అన్నదాతల మీద పగబట్టిన కూటమి ప్రభుత్వం
నెల్లూరు: కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు అన్నదాతల మీద పగబట్టినట్టు వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు రైతులను కూడా చంద్రబాబు మోసం చేశాడని ఆక్షేపించారు. నెల్లూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని.. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న ఏ పంటకూ లేని మద్ధతు ధర లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామన్న ఆయన... అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు చేయూతనిచ్చామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని అందించడంతో పాటు, ఇ-క్రాప్, ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
కూటమి పాలనలో అన్నదాతల అగచాట్లు...
రైతుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా తయారైంది. అన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా... రైతులన్నా, వ్యవసాయమన్నా చంద్రబాబు అంటరానివారుగా పరిగణిస్తున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతుంటే... ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లైనా లేదు. ప్రధాన పంటలతో పాటు రైతులు సాగుచేస్తున్న ప్రత్తి, వేరుశెనగ, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే వారి కష్టాలు పట్టించుకోకుండా.. పబ్లిసిటీకి ప్రాధాన్యమిస్తూ,ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటూ, లేని పోనివి కల్పించుకుంటూ.. తనను తాను గొప్పవాడని ప్రచారం చేసుకుంటూ రైతులను గాలికొదిలేసిన పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. రైతులు పట్ల నేటికీ నిర్లక్ష్యం వహిస్తూ.. గతంలో రైతులు హర్షించేలా వైయస్.జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థలను కూడా రద్దు చేస్తూ అన్నదాతల ఇంట శోకాన్ని మిగుల్చుతున్నాడు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతు ఏ పంట వేసినా కనీస గిట్టుబాటు ధర లభించే పరిస్థితి లేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి చేయూత కరువై రైతులు తల్లడిల్లిపోతున్నారు. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టితో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్న దుస్థితి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డం కూటమి ప్రభుత్వ వైఫల్యాలని నిదర్శనం.
వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. అవి రైతులకు మంచి ఫలితాలిచ్చాయి. వైయస్.జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందేమోనన్న దుగ్ధతో చందర్బాబు నాయుడు ఇవాళ ఆ వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించి... ఓట్లు దండుకుని ఇవాళ పట్టించుకునే పరిస్ధితి లేదు.
వైయస్.జగన్ ప్రవేశపెట్టిన రైతుభరోసాకు అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి... చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆకుపచ్చ కండువా వేసుకుని.. రైతుల పక్షాన ఉన్నానని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
అన్నదాత సుఖీభవలో ఆంక్షల పేరుతో కోతలు...
జూన్ 2024 నుంచి సూపర్ సిక్స్ అమలు చేస్తానన్న హామీ గుర్తుందా చంద్రబాబూ? అదే సమయంలో రైతుకి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. అంటే రెండేళ్లలో ఒక్కో రైతుకి రూ.20వేలు బాకీ పడ్డావ్ చంద్రబాబూ? మొన్న రూ.5వేలు గతంలో మరో రూ. 5వేలు వేసి దండోరా వేసి ప్రచారం చేసుకుని తిరుగుతున్నావ్ తప్ప, వారికివ్వాల్సిన రూ.20వేలు గురించి నువ్వు, నీ అనుకూల మీడియా కూడా మాట్లాడ్డం లేదు? రూ.10 వేలు చేతిలో పెట్టి చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.20వేలు ఇస్తానని చెప్పిన ఎగ్గొట్టిన చంద్రబాబు... ఇప్పుడు మాటమార్చి కేంద్రం ఇస్తానన్న దానితో కలిపే రూ.20 వేలు అని చెబుతున్నాడు. ఇదే విషయం ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పలేదు. వైయస్.జగన్ హాయంలో కౌలు రైతులకు, అటవీభూములకు, అసైన్డ్ భూములు, డీకేటీ భూముల్లో సాగు చేస్తున్న వారికి కూడా రైతుభరోసా అందిస్తే.. చంద్రబాబు వారందరికీ ఎగ్గొట్టాడు. దీంతో పాటు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఈ పథకం లబ్ధిదారు చనిపోతే అతని వారసులుకు రైతు భరోసా అందజేస్తే.. ఇవాళ చంద్రబాబు దానికి కూడా ఎగనామం పెట్టాడు. మరోవైపు 7 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఆత్మస్ధుతి, పరనిందతో చంద్రబాబు బ్రతుకుతున్నాడు.
