కూటమి బడ్జెట్ అంతా 'కాకిలెక్కలు - పచ్చి అబద్ధాలు': 

14 Feb, 2026 21:25 IST

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ వాస్తవాలకు దూరంగా, కేవలం అబద్ధాలు మరియు ఊహాజనిత థియరీలతో నిండి ఉందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బడ్జెట్‌లోని లోపాలను,ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రజాస్వామ్యంలో అత్యంత బాధ్యతాయుతమైన బడ్జెట్ రూపకల్పనను కూటమి ప్రభుత్వం అభాసుపాలు చేసిందని మండిపడ్డారు. గత 10 ఏళ్ల ఆదాయ, వ్యయాల అనాలసిస్ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి బడ్జెట్ రూపొందించలేదని పెదవి విరిచారు. అధికారంలోకి రాకముందు రూ.10 లక్షల కోట్ల అప్పు అని మట్కా నంబర్లు చెప్పిన వారు, ఇప్పుడు వాస్తవాలు రాస్తే తమ అబద్ధం బయటపడుతుందని అసలు అప్పు ఎంతో బడ్జెట్‌లో పేర్కొనలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆదాయ లెక్కలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అవార్డులు ఇవ్వాలని బుగ్గన ఎద్దేవా చేశారు. ఈ ఆర్థిక ఏడాదిలో మొదటి 9 నెలల్లో కేవలం రూ. 67,459 కోట్ల ఆదాయం వస్తే, మిగిలిన 3 నెలల్లో ఏకంగా రూ. 44,407 కోట్లు వస్తుందని చూపడం నమ్మశక్యమా? అని నిలదీశారు. వాస్తవానికి ఆదాయ వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే ఉన్నప్పటికీ, వచ్చే ఏడాదికి 45 శాతం పెరుగుదల చూపడం ప్రజలను మోసం చేయడమే అని తేల్చి చెప్పారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ ఉన్నా 9 శాతం వృద్ధి రేటు సాధించామని ఆయన గుర్తు చేశారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని బుగ్గన మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.35 లక్షల ఉద్యోగాలివ్వడం, 10 వేల విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించడం విధ్వంసమా? అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా ద్వారా పేదలకు నేరుగా నగదు అందించడం మీకు గాయాలు కలిగించిందా?" అని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణ వైఫల్యం చెందిందని ఆయన  గణాంకాలతో సహా నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ఇసుక, భూములే కాకుండా చివరకు కోడి వ్యర్థాల ద్వారా కూడా అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని బుగ్గన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్‌ తప్ప... పర్ఫార్మెన్స్ లో మాత్రం పూర్ అని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా అబద్ధపు లెక్కలు మానేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

● బాధ్యత లేని బడ్జెట్...

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు కాగా రెండూ కలిపి రూ.3,32,205 కోట్లు ఉంది. ఖర్చు కూడా అంతే ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకులకున్న అత్యంత బాధ్యత బడ్జెట్ రూపకల్పన. కానీ ఏపీ బడ్జెట్ చూస్తే గతేడాది ఏం ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి బడ్జెట్ బుక్ ఉండదు. బడ్జెట్ కు సంబంధించి రిసీట్స్ అనాలసిస్, ఖర్చులకు సంబంధించిన అనాలసిస్ రెండూ దాదాపు పది సంవత్సరాల వివరాలు ఉంటాయి. ఏయే శాఖలకు ఎంత ఖర్చుపెట్టారన్నది ఐదు సంవత్సరాల డేటా ఉంటుంది. ఇవన్నీ తీసేసి అన్నీ బొమ్మలు, సూత్రాలు, ఆలోచనలు, దీనికి ఇంత ఖర్చు పెట్టబోతున్నామన్న ఊహాజనిత థియరీ తప్ప వాస్తవాలెక్కడా బడ్జెట్ లో కనిపించలేదు. 
బడ్జెట్ ఆఖరు పేజీల్లో రాష్ట్ర అవతరణ నుంచి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన పదేళ్ల అనాలసిస్ ఉంటుంది. ఇక్కడ అది కూడా లేదు. చివరకు అప్పు ఎంత ఉందన్నది కూడా ఎక్కడా చెప్పలేదు. కారణం అధికారంలోకి రాకముందు నుంచే రూ.12 లక్షలు, రూ.11 లక్షలు, రూ.10 లక్షల కోట్లు అప్పు అని మట్కా నెంబర్లు మాదిగా పదే, పదే చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాస్తవాలు రాస్తే తాము చెప్పింది తప్పు అవుతుంది కాబట్టి అప్పు ఎంత ఉందన్నది కూడా చెప్పలేదు. 

