గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలి
పాతపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచే మరింత బలోపేతం చేయాలని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలంటే అందరూ సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. పాతపట్నం మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల ఏర్పాటు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంటేనే పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతుందని అన్నారు.
నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ, నిబద్ధత కలిగిన కార్యకర్తలకు గ్రామ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మండల స్థాయి నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తలతో చర్చించి, ఏకాభిప్రాయంతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా, ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకత్వాన్ని గ్రామ స్థాయిలోనే సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని కోరారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని రెడ్డి శాంతి పేర్కొన్నారు.