అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు

13 Feb, 2026 14:49 IST


అమ‌రావ‌తి: శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ దాడుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడులు జరగడంతో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అనంతరం అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. అంబటి రాంబాబు విజ్ఞత కలిగిన నాయకుడని, అందుకే ఆయన క్షమాపణలు చెప్పారని బొత్స అన్నారు. అయితే అంబటిని వేధించిన వారికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ దాడులు జరగడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో మరో మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం కూడా ఆందోళన కలిగించే అంశమని బొత్స పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ముందుకు తీసుకువచ్చి మైలేజ్ కోసం ప్రయత్నించడం తగదని విమర్శించారు. అంబటి రాంబాబు తల్లిని దూషించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని, తల్లి ఎవరికైనా తల్లేనని బొత్స స్పష్టం చేశారు. ఒకరి తల్లిని దూషించడం సరైందా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానికి ఉపయోగించడం తగదని విమర్శించారు. మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా అది తప్పేనని ఆయన స్పష్టం చేశారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణ చెప్పారని, ఆయన తల్లిని దూషించిన వీడియోలు కూడా ఉన్నాయని బొత్స సత్యనారాయణ తెలిపారు.