భూముల వివరాలు వెబ్ ల్యాండ్ లో నమోదైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వం... వెబ్ ల్యాండ్ లో భూముల వివరాలు నమోదు కాని వారికి పెట్టుబడి సాయాన్ని అందించడం లేదు. వాస్తవానికి వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ఈ నాన్ వెబ్ ల్యాండ్ రైతుల వివరాలను కూడా నమోదు చేసుకుని వారికి కూడా రైతు భరోసా అందించారు. ఎవరైనా రైతు చనిపోతే... ఆ కుటుంబంలో ఉన్న వారసుడి కోసం ప్రత్యేకంగా మాడ్యూల్ రూపొందించి ఫ్యామిలీ సర్టిఫికేట్ ప్రకారం వారసుల్లో ఒకరికి రైతు భరోసా సాయం అందించాం. ఇవాళ ఈ సాఫ్ట్ వేర్ ను కూడా కూటమి ప్రభుత్వం లేకుండా చేసింది. రీ సర్వేపేరుతో వెబ్ ల్యాండ్ ను హైడ్ చేస్తున్నారు. రైతులకు సంబంధించి రీ సర్వే జరుగుతున్న భూముల్లో ఫైనల్ నోటిఫికేషన్ అయి, ఆర్వో అయినంతవరకు ఆ రైతులకు అన్నదాత సుఖీభవ రాదు. ఇక డీకేటీ, ప్రభుత్వభూములని వ కాలమ్ లో ఉంటే వారికి కూడా పెట్టుబడి సాయం అందడం లేదు. ఇలా రకరకాలుగా నిబంధనలు పెట్టి లక్షల సంఖ్యల్లో అన్నదాత సుఖీభవ పథకానికి ఎగనామం పెట్టారు. దానికి సంబంధించి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసుకుంటే దానికి కూడా అతీ, గతీ లేదు. వైయస్.జగన్ హయాంలో వారంరోజుల్లో గ్రీవెన్స్ కి వెళ్లి రైతుభరోసా రాలేదంటే దాన్ని పరిష్కరించే పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో రేపు పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పినా... ఆ జాబితాలో లేని రైతులు తమ గ్రీవెన్స్ ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి. అంటే కేవలం మొక్కుబడి వ్యవహారం తప్ప... నిజంగా రైతులకు మేలుచేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 7 లక్షల మంది రైతులు ఈ పథకానికి దూరమయ్యారు. చివరకు ప్రభుత్వం ప్రకటించిన 46.85 లక్షల మందికైనా సక్రమంగా జమ చేసిందా అంటే అది కూడా లేని పరిస్థితి... జాబితాలో తమ పేర్లు ఉన్నా డబ్బులు అకౌంట్ లో జమ కాలేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దుస్థితి.
ఆర్బీకేలు నిర్వీర్యం...
విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా ఉండే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. వాటికి రైతుసేవా కేంద్రాలని పేరు మార్చాడు. గతంలో రైతులు విత్తనాలు, ఎరువులుతో పాటు ఏం కావాలన్నా ప్రతి గ్రామంలోనూ ఉండే రైతు భరోసా కేంద్రాలు బాధ్యత తీసుకునేవి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అన్ని చర్యలు తీసుకునేవాడు. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం కావడంతో గ్రామస్ధాయిలో సమాచారం వచ్చే పరిస్థితి లేదు. దీంతో విత్తనాల నుంచి ఎరువులు వరకు రైతులు మరలా క్యూ లైన్లో నిల్చోవాల్సిన దుస్థితి వచ్చింది.
మద్ధతు ధర లేక అవస్థలు...
మిర్చి, పొగాకు, మామిడి, టమోట, ఆక్వా, వరి వరకు ఏ పంటలకూ కనీస మద్ధతు ధర లేదు. రైతులు దీనస్ధితిలో ఉన్నారని మొత్తుకుంటున్నా పట్టించుకునేవాడు లేడు. ప్రత్తిరైతులు మూడు తీతలు తీయాల్సిన పంటను వదిలేసి ట్రాక్టర్ తో దుక్కు దున్నుతున్నాడంటే రాష్ట్రంలో పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.
పల్నాడు జిల్లాలో 54,145 వేల ఎకరాల్లో నష్టం జరిగిందని అంచనా మీరే వేసి.. దాన్ని చివరకు 3,912 ఎకరాలకు కుదిస్తారా? రైతుల మీద ప్రేమ, శ్రద్ధ ఉన్నవాళ్లెవరూ ఈ రకంగా చేయరు. ఇది రైతులకు ద్రోహం కాదా? ప్రత్తి నష్టాలకు అమ్ముకుంటున్నామంటే.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక రకాల నిబంధనలతో 12-18 శాతం తేమ, వర్షానికి తడిసి రంగు మారినా కొనమని చెబుతున్నారు.