● బడ్జెట్ రూపంలో ఉన్న అసత్యాలవి...

బడ్జెట్ లో సత్యదూరమైన మాటలు, అవాస్తవాలు చెప్పకూడదు. ప్రతి అంశం ఆన్ రికార్డుగా ఉంటుంది కాబట్టి, అసెంబ్లీ సాక్షిగా అస్సలు అబద్దాలు చెప్పకూడదు. అది నేరం కాబట్టి ప్రివిలైజ్ మోషన్ ఉంటుంది. ఇవాళ బడ్జెట్ నిండా ఉన్న అవాస్తవాలు చూస్తుంటే... దీన్ని అధ్యయనం చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది. కానీ బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేం బడ్జెట్ మీద అనాలసిస్ చేయడం లేదు.. బడ్జెట్ రూపంలో ఉన్న అసత్యాల మీద అనాలసిస్ చేస్తున్నాం. 

● సీఏజీఆర్ లో ప్రభుత్వ కాకిలెక్కలు...

గతేడాది అంటే 2025-26 బడ్జెట్ లో  ఆదాయం రూ.1,28,126 కోట్లు చూపిస్తే.. (రివైజ్జ్ ఎస్టిమేట్స్) సవరించిన ఆదాయం రూ.1,11,865 కోట్లు చూపించారు. ఇది సహజం. కానీ ప్రభుత్వం ఇంకా ఫిబ్రవరిలోనే ఉంది. తొమ్మిది నెలల్లో ఆదాయం ఎంత వచ్చిందో చూస్తే రూ.67,459 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఈ మూడు నెలల్లో రూ.44,407 కోట్లు ఆదాయం వస్తుంది. ఇది ఏ రకంగా నమ్మసాధ్యం. 2025-26లో మొదటి 9 నెలల్లో రూ.67,459 కోట్లు వచ్చింది అంటే ఈ లెక్కన మిగిలిన మూడు నెలలు కలుపుకుంటే రూ.90 నుంచి రూ.95వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. కానీ మీరు వచ్చే ఏడాదికి రూ.1,37,320 కోట్లు చూపిస్తున్నారు. అంటే ఈ ఏడాదికి రానున్న సంవత్సరానికి 45  శాతం ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చూపిస్తోంది. వీళ్ల లెక్కలకు ప్రపంచవ్యాప్తంగా పిలిచి అవార్డులు ఇస్తారు. వీళ్లు చెబుతున్న అబద్దాలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. వాస్తవంగా ఈ ప్రభుత్వంలో పెరుగుదల 3.4 శాతం మాత్రమే. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019- 24 వరకూ పెరుగుదల ఏనాడూ 9 శాతానికి తగ్గలేదు. కోవిడ్ లాంటి విపత్తులున్నా సీఏజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) ఏడాదికి ఏడాది తీసుకున్నా కూడా సరాసరి 9 శాతం పెరిగింది. 
సంపదసృష్టి, అపార అనుభవం అన్న మీ హయాంలో వాస్తవంగా కేవలం 3.4 శాతం పెరిగితే లెక్కల్లో మాత్రం 45 శాతం చూపిస్తున్నారు. 

● మూలధన వ్యయంపైనా అసత్యాలే... 

