేటు. ఆంధ్రప్రదేశ్‌ ఒకప్పుడు దేశానికి ‘దక్షిణ ధాన్యాగారం’గా పేరొందింది. అలాంటి బ్రాండ్‌ ఇమేజ్‌ను సీఎం చంద్రబాబు దారుణంగా దెబ్బ తీశారు.

మారాల్సింది మీరే. ప్రజలు కాదు:
    రైతుల కష్టాలను అర్థం చేసుకోకుండా, వారికి సలహాలు ఇచ్చే ముందు చంద్రబాబు తన ఆలోచనా విధానంలో మార్పు చేసుకోవాలి.  50 ఏళ్ల రాజకీయ అనుభవం, 78 ఏళ్ల వయసులో కూడా రైతులపై ఇలాంటి అవహేళనాత్మక వ్యాఖ్యలు చేయడం విచారకరం. రైతులకు తాము కావాలనుకున్న పంటలు పండించొద్దని, ప్రజలు తినే పంటలే పండించాలని చంద్రబాబు చెప్పడం వ్యవసాయాన్ని అవమానపరిచే వ్యాఖ్యలే. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని తెలిసీ, రైతులను చిన్నచూపు చూడటం చంద్రబాబుకే సాధ్యం.
    అనంతపురం జిల్లా రైతులకు తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు వేరుశనగ తప్ప ఇంకో పంట తెలియదని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు. తాము వచ్చాక 51 రకాల పంటలు పండించడం నేర్పించామని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. మరి అదే అనంతపురం జిల్లాలో ఆయన బీడు పొలాల్లోని నారుమడి ఫోటోలు, మెడపై గన్‌ వేసుకొని వెళ్లిన షూటింగ్‌ ఫొటోలు ఇంకా మా వద్ద ఉన్నాయి. ఇప్పుడు అరటి, మామిడి, ఉల్లి బాగా పండిస్తున్నారు. నిజమే? మరి వాటికి కనీస మద్దతు« ధర ఉందా? అది లేక రైతులు తమ పంటలు రోడ్లపై పారేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. అందుకే మారాల్సింది ప్రజలు కాదు. చంద్రబాబే.

చంద్రబాబు అర్థం లేని మాటలు:
    రైతు భరోసా కేంద్రానికి రంగు వేసి, అదే భవనాన్ని రైతు సేవా కేంద్రం అంటూ చూపించి రైతులకు ఆర్టీజీఎస్‌ ద్వారా పంటలు ఎలా వేసుకోవాలో నేర్పిస్తామని చంద్రబాబు చెప్పడం మరో నాటకమే. పుట్టెడు బాధలో ఉన్న రైతు ఈ మాటలు వింటే.. చంద్రబాబుకు వయసు వచ్చింది, కానీ బుద్ధి మాత్రం మారలేదని అనుకోవడం సహజం. రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారంటూ, సహజ సేద్యమే చేయాలని చెప్పడం రైతులను తప్పుదారి పట్టించడమే. రైతు అత్యాశతో వ్యవసాయం చేస్తాడని చంద్రబాబు చెప్పడం, వారిని అగౌరవపరచడమే అవుతుంది. 

అప్పులపై నాలుక మడత పెట్టిన చంద్రబాబు:
    వైయస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పు.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం 18 నెలల అప్పు.. పోల్చి చూస్తే ఎవరిది దివాళకోరు పాలన అన్నది స్పష్టమవుతుంది. జగన్‌గారి ప్రభుత్వం భవిష్యత్‌ ఆదాయాన్ని, ఆస్తులను తాకట్టు పెట్టిందని ఆరోపిస్తున్న చంద్రబాబు, వాస్తవానికి తానే ఆ పని చేశారు. భవిష్యత్‌ ఆదాయాల నుంచి రూ.1.91 లక్షల విలువైన కోట్ల ప్రజా ఆస్తులను కేవలం రూ.9 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయని విధంగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ అప్రూవల్‌ లేకుండా, క్యాబినెట్‌ అప్రూవల్‌ లేకుండా, ఫైనాన్స్‌ సెక్రటరీ సంతకం కూడా లేకుండా అప్పులు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. దేశంలో ఇప్పటి వరకూ ఏ నాయకుడు చేయని ఆర్థిక తప్పిదాలు, ఈ 18 నెలల్లో చంద్రబాబు చేశారు.

