తప్పులు చేయించు.. కేసుల నుంచి తప్పించు
తాడేపల్లి: యథేచ్ఛగా తప్పులు చేయించు. దొరికినప్పుడు దొడ్డిదారిన విదేశాలకు పంపించు. వ్యవస్థలను మేనేజ్ చేశాక దర్జాగా రప్పించు అనే విధానంతోనే చంద్రబాబు పనిచేస్తాడనే విషయం మరోసారి నకిలీ మద్యం కేసు ద్వారా జయచంద్రారెడ్డి విషయంలో నిరూపితమైందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొలకలచెరువులో నకిలీ మద్యం తయారీ నిందితుడైన తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆఫ్రికాకు పంపించి, వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిల్ రాగానే 8 నెలల తర్వాత దర్జాగా రప్పించాడని ఆయన ఆరోపించారు. నకలీ మద్యం తయారీ వెనుక ప్రధాన సూత్రధారి జయచంద్రారెడ్డేనని టీడీపీ కరపత్రిక ఈనాడు సైతం రాసిందని, ఆయన డ్రైవర్ అష్రఫ్ తోపాటు మరో వ్యక్తి కట్టా రాజు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ఇచ్చినా అరెస్టు చేయలేదని చెప్పారు. నకిలీ మద్యం కేసులో మొదట ఏ1 గా ఉన్న జయచంద్రారెడ్డి చివరికి ఏ 17 గా మార్చేశారని గుర్తు చేశారు. ఈ నకిలీ మద్యం తయారీ వెనుక చంద్రబాబు, లోకేష్‌ల పాత్ర కూడా ఉందని, వారి అండదండలు లేకుంటే ఏడాదిలోనే ఈ ఫ్యాక్టరీ ద్వారా రూ. 5250 కోట్లు దోచుకోవడం సాధ్యమయ్యే పనికాదని స్పష్టం చేశారు. గతంలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కి సీఐడీ నోటీసులు ఇవ్వగానే ఆయన్ను కూడా ఇలాగే దొడ్డిదారిన అమెరికాకు పంపించి, కూటమి గెలవగానే రప్పించాడని వివరించారు. చంద్రబాబుసైతం తన మీద ఆరోపణలు వచ్చిన్పపుడు నిజాయితీగా ధైర్యంగా పోరాడి తప్పు చేయలేదని నిరూపించుకోకుండా అనారోగ్య కారణాలు, వృద్ధాప్యం సాకుగా చూపించి జైలు నుంచి విడుదలై బెయిల్ మీద బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైయస్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వైయస్ జగన్ గారి పొలిటికల్ అసిస్టంట్ కేఎన్నార్‌ని వేధిస్తూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఎక్కడికీ పారిపోకుండా విచారణకు సహకరిస్తున్నాడని వివరించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
జయచంద్రారెడ్డిని 8 నెలల తర్వాత రప్పించాడు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు అనే గ్రామంలో టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి, మరో టీడీపీ నాయకులు జనార్ధన్ రావు, కట్టా సురేంద్రనాయుడులు కలిసి నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని బెల్ట్ షాపులతోపాటు మద్యం దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తుండేవారు. గుట్టుగా సాగుతున్న ఆ వ్యవహారం మహిళా ఎక్సైజ్ సీఐ ద్వారా వెలుగులోకి వచ్చి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. గతేడాది అక్టోబర్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ మద్యం ప్లాంట్ ద్వారా పైన పేర్కొన్న టీడీపీ నాయకులంతా కలిసి రోజుకి 20 వేల మద్యం బాటిళ్లు తయారు చేసేవారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏకంగా ఈ నకిలీ మద్యం ప్లాంట్ ద్వారానే ఏకంగా రూ. 5,250 కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన మద్యం ఆదాయాన్ని ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీ ద్వారా టీడీపీ నాయకులు డైవర్ట్ చేశారు. లోకేష్, చంద్రబాబు వంటి ప్రభుత్వ ముఖ్యుల ఆశీర్వాదాలు లేకుండా ఇంత భారీ స్థాయిలో మద్యం నెట్‌వర్క్ ఏర్పాటు చేసి వ్యాపారం చేయడం అనేది అసాధ్యం. నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి ఏ 17గా, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి ఏ 18గా ఉన్నారు. కానీ ప్రభుత్వం వారిని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. నకిలీ మద్యం రాకెట్ వ్యవహారం వెలుగుచూడటంతో గత 8 నెలలుగా చంద్రబాబు డైరెక్షన్‌లో జయచంద్రారెడ్డి ఆఫ్రికాలోనే తలదాచుకుని బెయిల్ రావడంతో బామ్మర్దితో కలిసి బెంగళూరులో ల్యాండ్ అయ్యాడు. కానీ ఇదే కేసులో ఏ సంబంధం లేకపోయినా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకి పంపి వేధించారు. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీ గుట్టును బయటపెట్టిన ఎక్సైజ్ సీఐ హిమబిందుని పనిష్మెంట్ కింద విజయవాడకి ట్రాన్సఫర్ చేశారు.