2025-26లో మొదటి 9 నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పులు తీసుకుంటే రూ.81,597 కోట్లు. ఇంకా మూడు నెలలు మిగిలి ఉంది. కానీ మీరు చూపించిన అప్పులు మాత్రం రూ.80,500 కోట్లు చూపిస్తున్నారు. రెండేళ్లలో మీరు చేసిన మొత్తం అప్పు రూ.3.12 లక్షల కోట్లు. చేసిన ఆ అప్పు కూడా చూపించడం లేదు. 2025-26లో మూలధన వ్యయం కింద బడ్జెట్ లో పెట్టిన అమౌంట్ రూ. 40,635 కోట్లు కాగా... సవరించిన అంచనాల ప్రకారం రూ.33,134 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఇంతవరకు 9 నెలలుగా  మీరు పెట్టిన ఖర్చు మాత్రం కేవలం రూ.19,224 కోట్లు మాత్రమే. అంటే బ్యాలెన్స్ దాదాపు రూ.15 వేలకోట్లు  డబ్బులు ఇప్పుడు కేవలం 3 నెలల్లో ఖర్చుపెట్టడం సాధ్యం అవుతుందా? పైగా వచ్చే ఏడాది రూ.48,075 కోట్లు రానున్న ఏడాది ఖర్చుపెట్టబోతున్నామని చెబుతున్నారు. ఎక్కడ రూ.19వేల కోట్లు, ఎక్కడ రూ.48 వేల కోట్లు ? మీ లెక్కలు పైడ్ పైపర్ ఆప్ హేమలిన్  పిల్లలను మాయచేసి తీసుకెళ్లిన తరహాలో తరహాలో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. రూ.33,134 కోట్లు సవరించిన అంచనాలు చూపించిన మీరే మరలా పేజీ నెంబరు 4లో రూ.39,498 కోట్లు చూపించారు. మీరు చూపించిన ఈ లెక్కల ప్రకారం చూస్తే చాలా తేడా వస్తుంది. అసలు వాస్తవాలు చూపించకుండా బొమ్మలతో మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక వాల్యూమ్ 2లో ప్రభుత్వ ఆదాయ లెక్కలు, ఏయే రంగాల్లో ఎంత ఆదాయం వస్తుంది?, ఏయేశాఖలు ఎంత ఖర్చు ? ఏయే శాఖలు ఎంత ఖర్చు చేస్తున్నాయన్నది కూడా ఉంటుంది. ఇవేవీ లేవు. ఇంకా విచిత్రం ఏమిటంటే... సూపర్ సిక్స్ హామీలతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అమాయలకుపైన ప్రజలను ఆశపెట్టి అవాస్తవాలు, అబద్దాలు చెప్పి. ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. 
మూడు బడ్జెట్లు పూర్తైనా ఇంకా గత ప్రభుత్వంమీద నిందలు వేస్తున్న కూటమి ప్రభుత్వం ఇంకా వర్తమానంలోకి రావడం లేదు. గత ప్రభుత్వ లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు, విధ్వంసకర పాలన అంటూ అవే అబద్దాలు మళ్లీ వల్లె వేశారు. 

● మా హయాంలో అభివృద్ధి మీకు గాయాలూ, విధ్వంసమా? 

15,004 గ్రామ, వార్డు సచివాలయాలు స్ధాపించి 1.35 లక్షల మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకా గాయాలు? సామాన్య మానవుని ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 10,032 విలేజ్ క్లినిక్ లు ప్రతి గ్రామంలో పెట్టినందుకా  గాయాలు? 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరికీ మందులు, ఎరువులు, ధాన్యం సేకరణ చేసినందుకా గాయాలు? ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా 
15,715 ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లు కంటే మెరుగ్గా బాగుచేసి... అందుకోసం తొలిదశలో రూ.3,700 కోట్లు ఖర్చు చేసి రెండో దశలో 22,344 స్కూళ్లు ప్రారంభం చేసినందుకా గాయాలు? నాడునేడులో 16,880 ఆసుపత్రులను ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా బాగుచేసినందుకా రాష్ట్రంలో విధ్వంసం జరిగింది? సామాన్య మానవుడికి ఉచితంగా మెరుగైన వైద్యం, పేద విద్యార్ధులకు మెడికల్ విద్య అందుబాటులోకి వస్తుందన్న ఆలోచనతో  17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. అందుకా రాష్ట్రంలో విధ్వంసం జరిగింది? మూడు పోర్టులు, ఒక ప్రైవేటు పోర్టు తో సహా, 10 షిప్పింగ్ హార్భర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినందుకా రాష్ట్రంలో విధ్వంసం జరిగింది? అమ్మఒడితో 44.48 లక్షల మంది తల్లులకు దాదాపు రూ.26,067 లబ్ధి చేకూర్చినందుకా గాయం తగిలింది. రైతు భరోసాతో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,300 కోట్లు ఆర్ధిక సాయం అందించినందుకా గాయం తగిలింది. 

ఉచిత పంటల బీమా పెట్టి 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే రైతుల తరపున కట్టి  దాదాపు రూ.7,800 కోట్లు ఇన్సూరెన్స్ అందించినందుకా గాయం జరిగింది? సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.64 లక్షల మంది రైతులకు దాదాపు రూ.2,051 కోట్లు వడ్డీ కూడా రైతుల తరపున  ప్రభుత్వమే కట్టినందుకా విధ్వంసం జరిగింది? ధరల స్థిరీకరణ నిధి కింద రూ.7,800 కోట్లు రైతుకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తే అది విధ్వంసమా ? 

వైయస్సార్ ఆసరా కింద దాదాపు 79లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.1 పైన, దాదాపు రూ.25,600 కోట్లు సాయం చేసినందుకా గాయం జరిగింది? సున్నా వడ్డీ కింద 1,05,13,500 మందికి దాదాపు రూ.5వేల కోట్లు వడ్డీ ప్రభుత్వమే అక్కచెల్లెమ్మల తరపున కట్టినందుకా విధ్వంసం జరిగింది. 
వైయస్సార్ చేయూత కింద 26,98000 మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.19,200  కోట్లు  ఆదాయవనరులు పెంచినందుకా గాయం జరిగింది. 

కాపునేస్తం కింద 3.58 లక్షల మందికి రూ.2030 కోట్లు సాయం, ఈబీసీ నేస్తం కింద ఇతర కులాలకు 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.1900 కోట్ల సాయం చేసినందుకా గాయం తగిలింది?  ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన ఓ పెద్ద మనిషి కనీసం కాపునేస్తం కూడా అందించలేదు.
వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద దాదాపు 56వేల మందికి రూ.450 కోట్లు  అందిస్తే అది విధ్వంసమా? ఇళ్లు లేని వారికి 30 లక్షల ఇళ్ల పట్టాలందించడం, 20 లక్షల ఇళ్లు కట్టించడం వలన విధ్వంసం జరిగిందా? ఉద్యోగస్థులకు ఐఆర్ 27 శాతం ఇవ్వడం వలన విధ్వంసం జరిగిందా? కోవిడ్ సంక్షోభంలో ప్రజలకు సేవలందించిండంలోనూ, నివారణలోనూ వైయస్.జగన్ ప్రభుత్వం  దేశంలో అత్యుత్తమ స్ధానాల్లో నిలిచినందుకా.. విధ్వంసం జరిగింది. దిశ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించినందుకా గాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టును మీరు వదిలిపెట్టేస్తే... దాన్ని గాడిలో పెట్టి దాదాపు రూ.13వేల కోట్లు ఖర్చు పెట్టి ఇవాల్టి ధరలకు అప్పు కాకుండా  
బడ్జెట్ లో తీసికొచ్చినందుకా విధ్వంసం, వలిగొండ సొరంగం చేసినందుకా? నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి చేసినందుకా? అవుకు టన్నెల్ పూర్తి చేసినందుకా? పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తేవడమా? ఏది విధ్వంసం? గండికోట, చిత్రావతి, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిస్ధాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించడమా విధ్వంసం? చివరకు కుప్పానికి కూడా నీళ్లు అందించేలా చేయడమా విధ్వంసం జరిగింది? అని ప్రశ్నిస్తున్నాం.

● ఇందుకా మీరు గర్వపడుతున్నారు?...

అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని మీరా నడిపిస్తున్నారు. మా హయాంలో ఏ రోజూ గ్రోత్ రేట్  9 శాతానికి తగ్గలేదు.  2023-24 నుంచి మా ప్రభుత్వం తర్వాత రెండేళ్ల పాటు మీ హయాంలో పెరుగుదల చూస్తే.. సేల్స్ టాక్స్ పెరుగుదల మైనస్ 2.28 శాతం ఉంటే, ఇతర పన్నులు అన్నీ కలిపి 1.98 అంటే 2 శాతం కంటే తక్కువ పెరుగుదల ఉంటే మీది అనుభవం, మీరు సంపదసృష్టి చేస్తారు. సీఏజీ రిపోర్టు చూస్తే.. 23 రాష్ట్రాలలో ఆదాయం పెరుగుదలలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ర్యాంకు చూస్తే... 22వ స్ధానంలో ఉన్నారు. మీకంటే ముందు అస్సాం, బీహార్, పంజాబ్, హర్యానాతో సహా ఒడిషా వంటి రాష్ట్రాలుంటే.. మీరు అభివృద్ధి పధంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని చెబుతున్నారు. 
మరలా మీరు కేంద్రంతో పోల్చుకుంటారు. కేంద్రం మాకంటే తక్కువ పెరుగుదల ఉందని చెబుతున్నారు. కేంద్రం ఆదాయం 9 శాతం పెరిగితే రాష్ట్రం ఆదాయం మాత్రం 2 శాతం కూడా పెరగదు. ఎవరిని మభ్యపెట్టడానికి మీరు అబద్దాలు చెబుతున్నారు.

● అప్పులపైనా పచ్చి అబద్దాలు...

2024 జూన్ నుంచి నేటి వరకూ విధ్వంసం నుంచి వికాసం దిశగా.. అంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన అప్పులు రూ.3,20,450 కోట్లు. 2024-25లో రూ.81,622 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు మీరు చూపించిన అప్పు రూ.85,272 కోట్లు ఉంది, ఇది కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఆర్ బీ ఐ ద్వారా స్టేట్ డెవలప్ మెంట్ లోన్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి వరకు రూ.12,300 కోట్లు అప్పు చేశారు. పౌరసరఫరాల కింద రూ.7,000 కోట్లు, మార్క్ ఫెడ్ కింద రూ.19,900 కోట్లు అప్పు చేసి... రైతుల వద్ద నుంచి ఏ పంటలూ కొనుగోలు చేయలేదు. కేంద్రం జోక్యం చేసుకుంటే ఇప్పుడు కందులు సేకరించారు. ఏపీఎండీసీ రూ.9వేల కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ రూ.9,600 కోట్లు, డిస్కమ్స్ రూ.12,110 కోట్లు, ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ రూ.1000 కోట్లు, జలజీవన్ మిషన్ కింద రూ.10వేల కోట్లు అప్పు చేసి.. దేనికి వాడారో తెలియదు. కేంద్ర బడ్జెట్ లో గతేడాది దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే రూ.10వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? ఎక్కడ ఈ డబ్బులు వాడారు? ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది. దీనిపై మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏపీఐఐసి రూ.8,500 కోట్లు, టిడ్కో రూ.4451 కోట్లు, అమరావతి కోసం రూ.47,900 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా జీఎస్ డీ పీ లెక్కలు చూస్తే.. మీరు 11.7 శాతం పెరిగిందని చెబుతుంటే కేంద్రం మాత్రం 10 శాతం లోపే అని చెబుతారు. అలాంటప్పుడు కేంద్రానికి 9 శాతం ఆదాయం వస్తుంటే మీకు మాత్రం 2 శాతం కూడా రావడం లేదు. ఇదెక్కడి లెక్క? 

● మీ అప్పుల గొప్పల లెక్కలివే...

మంత్రులు సెక్రటరీల కాన్ఫరెన్స్ అని నిర్వహించిన సమావేశంలో  మీరిచ్చిన లెక్కలు చూస్తే.. భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నగరాల్లో విజయవాడ 10వ స్ధానంలో ఉందని చెబుతున్నారు. 2019 నుంచి 2035 వరకు పెరుగుతుందని అంచనా వేస్తూ.. హైదరాబాద్ తో పోల్చుతున్నారు. హైదరాబాద్ 50.6 బిలియన్ డాలర్లు అంటే రూ.40 రూ.50 వేల కోట్ల స్థూల ఉత్పత్తి అయితే మనది 5.6 బిలియన్ డాలర్లు అయితే పోలిక ఎక్కడ? మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్దిక పరిస్థితి అప్పులలో  26 వస్ధానంలో ఉంది. స్ధూలఉత్పత్తిలో 19 వస్ధానంలో ఉంది. రెవెన్యూలోటు అయితే రూ.74,147 కోట్లు లోటుతో 31 స్ధానంలో ఆఖరులో ఉంది. కేంద్రం నుంచి తీసుకున్న అప్పుల్లో 25వ స్ధానం, మార్కెట్ నుంచి తీసుకున్న అప్పులలో 28 వ స్ధానంలో ఉన్నారు. ఇది కాకుండా పేజీ నెంబరు 20లో చూస్తే దక్షిణాది రాష్ట్రాలతో చూస్తే మొత్తం అప్పులో అత్యధికంగా రూ.85,312 కోట్లతో ఏపీ మొదటి స్ధానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు ఉంది. రెవెన్యూ లోటు మైనస్ రూ.60 వేల కోట్లతో ఏపీ ముందంజలో ఉండగా కర్ణాటక రూ.10 వేల కోట్లతో ఉంది. ద్రవ్య లోటులో ఏపీ అత్యధికంగా రూ.85,269 కోట్లు ఉంటే, అత్యల్పంగా ఒడిషా ఉంది. 

● కరెంటు డిపార్ట్ మెంట్ పై అడ్డగోలు ప్రచారం..

ది హిందూ పేపర్ లో చూస్తే.. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి కరెంటు డిపార్ట్ మెంట్  రూ.1,22,422 కోట్లు అప్పు పెట్టి పోయామని ముఖ్యమంత్రి స్ధాయిలో అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారు. రాష్ట్ర పునర్ వ్యవస్ధీకరణ జరిగినప్పుడు జూన్ 2, 2014 నాటికి రూ.29,500 కోట్లు ఉంది. మీరు 2019లో దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లు అప్పు పెరిగింది.  అంటే మీ హాయంలో మీరు రూ.56,663 కోట్లు అప్పు చేశారు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.1,24,624 కోట్లు అప్పు అంటే ఈ మొత్తంలో రూ.86 వేల కోట్లు అప్పు మేం వచ్చేటప్పటికే ఉంది. అదంతా మేమే చేశామని అబద్దాలు చెబుతున్నారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి మీ హయాంలో రూ.56,663 కోట్లు అప్పు చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్ధితులలోనూ  కేవలం రూ.38,410 కోట్లు మాత్రమే అప్పు చేశాం. మీరు కరెంటు డిపార్ట్ మెంట్ 24 శాతం అప్పులు చేస్తే.. మేం 7.6 శాతం అప్పు మాత్రమే చేశాం. ఏ ధైర్యంతో ఇంత అబద్దాలు చెబుతున్నారు. సబ్సిడీ అమౌంట్ ప్రభుత్వం చెల్లించకపోవడం వల్లే కరెంటు డిపార్ట్ మెంట్ నష్టాల్లోకి పోతుంది. ఐదేళ్లలో రూ.13,255 కోట్లు మాత్రమే మీరు చెల్లించగా.. రూ.47,800 కోట్లు మా హయాంలో సబ్సిడీ అమౌంట్ చెల్లించాం. 

● అవినీతి, కక్ష, మోసం, రెడ్ బుక్ సహా మీది పది సూత్రాల ప్రణాళిక...

తాను నాటిన చెట్లు నీడలో తాను ఎప్పుడూ కూర్చోలేనని తెలిసినా మొక్కలు నాటారంటూ ఆర్దికమంత్రి సీఎం గురించి చెబుతున్నదినిజమే.. చంద్రబాబు ఎప్పుడూ వేరొకరు నాటిన చెట్ల నీడనే కూర్చొంటారు. విజన్ స్వర్ణాంధ్ర పేరుతో పేదరికం ఉండకూడదు, నైపుణ్యం ఉండాలి, జనాభా  నిర్వహణ, నీటి భద్రత, రైతు వ్యవసాయం, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్చాంధ్ర అంటూ చెబుతున్నారు. కానీ ఈ రెండేళ్ల లో మీ ప్రభుత్వ హయాంలో నియంత పాలన ఒక సూత్రం కాగా... అవినీతి మరో సూత్రం, పక్షపాతం ఒక సూత్రం, కక్ష, అబద్దాలు, మోసం, పారదర్శకత లేకపోవడం, శాంతిభద్రతలు విఫలం, రెడ్ బుక్ పాలన, డైవర్షన్ పాలిటిక్స్ అనే ఈ పది సూత్రాల్లో మీ ప్రభుత్వం నడుస్తోంది. 

● అప్పులపై మీరిచ్చిన వాస్తవాలివిగో...

అప్పు గురించి మాట్లాడుతూ మా ప్రభుత్వ హాయం పూర్తయ్యసరికి రూ.9.74 లక్షల కోట్లు అప్పు మిగుల్చామని చెబుతున్నారు. కరెంటు డిపార్ట్ మెంట్ తరహాలోనే ఇక్కడా కూడా అబద్దాలు చెబున్నారు. సీఏజీ రిపోర్టు, ఆర్ బీ ఐ లెక్కలు, లెజిస్లేచర్ లెక్కలు అన్నీ తప్పుచెబుతాయి, మీరు చెప్పింది మాత్రమే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.  అసెంబ్లీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ , ఆకేపాటి అమర్నాధ్, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు రాసిన ప్రశ్నకు బదులిస్తూ.. మీరు 02-06-2014  నాడు పునర్ వ్యవస్ధీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు రూ.1,07,852 కోట్లు, మీ ప్రభుత్వం దిగిపోయి, వైయస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చేటప్పటికి అప్పు రూ.  3,06,952 కోట్లుకు చేరింది. మరలా 2024లో మా ప్రభుత్వం దిగిపోయినప్పటికీ మీరిచ్చిన లెక్కల ప్రకారమే రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే మా హయాంలో కేవలం రూ.3.39 లక్షల కోట్లు అప్పు మాత్రమే జరిగింది. మీ హయాంలో 2014-19 వరకు 22 శాతం అప్పు పెంచితే మా హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు పెరిగింది. 

● 20 నెలల్లో 60 విజయాలంటూ తప్పుడు ప్రచారం... 

ఇంకా 20 నెలల్లో 60 విజయాలు సాధించామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లాంటి ఓ ఆరేడు  కూడా సాధించలేదు.20 లక్షల మంది  నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున ఇవ్వాలి. అంటే  ఏడాదికి రూ.7,200 కోట్లు చొప్పున3 ఏళ్లకు రూ.21,600 కోట్లు ఇవ్వాలి. ఈ బడ్జెట్ లో కూడా కేటాయింపులు లేకుండా.. ఏపీలో నిరుద్యోగులతో ఓట్లు వేయించుకుని వాళ్లను ఇవాళ మోసం చేస్తున్నారు.  ఆడబిడ్డ నిధి కింద అక్కచెల్లెమ్మలకు రూ.1500 నెలకు ఇస్తామని చెప్పి 1 కోటి 80 లక్షల మంది ఆడబిడ్డలకు ఏడాదికి రూ. 32,400 కోట్లు చొప్పున రూ.92,700 కోట్లు బాకీ ఉన్నారు. ఆ వాగ్దానం చేసే మీరు గెలిచారు. అదే విధంగా 20 లక్షలమంది  50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు బాకీ పడ్డారు. మూడేళ్లైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే మూడేళ్లకు రూ.28,800 కోట్లు బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.6600 కోట్లు ఇచ్చారు. 54 లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ కాకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు. ఏడాదికి రూ.10,716 కోట్లు రైతులకు ఇవ్వాలి. ఒక్కో రైతుకి రెండేళ్లకి రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా... మీరు కేవలం రూ.10వేలు ఇచ్చారు. రూ.30వేలు బాకీ ఉన్నారు. సుమారు 6 లక్షల పై చిలుకు ఉన్న కౌలు రైతులకు మొత్తం ఎగ్గొట్టారు. 
ఇక దీపం పధకం కింద మూడు సిలిండర్లకు రూ.4083 కోట్లు అవసరం కాగా మీరు తొలి ఏడాదికి రూ.786 కోట్లు మాత్రమే కేటాయించారు. రెండో సంవత్సరం రూ.2601 కోట్లు మాత్రమే  కేటాయించగా... రివైజ్డ్ ఎస్టిమేట్ లో రూ.2119 కోట్లు మాత్రమే కనిపిస్తోంది. మొత్తం ఇవన్నీ చూస్తే రూ.6,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా దీపం పథకం ఇచ్చేశామని చెబుతున్నారు.

● తల్లికి వందనం పేరుతో ఎగనామం..