అప్పులపై శ్వేతపత్రం ఇవ్వగలరా?:
    సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రజాధనంతో ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతూ జల్సా చేస్తున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు కూడా హెలికాప్టర్‌లో వెళ్తున్నారు. ఈ 18 నెలల్లోనే కూటమి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మరి ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వగలరా?.
    సీఎం చంద్రబాబుకు జీడీపీ, సీఏజీఆర్‌ అంకెలను తనకు అనుకూలంగా మల్చుకోవడం అలవాటు. వాస్తవాల్లోకి వస్తే ఆయన పాలనలోని ఆదాయ వృద్ధి, వైయస్‌ జగన్‌ పాలనలోని ఆదాయ వృద్ధితో పోలిస్తే స్పష్టమైన తేడాలు బయటపడతాయి. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కరోనా లాంటి సంక్షోభం ఉన్నప్పటికీ 4 పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు,  17 మెడికల్‌ కాలేజీలు (వాటిలో 7 పూర్తిగా నిర్మితం),  గ్రామస్థాయిలో  ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌ సెంటర్లు నిర్మించి ఆస్తులు పెంచారు.  అప్పుడు జగన్‌ సృష్టించిన ఆస్తులను ఈ ప్రభుత్వం వాడుకుంటోంది. 

మెగా పీటీఎం పేరుతో డ్రామా. హంగామా:
    వైయస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియం పెట్టి స్కూళ్లు నాశనం చేశారని చంద్రబాబు నిస్సిగ్గుగా విమర్శలు చేశారు. మరి  మీ మనవడు, లోకేష్‌ కొడుకు ఏ మీడియంలో చదువుతున్నాడు? టీడీపీ ఎమ్మెల్యేల పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారు? పేద పిల్లలకు మాత్రమే తెలుగు మీడియం, మీ పిల్లలకు మాత్రం ఇంగ్లీష్‌ మీడియం చదువులు కావాలా? పేదవాళ్ల పిల్లలు బాగా చదువుకుని వారు ఎక్కడికో ఎగిరిపోతే పెత్తందార్ల ఇళ్లలో పని చేసే వారు ఉండరన్నదే మీ తప్పుడు ఉద్దేశం కాదా?.
    ఇన్ని తప్పులు చేస్తూ, జగన్‌గారిపై నిందలు వేస్తూ, విమర్శలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు, ఇప్పుడు రెగ్యులర్‌గా జరిగే పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం)ను కూడా ఒక ఈవెంట్‌గా మార్చి, సినిమా సెట్టింగ్స్‌ మాదిరిగా ఏర్పాట్లు చేసి.. అచ్చం సినిమా షూటింగ్‌ మాదిరిగా హంగామా చేసి.. స్టార్ట్, కెమెరా, యాక్షన్‌ అనగానే, నటించినట్లు వ్యవహరిస్తున్నారు. మొన్న పార్వతీపురం మన్యం జిల్లా భామినిలోని స్కూల్‌లో తండ్రీ కొడుకులు చేసింది సరిగ్గా అదే.

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిటా? సిగ్గుందా?:
    సూపర్‌సిక్స్‌ హామీలన్నీ అమలు చేశాం. అందుకే సూపర్‌హిట్‌ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. సంపద సృష్టించి సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా? ఇప్పటి వరకు ఏం చేశారు?.
    రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు..ఇస్తున్నారా?  రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతుంటే.. మీరు 30 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి డబ్బులు ఎగ్గొట్టారు కదా? మోదీ వేసిన డబ్బులు కాకుండా రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చింది రెండేళ్లలో కేవలం రూ.10 వేలే కదా?. అయినా అంత నిస్సిగ్గుగా ఎలా ప్రచారం చేసుకుంటున్నారు?.
    నిరుద్యోగులకు ఉద్యోగం రాకపోతే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు?. ఇక ఉద్యోగులకూ చేసిందేమీ లేదు. ఐఆర్‌ లేదు. కొత్త పీఆర్‌సీ వేయలేదు. నాలుగు డీఏలకు కేవలం ఒకటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చివరకు ఒక్క నిరుపేద కుటుంబానికి సెంటు భూమి కూడా ఇవ్వలేదు. మరి మీరు ఏం చేసినట్లు?. 

కరెంట్‌ ఛార్జీలపై ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయగలరా?:
    వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్ధతను పెంచుకుంటామని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నడైనా, ఎక్కడైనా అత్యంత సమర్ధవంతంగా ప్రజలను తాకట్టుపెట్టి అప్పులు చేయడం తప్ప మరేదైనా ఉందా? చంద్రబాబు అంటే సమర్ధవంతంగా అప్పులు చేయడం తప్ప.. ప్రజల నెత్తిన భారం వేయకుండా, ఛార్జీలు పెంచకుండా పాలన చేసింది ఎప్పుడూ లేదు. 
    ఈ 18 నెలల్లో ఎన్నిసార్లు కరెంట్‌ చార్జీలు పెంచారో ప్రజలు చెబుతారని, ఆర్టీజీఎస్‌ ద్వారా పదవులు ఇవ్వడం, అరెస్టులకు ముందు సర్వేలు చేయడం వంటి వ్యవహారాలు మానుకోవాలి. ఇవన్నీ ఎందుకు మీ పథకాలపై మీ పార్టీ జెండా మోసే కార్యకర్తల భార్యలకు ఫోన్‌ చేసి అడగండి చంద్రబాబు? ఏమ్మా, ఈ 18 నెలల్లో చంద్రబాబు కరెంటు బిల్లులు పెంచలేదు కదా అని ఐవీఆర్‌ఎస్‌ఎల్‌ సర్వే ద్వారా అడగండి. ఆ వెంటనే ఫోన్‌ పగిలిపోతుంది. నేలకేసి కొడతారు. అడిగినోడికి చెవ్వుల్లో బూతులు వినిపిస్తాయి. 
    వైయస్‌ జగన్‌ మీరు చేసిన అప్పు కంటే తక్కువే చేశారు. కరెంటు బకాయిలు తీర్చాడు. అప్పులు ఎక్కువ ఎవరు చేశారో గమనించండి. వైయస్‌ జగన్‌ రూ.2 లకే యూనిట్‌ కరెంటు కొంటే ఆ రోజు అమ్మో, అబ్బో అంటూ గగ్గోలు పెట్టారు. మీరు మాత్రం యూనిట్‌ కరెంటు రూ.4.50కు పాతికేళ్లకు కొన్నారు. మరి ఎవరిది తప్పు? 

ఇండిగో సమస్యపై స్పందిస్తూ..:
    ఇండిగో విమాన సర్వీపులు ఆగి లక్షలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. 2024లో ఫ్లైట్లకు రెస్ట్‌ అవర్స్, తక్కువ వర్కింగ్‌ అవర్స్‌ వంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఆ నియమాలు అమలు చేయటం, ఎయిర్‌లైన్స్‌ స్టాఫ్‌ రిక్రూట్‌ పరిస్థితులు సమీక్షించడం పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత. ఆ దిశలో ఆ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు గడిచిన 18 నెలల్లో చేసినది ఏమిటి?. ఏరోజూ ఏ అంశాన్ని ఆయన సమీక్షించలేదు. ఫలితంగా ఇప్పుడు దేశం పరువు పోయింది.
    ఇండిగో సంక్షోభంపై చంద్రబాబు నిన్న ప్రెస్‌మీట్‌లో ఒక విలేకరిని ముందుగా సిద్ధం చేసి ప్రశ్న అడిగించుకున్నారు. అయితే ఇంగ్లీష్‌ ప్రశ్న మొదలవగానే ఆయనకు ఏమి మాట్లాడాలో తెలియక.. ‘మోదీ చూసుకుంటారు’ అని తప్పించుకున్నారు. నేను మీలా ఇంగ్లిష్‌ మాట్లాడలేను చంద్రబాబుగారూ. కానీ, తెలుగులో మాత్రం మీ తప్పులను సూటిగా ప్రశ్నించగలను. సమాధానం చెప్పగలరా?. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఏం చేయాలి? తన బాధ్యత ఎలా నిర్వర్తించాలి? పెళ్లిలో రీల్స్‌ చేసుకుంటారా? లేదా సిమెంట్‌ రోడ్లు శంకుస్థాపన చేయాలా?. తన శాఖ పరిధిలో ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా?. మరి గత ఏడాదిన్నరగా మీ పార్టీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఆ పని చేశారా? తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారా?.
    మరి వీటన్నింటికి సీఎం చంద్రబాబు సమాధానం చెబుతారా? అని మాజీ మంత్రి పేర్ని నాని చురకలంటించారు.