సీసీఐ నిబంధనలను సడలించిమని కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 87,900 ఎకరాల్లో ప్రత్తి సాగు జరిగింది. రైతులు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
అరటి రైతులకు సంబంధించి మీ అనుకూల కరపత్రికలోనే కిలో రూపాయికే అరటి అని రాశాడు. వాస్తవాలను మరీ మరుగున పరిస్తే.. జనాలు నమ్మరని ఈనాడులో రాసినట్టున్నాడు. కిలో అరటి రూపాయి అంటే... కనీసం ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంత స్పందన ఉందో అర్ధం అవుతుంది. టన్ను రూ.2 వేల నుంచి రూ.1000 కు పడిపోయింది. వ్యవసాయ శాఖ మంత్రికి రైతులు గుర్తుకు రావడం లేదు. ఆయనకి ఎంత సేపూ అధికారులతో నాలుగు రూపాయిలు డబ్బులు ఎలా రైతుల పేరు చెప్పి దోచుకోవాలన్న ఆలోచన, ఆ లావాదేవీలు తప్ప మరొక్కటి లేదు. ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. సమీక్షిస్తే... రైతులను ఆదుకోవాలి కాబట్టి... ఆ పని చేయడం లేదు. అంతా బాగుందని చెప్పడం తప్ప... చేసిందేం లేదు. అదే విషయం మేము చెబితే.. రాజకీయ ఆరోపణలు అని కొట్టిపారేస్తున్నారు.
వేరుశెనగ, సెనగ పంటల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దిక్కుతోచని సెనగ రైతులు అని పత్రికల్లో ప్రధానంగా ప్రచురించినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. లక్షలాది క్వింటాళ్ల శెనగలు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ లో మగ్గిపోతున్నా వాటి గురించి పట్టుంచుకునే ప్రభుత్వం లేదు. రైతుల నడ్డి విరుస్తూ.. మరలా రైతుల కోసం పంచసూత్రాల పథకం ద్వారా మేలు చేస్తానని చంద్రబాబు చెబితే.. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతిలు బాకా ఊదుతున్నాయి. అవి పంచసూత్రాలు కాదు.. పంచ క్షోభలు.
పంచ సూత్రాలు కావివి- పంచ క్షోభలు...
అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు నెరవేరుస్తాడో స్పష్టం చేయాలి. రైతులకు పెట్టుబడి సాయం రూ.20వేలు తొలి ఏడాది కింద ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తారు? అన్నదాత సుఖీభవ సమర్ధవంతంగా అమలుచేయగలరా? వైయస్.జగన్ ప్రవేశపెట్టిన ఉచిత పంటలబీమా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, మరలా ఆ పథకాన్ని పునరుద్ధరిస్తారా? బ్యాంకులో రుణాలు తీసుకుని ప్రీమియమ్ చెల్లించిన 19 లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారు. మిగిలిన వారికి పంటల బీమా లేకుండా చేసి... వారి నెత్తిన శఠగోపం పెట్టారు. వాళ్లకు బీమా వచ్చే పరిస్థితి లేదు. వారిని ఆదుకునే పరిస్థితి ఉందా?
మూడోది గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతంలో రైతుల కోసం సీఎం యాప్ ద్వారా..( కాంప్రెహెన్షివ్ మోనిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ ) పెట్టి.. రైతుల ఉత్పత్తుల రేటుపై నిరంతరం మానిటరింగ్ చేశాం. మార్కెట్ లో రైతుల ఉత్పత్తులకు ధర ఎలా ఉంది, ఒకవేళ రైతు నష్టపోయే విధంగా ఉంటే.. ప్రభుత్వం జోక్యం చేసుకుని వారికి ధర కల్పించడానికి ధరలస్ధిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు సీఎం యాప్ ను పునరుద్దరించి.. రైతులను ఆదుకుంటుంది?
నాలుగోది ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. వాటిని పునరుద్దరించడానికి నీకు మనసు ఉందా చంద్రబాబూ?
ఐదోది రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్ లో పెరిగిపోయాయి. గతంలో విత్తనాలకు సంబంధించి ఎక్కడికక్కడ అగ్రి ల్యాబ్ లు పెట్టాం. వాటిని నిర్వీర్యం చేశావు. వాటిని ల్యాబ్ లను పునరుద్దరించి.. నకిలీ విత్తనాల బారి నుంచి రైతులను కాపాడాలి. రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పవద్దు. ఇకనైనా ప్రత్యేక విమానాల్లో షికార్లు చేయం మాని... క్షేత్రస్ధాయిలో రైతన్నలకు అండగా నిలబడాలి.
