రాయలసీమ ప్రాజెక్టులపై చిన్న చూపు

3 Feb, 2026 14:36 IST

కర్నూలు జిల్లా : రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్న చూపు చూస్తున్నారని ఆలూరు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాయలసీమ ప్రజల హక్కుల కోసం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న “చలో పోతిరెడ్డిపాడు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న పోస్ట‌ర్ ఆవిష్క‌రించారు.  అనంత‌రం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోందని, రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాయలసీమ రైతులకు అత్యంత కీలకమైన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని చెప్పినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం దురదృష్టకరమని విరుపాక్షి అన్నారు. రాయలసీమ ప్రయోజనాల విషయంలో సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.