తల్లికి వందనం పధకం కింద 87,41,885 మంది విద్యార్ధులు అర్హులుగా ఉంటే..  రూ.10 వేలు చొప్పున మీరు ఏటా రూ.13,112 కోట్లు అవసరం కాగా.. తొలి ఏడాది తల్లికి వందనం ఎగరగొట్టారు. రెండో ఏడాది 21 లక్షల మంది పిల్లలను తగ్గించి 66 లక్షల మందికి బడ్జెట్ బుక్ లో రూ.8,389 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. క్షేత్రస్ధాయిలో చాలా మంది తమకు తల్లికి వందనం అందలేదని చెబుతున్నారు. రూ.8, రూూ.9 వేలు మాత్రమే వచ్చాయని చెబుతున్నారు. ఈ ఏడాది కూడా రూ.8,456 కోట్లు మాత్రమే బడ్జెట్ లో చూపించారు. రూ.39,336 కోట్లు మూడళ్లలో ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.16,845 కోట్లు మాత్రమే కేటాయించారు. ధరల స్థిరీకరణ నిధికి కూడా కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు అయితే దాదాపు రూ.8వేల కోట్లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.

● కూటమి పాలనలో ఉద్యోగులకూ టోకరా..
 
ఉద్యోగులుకు కూడా మోసం చేసారు. మీరు ఉద్యోగులకు వ్యతిరేకం అని తెలిసినా వాళ్లు కూడా మోసపోయారు. 2024 జూలై నుంచి నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. పీఆర్సీ అన్నారు అది కూడా లేదు. అద్బుతమైన ఐఆర్ అన్నారు అది కూడా లేదు. 2024 జూన్ నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు. ఈఎల్ ఎన్ క్యాష్ మెంట్ 2024 నుంచి లేదు. పోలీసుల పరిస్ధితి మరీ దారుణం. 2024  నుంచి 5 ఏఎస్ ఎల్, ఎస్ ఎల్ పెండింగ్ లో ఉన్నాయి. 16 నెలల నుంచి టీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అయితే మరీ దారుణం. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు చికిత్స ఇవ్వడం లేదు. ఒకటో తారీఖు జీతాలు లేవు. ఇష్టమొచ్చినట్లు బకాయిలు పెట్టారు. 30-07-2024 న ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అని చెప్పారు. ఒక్క ఇంటికీ ఇవ్వలేదు. వైయస్సార్సీపీ హయాంలో ఇచ్చిన  3 లక్షల ఇళ్లు తప్ప ఒక్కటీ లేదు. ఇవన్నీ అడిగితే మీకు కోపం వస్తుంది. ఇదంతా పబ్లిక్ కు సంబంధించిన విషయం. వారి తరపునే మేం ప్రశ్నిస్తాం. లేనిపోని ఆశలు చూపించి అమాయక ప్రజలను నిలువుగా మోసం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్తత్తు గ్యారంటీ అన్న పెద్ద మనిషి కనిపించడు, పార్టీ పెట్టి ఆయనకు  గ్యారంటీ ఇచ్చిన వ్యక్తీ కనిపించడు. 

● అంతులేని అవినీతి- కోడి వ్యర్ధాలనూ వదలని కూటమి నేతలు 

ఇసుక, భూమి, తాసీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏవీ ఇందుకు మినహాయింపు కాదు. చివరకు వినూత్నంగా భారతదేశంలో ఇలాంటి అవినీతి ఎక్కడా ఉండదు. కొన్ని నియోజకవర్గాల్లో కోడి వ్యర్ధాలను సైతం అధికార పార్టీ నేతలు వదలడం లేదు. ఆ కోడి వ్యర్ధాలను చేపల చెరువులకు వేస్తూ.. అక్కడా దండుకుంటున్న దుస్థితి. కోడి వ్యర్ధాలతోనూ కరెప్షన్ చేస్తున్న కూటమి నేతలు నీతులు చెబుతున్నారు. మీరు పదే పదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పదే పదే చెబుతుంటారు.. వాస్తవానికి మీ ఇంటెలిజెన్సే ఆర్టిఫీషియల్. మీ ఫెర్ఫార్మెన్స్ పూర్... పబ్లిసిట్ పీక్ లో ఉంటుందన్న బుగ్గన రాజేంద్రనాథ్... హామీల అమల్లో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.