అడుగడుగునా అన్నదాతలకు అండగా వైయస్.జగన్ ....
అదేవిధంగా వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆఖరి ఏడాది 53.58 లక్షల మంది రైతులకు రైతుభరోసా కింద రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. రైతులకు పైసా భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. 2019-23 మధ్య ఉచిత పంటల బీమా పరిధిలో 54.55 లక్షల మందికి రూ.7800 కోట్లు చెల్లించాం. ఉచిత విద్యుత్ అమలు చేయడం కోసం ఫీడర్ల సామర్ధ్యాన్ని పెంచడం కోసం రూ.1700 కోట్లు ఖర్చు పెట్టాం. ఆక్వా రైతులకు రూ.1.50 కే నాణ్యతతో కూడిన విద్యుత్ అందించాం. ధాన్యం కొనుగోలులో లోపాలు లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు అండగా నిలిచాం. రైతులను చేయిపట్టుకుని వైయస్.జగన్ నడిపించారు. ఆయన విప్లవాత్మక నిర్ణయాలతో ఐదేళ్లలో రూ. 1,84,567 కోట్లు కేవలం రైతుల కోసం వెచ్చించాడు. కూటమి పాలనలో రెండేళ్లు పూర్తికావస్తున్నా రైతులు మేలు చేయలేదు సరికదా... వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో సాగు అన్నదాతలకు భారంగా మారింది. 2024 జూన్ నుంచి కూటమి పాలనలో వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది నిజంగా దుర్మార్గం. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు.
పచ్చ మీడియా విషపు రాతలు...
వైయస్.జగన్ సీబీఐ కోర్టులో హాజరుకావడానికి హైదరాబాద్ వెళ్లారు. ఆయన కోసం తరలివచ్చిన జనాన్ని అందరూ చూశారు. ఆ జనాన్ని చూసి నిన్నటి నుంచి ఎల్లో మీడియాకు కడుపుంట మొదలైంది. ఓ ప్రజానాయకుడు మీద ప్రజలకున్న విశ్వాసం, నమ్మకం, అభిమానంతో చూడ్డానికి వస్తే... నిస్సిగ్గుగా దాని మీద డిబేట్ లు పెట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ పచ్చ ఛానెళ్లలోనే మాత్రమే చూడగలం. మీకు జనాలు రాకపోతే.. వైయస్.జగన్ కు జనం రావడమే తప్పు అన్నట్టు వార్తలు రాశారు. గతంలో పచ్చమీడియాకు పైత్యం ఉండేది.. అది కాస్తా ముదిరి పిచ్చిగా మారింది. చంద్రబాబు, లోకేష్ లను చూడ్డానికి జనాలు రారు, కాబట్టి వైయస్.జగన్ కు జనాలు రావడం చూసి సహించుకోలేక పచ్చ పైత్యం ప్రదర్శిస్తున్నారు. ఆయన సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని వెళ్తుంటే మీ ఏడుపు ఏంటి? కేవలం మీరు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టే... దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా అటకెక్కాయి. చివరకు శాంతిభద్రల మరింత దారుణంగా తయారైంది. శాంతిభద్రతల కల్పనలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున, చిట్టచివర ఉంది. దేశంలోనే అత్యంత అధ్వాన్నంగా లా అండ్ ఆర్డర్ తయారైంది. ఈ నేపధ్యంలో ప్రజలందరూ మరలా వైయస్.జగన్ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టే ఆయన ఎక్కడకి వెళ్లినా జనాలు వెల్లువలా తరలివస్తున్నారు. అసలు కూటమి నేతలకు తలకాయ ఉండే మాట్లాడుతున్నారా? వైయస్.జగన్ కోర్టుకుటైం ఇవ్వడమేంటి? జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తి తన పర్యటన వివరాలు పోలీసులుకు సమాచారమిస్తారు, దానికి సంబంధించి షెడ్యూల్డ్ ఇస్తే.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సిగ్గూ,శరం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా? మావోయిస్టులు విజయవాడ చంద్రబాబును హతమార్చడానికే వచ్చారు, దీని వెనుక వైయస్.జగన్ అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వైయస్.జగన్ మీద మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా... దేవుడు, ప్రజల ఆశీస్సుల ఉన్నంతవరకు మీరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఆయన్నేం చేయలేరని.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం పతనం ఖాయమని కాకాణి గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు.