ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలి
గిద్దలూరు: ఓటు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బాధ్యతాయుతంగా పనిచేయాలని గిద్దలూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి కె.పి. నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలో బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ బూత్ కమిటీ విభాగ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లా ఎస్‌ఐఆర్ ప్రక్రియ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు పత్తి రవిచంద్ర పాల్గొని బీఎల్ఏలకు సమగ్ర శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా కె.పి. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రతి బీఎల్ఏ తమ పరిధిలోని ప్రతి ఓటరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అక్రమంగా ఓటర్లను చేర్చే ప్రయత్నాలు జరిగితే వెంటనే గుర్తించి అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. రాబోయే నెలన్నర రోజుల పాటు బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు.
పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి, ఎంపీపీ వేగినాటి ఓసురెడ్డి, జెడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజయ్య, మండల పార్టీ కన్వీనర్ ఆవుల శ్రీధర్‌రెడ్డి, ముఖ్య నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.