చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటి?
అమరావతి: చంద్రబాబును ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటి? అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలపై చర్చ సందర్భంగా గురువారం శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నానాయాగీ చేశారు. అయితే వారికి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికల హామీలు ఇచ్చే సమయాన్ని ప్రస్తావిస్తూ.. ఆనాడు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారని అన్నారు. అయితే ‘సభాపతిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అంటూ అవమానిస్తారా?’ అని టీడీపీ మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని.. ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ తరుణంలో.. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను సీనియర్ నేత బొత్స సమర్థించారు. ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదు. అందులో తప్పేముంది?. కావాలంటే ఆయన వ్యాఖ్యలపై రికార్డులు పరిశీలించుకోవాలి. అని అన్నారు. దీంతో.. టీడీపీ మంత్రలు మరింత ఊగిపోయారు. ఈ తరుణంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు కలుగజేసుకున్నారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యాలను రికార్డుల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి మండలి కాసేపు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే సభ్యులు సంయమనం పాటించకపోవడంతో మండలి చైర్మన్ మోషేన్‌రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాద పాటించేలా మండలి సభ్యులు వ్యవహరించాలి. కొందరు సభ్యులు, మంత్రులు మాట్లాడిన మాటలు రికార్డుల నుండి తొలగిస్తాం. గతంలో పదవులు, హోదాలలో పనిచేసిన వారిని గౌరవించుకోవాలి. ఒడిపోయినంత మాత్రాన గౌరవించకుండా మాట్లాడతాం అంటే సమంజసం కాదు. ఎవరూ ఎవ్వరినీ అగౌరవంగా మాట్లాడొద్దు అని సభ్యులకు సూచించారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక నుంచి మా పంథా కూడా మారుతుంది
విరామ సమయంలో ఎమ్మెల్సీలు మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ‘‘మాజీ సీఎం వైయస్ జగన్‌ను ప్రతీసారి పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు. అందుకే ఇక నుంచి మా పంథా కూడా మారుతుంది. మండలిలో మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగానే సంబోధిస్తాం. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అని.. ఇక నుంచి ఇలాగే మాట్లాడతాం అని అన్నారు.