బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ప్రజలకు లాభం లేదు
అమరావతి: రాష్ట్ర బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ప్రజలకు ఎలాంటి లాభం లేదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ బడ్జెట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారని, కానీ మొదటి ఎనిమిది పేజీల వరకూ తమను తాము పొగుడుకోవడం, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వినియోగించుకున్నారని అన్నారు.
ప్రజలు అభివృద్ధి చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లనే పదే పదే ప్రస్తావించారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడా స్పష్టత లేదని, అంతా అంకెల గారడీగా ఉందని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో సున్నా వడ్డీ రుణాలు క్రమం తప్పకుండా అందించామని, ఈ ప్రభుత్వంలో వాటికి కేటాయింపులే లేవని అన్నారు. పనికి ఆహార పథకానికి కూడా తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ కాలంలో 3 లక్షల 20 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని స్పష్టం చేశామని, కానీ ఇప్పుడు 9 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించడం వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. బడ్జెట్ అంతా తప్పులు తడకగా ఉందని వ్యాఖ్యానించారు.
ఇరవై నెలల్లో ఇరవై లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, కానీ ఒక్క కౌలు రైతుకైనా నష్టపరిహారం అందించారా అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ వల్ల ఏ ఒక్క వర్గానికీ ఉపయోగం లేదని, రాబోయే రోజుల్లో ఈ అంశాలపై పోరాడతామని స్పష్టం చేశారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసి సమాధానాలు రాబడతామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
తిరుమల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది
తిరుమల తిరుపతి వెంకన్నపై నిందలు మోపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్‌లో పడిందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు హెరిటేజ్ సంస్థతో ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొంతమంది తమ ధనార్జన కోసం ఆ దేవదేవుడి పేరునే వాడుకుని ఆరోపణలు చేశారని విమర్శించారు. వారు చేసిన ఆరోపణలన్నిటికీ త్వరలోనే ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.