జయచంద్రారెడ్డే నిందితుడని ఈనాడే రాసింది
టీడీపీ నాయకులు యథేచ్ఛగా దారుణాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తారు. వాటిని ప్రశ్నించినా, బయటపెట్టిన వారిని మాత్రం తప్పుడు కేసులు పెట్టి వేధించే జంగిల్ రాజ్ పాలన రాష్ట్రంలో రెండేళ్లుగా సాగుతోంది. ఈ దారుణాల గురించి ప్రజలకు తెలియజేసినందుకు సాక్షి పత్రిక మీద కూడా కేసులు పెట్టారు. మొలకలచెరువు నకిలీ మద్యం స్కామ్‌లో వేళ్లన్నీ జయచంద్రారెడ్డి వైపే నంటూ నిందితులు డ్రైవర్ అష్రఫ్, ఏ2గా ఉన్న కట్టా రాజు వాంగ్మూలాలు ఇచ్చారంటూ టీడీపీ కరపత్రిక ఈనాడు పత్రిక సైతం రాసింది. జనార్దన్‌రావు కాదు.. ధనార్జన్‌రావు అంటూ ఈనాడు జిల్లా పత్రికలో నకిలీ మద్యం దుకాణం గురించి వివరంగా రాసింది. జనార్దన్‌రావుతో కలిసి మొలకలచెరువులో నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటుచేసి నాలుగు బ్రాండ్లు తయారు చేసేవారని, ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే దాదాపు వెయ్యి బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు సాగించారని ఈనాడు పత్రిక ఈ దందా గురించి రాసుకొచ్చింది. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన రోజున 20,208 క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క బెల్టు షాపుని కూడా పోలీసులు ఇంతవరకు తనిఖీలు చేయలేదు. జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు, అరెస్టు కూడా చేసినట్టు మీడియాకి లీకులిచ్చారు. 06.10.2025న ఏ1 జయచంద్రారెడ్డి అని ట్విట్టర్‌లో టీడీపీ ట్వీట్ కూడా చేసింది. కానీ చివరికి అతడిని ఏ17కింద మార్చేశారు. అసలీ కేసులో అరెస్టే కాకుండా తప్పించి ఆఫ్రికాకి పంపించారు. మద్యం కేసులో బెయిల్ ఇప్పించి 8 నెలల తర్వాత దేశానికి రప్పించారు. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికలకు ముందే నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటుపై జయచంద్రారెడ్డితో చేసుకున్న ఒప్పందం మేరకే ఆయనకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా కేటాయించాడనేది ఓపెన్ సీక్రెట్.
పెండ్యాల శ్రీనివాస్‌ని విదేశాలకు పంపించాడు
తన బినామీలను విచారణకు హాజరుకాకుండా విదేశాలకు పంపించి తప్పించడం చంద్రబాబుకి ఇవ్వాళ కొత్త కాదు. గతంలో తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ని ఇదే విధంగా తప్పించి విదేశాలకు పంపించాడు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో 2023 సెప్టెంబర్‌లో సీఐడీ నోటీసులు ఇవ్వగానే దొడ్డిదారిన అమెరికాకి పంపించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ అతడిని పిలిపించి ఉద్యోగంలో కొనసాగిస్తున్నాడు. తానే తప్పులు చేయించి ఆ తప్పులు బయటపడినప్పుడు తప్పించి విదేశాలకు పంపించడం, వ్యవస్థలను మేనేజ్ చేశాక తిరిగి రప్పించడం చంద్రబాబు చేసే పని. ఈ విధంగా రెండేళ్లుగా ప్రతి వ్యవస్థ మీద నారాసుర గొడ్డలి పోటు పడింది. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాలను సర్వనాశనం చేశాడు. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, దళితులు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాలను నారాసుర గొడ్డలిపోటుతో చంద్రబాబు, లోకేష్ వేధిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి `క్యాష్ -రాజేష్- లోకేష్` అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఏ పని కావాలన్నా క్యాష్ పట్టుకుని రాజేష్ దగ్గరకి పోతే లోకేష్‌కి చెప్పి పనులు చేయిస్తాడనేది ఈ నినాదానికి అర్థం.
ఏ తప్పూ చేయలేదు కాబట్టే కేఎన్నార్ పారిపోలేదు
ఒకపక్క కళ్లముందే స్కాములు చేసి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నాయకులను వదిలేసి, ఏ సంబంధం లేకపోయినా వైయస్ జగన్ గారికి అండగా ఉన్నారనే కారణంతో జరగని ఒక లిక్కర్ స్కామ్ సృష్టించి అందులో వైయస్ఆర్‌సీపీ నాయకులను జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వైయస్ జగన్ గారి పొలిటికల్ అసిస్టెంట్ కేఎన్నార్ ని వేధిస్తున్నారు. ఆయన ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఎక్కడికీ పారిపోకుండా విచారణకు సహకరిస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యక్రమాలకు వైయస్ఆర్‌సీపీ పిలుపునివ్వడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. చంద్రబాబు తప్పులు చేశాడు కాబట్టే తన పీఎస్‌ని దొడ్డిదారిలో అమెరికాకి పంపించాడు. కానీ వైయస్ జగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కేఎన్నార్ ఇక్కడే ఉండి అక్రమ కేసులను ఎదుర్కొవాలని నిర్ణయించారు. నిజాయితీపరుడు కాబట్టే వైయస్ జగన్ గారికి ఆ ధైర్యం. తప్పుడు చేశాడు కాబట్టే జయచంద్రారెడ్డిని కూడా చంద్రబాబు దేశం దాటించాడు. తన మీద వేసిన కేసుల్లో కూడా జైలు జీవితం తప్పించుకోవడానికి అనారోగ్యం, వృద్ధాప్య కారణాలు చూపించి చంద్రబాబు బెయిల్ తెచ్చుకుని బతుకుతున్నాడు. కొడుకు లోకేష్‌ని అమిత్ షా దగ్గరకి ఢిల్లీకి పంపించి కాపాడమని కాళ్లా వేళ్లాపడ్డాడని కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు.