స్కిల్డ్ క్రిమినల్స్ చేసిన అతిపెద్ద స్కామ్ ఇది
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అతిపెద్ద స్కామ్ జరిగిందని, ఇది స్కిల్డ్ క్రిమినల్స్ చేసిన స్కామ్ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇదన్నారు. దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలో చంద్రబాబుకు తెలుసు అన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్ ఊపిరి పోసుకుందని చెప్పారు. వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ. 371 కోట్లు కొట్టేశారని విమర్శించారు. లోపాయికారీ ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ స్కామ్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎందుకు నోరు మెదపలేదని సీఎం వైయస్ జగన్ ప్రశ్నించారు. దత్తపుత్రుడు కూడా ఈ స్కామ్‌పై ప్రశ్నించలేదని నిలదీశారు. ఇంత పెద్ద అవినీతి ఎక్కడా చూడలేదని, దోచుకు, పంచుకో, తినుకో అన్నదే వారి విధానమన్నారు. ఈ స్కామ్‌లో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని సాక్ష్యాధారాలతో సీఎం వైయస్ జగన్ శాసన సభ ద్వారా వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఎం వైయస్ జగన్ సోమవారం అసెంబ్లీలో సవివరంగా తెలియజేశారు.
ముఖ్యమంత్రి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..
- ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద స్కామ్ గురించి కొద్ది మాటలు చెప్పాలి.
- స్కిల్ పేరిట ఏ రకంగా గత ప్రభుత్వంలో దోచేశారన్నది సభ ద్వారా ఎమ్మెల్యేలకు, ప్రజలకు అవగతం ఉండాలి. అందుకే ఈ టాఫిక్ మీద బెటర్ క్లారిటీ ఇచ్చేందుకు, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను.
- స్కిల్ ద్వారా నిజంగా పిల్లల్లో నైపుణ్యం పెంపొందించి ఉద్యోగాల్లో వారికి వచ్చే అవకాశాలను మెరుగు పరచాలని ప్రభుత్వం కృషి చేయాలి. కానీ స్కిలింగ్ పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అన్నది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్.
- ఇటువంటి స్కిలింగ్ ద్వారా ఏ రకంగా మన పిల్లలకు నష్టం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ రకంగా మోసం చేశారో ప్రజలకు తెలియాలి.
- వంద రూపాయల పని చేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకొని ఆ పది రూపాయలు కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఈ వ్యవహారం ఉంటుంది.
- అమెరికా, యూరఫ్‌లో లాటరీ తగిలింది. రూ.10 మిలియన్ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి. అర్జెంట్‌గా రూ.10 లక్షలు కట్టండి..ఆ తరువాత రూ.10 వేల మిలియన్ డాలర్లు వస్తాయని చెబుతుంటారు. అదే మాదిరిగా రాష్ట్రంలో సీమెన్స్ పేరుతో స్కామ్ జరిగింది.
- ఇలాంటి ఒక గొప్ప స్కామ్ నడిపిన వ్యక్తి సాక్షాత్తు నారా చంద్రబాబే.ప్రభుత్వ డబ్బు అక్షరాలు రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు. ఈ రోజు స్కామ్ గురించి చర్చిస్తున్నాం. ఈ డబ్బు షేల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ చేసి మళ్లీ చంద్రబాబుకు వచ్చేలా చేశారు.
- స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. లిగల్ టెర్మినాలజీలో పార్టనర్స్ ఆఫ్ క్రేమ్ ప్రోసిజర్స్ అనే ఒక పదం ఉంది. అలాంటిదే ఇది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
- కేబినెట్లో ఒకటి చెప్పి..చెప్పిన దాని మేరకు జీవో విడుదల చేసి..ఆ తరువాత కేబినెట్ లేదు. జీవో లేదు. విరుద్ధంగా ఎంవోయూలు చేసుకునే కార్యక్రమం జరిగింది. ఆ తరువాత మరో ఒప్పందం చేసుకొని డబ్బులు కొట్టేసే వ్యవహారం ఇక్కడ జరిగింది.
- ప్రజాధనాన్ని దోచేయడంలో చంద్రబాబు చాతుర్యం చూడాలంటే స్కిల్ స్కామ్‌ను చెప్పవచ్చు.
- విదేశాలకు కూడా షెల్ కంపెనీలకు ఈ స్కామ్ పాకింది. ఆ తరువాత మళ్లీ వివిధ రూపాల్లో మన దేశానికి వచ్చింది. ఈ స్కామ్‌పై జీఎస్టీ, ఇంటలీజెన్సీ, ఈడీ, సీఐడీ ఇలా ఏజెన్సీలు అన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు.
- 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ స్కిల్ స్కామ్ ఊపిరి పోసుకుంది. ఇందుకోసం తనకు కావాల్సిన మనుషులను చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్లోకి తీసుకువచ్చారు.
- ప్రభుత్వంలో దీనిపై పూర్తిస్థాయి చర్చ లేదు. డీటైల్స్ ప్రాజెక్టు అప్రూవల్ చేయించాలి. అది లేదు. కాబోయే ఖర్చులకు సంబంధించి ఒక నిర్ధారణ చేయాలి. అది లేదు. టెండర్ లాంటి ప్రక్రియ కూడా లేదు. చంద్రబాబుకు మాత్రమే ఇటువంటి కార్యక్రమం సాధ్యమవుతుంది.
- సీమెన్స్ కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారిగా వీళ్లు లాలూచిపడ్డారు. అతని ద్వారా దోపిడీకి పాల్పడ్డారు.
- ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.3,356 కోట్లు ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అన్నారు. 90 శాతం సీమెన్స్ భరిస్తుందన్నారు.
- ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రైవేట్ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా? ఇది ఆలోచన చేయడానికి సాధ్యమవుతుందా? పోనీ చంద్రబాబు అందమైన ముఖాన్ని చూసి ఇస్తారా?. ఎలాంటి ఆలోచనలు లేవు.
- ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది. జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఇందులో ఎవరి వాటాలు ఎంత? ప్రభుత్వం ఏ రూపంలో ఈ ప్రాజెక్టులో ఖర్చు చేస్తుంది. ప్రతి స్థాయిలో ఖర్చు ఎంత ఉంటుంది. ఏ రకంగా నిధులు వస్తాయి. టార్గెట్ ఎప్పుడు పూర్తి అవుతుంది. ఎవరి బాధ్యత ఎలా ఉంటుందని అధ్యాయనం చేసి డిటైల్స్ ప్రాజెక్ట్‌లోకి తీసుకువస్తారు. కానీ ఇక్కడ డీపీఆర్ కూడా తయారు చేయలేదు.
- ముందస్తుగానే ఆ కంపెనీలో లాలూచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు తమకు తాముగా రూపొందించిన డీపీఆర్‌ను స్కీల్ డెవలప్మెంట్ ద్వారా ఒక నోట్ పెట్టించారు. దాన్ని ఏమాత్రం అధ్యాయనం చేయించలేదు.
- ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆ పైస్థాయిని పూర్తిగా ఓవర్‌లూక్ చేస్తూ ఏకంగా కేబినెట్లోకి ఈ నోట్‌ను తీసుకువచ్చారు. ఇది ఒక స్పెషల్ ఐటెమ్‌గా తీసుకువచ్చారు. వెంటనే కేబినెట్ ఓకే చెప్పడం, ఆ తరువాత జీవో విడుదల చేయడం ఆఘమేఘాలపై జరిగిపోయాయి.
- చంద్రబాబు చెప్పిందే వేదం అన్నట్లుగా నడిపించారు. ఈ స్కామ్ అన్నది మన ప్రభుత్వం రాకముందే బయటపడింది. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎల్లోమీడియా ఏమాత్రం రాయలేదు. చివరకు దత్తపుత్రుడు కూడా మాట్లాడలేదు. ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యథేచ్చగా కాజేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.
- దోచుకో..పంచుకో..తినుకో అన్నది వాళ్ల విధానం. ఎవడు అడగడు, ఎవడు రాయడు, ఎవడు చూపించడు, ఎవడు ప్రశ్నించడు. ఇంతకంటే అవినీతి ఎక్కడ ఉండదు.
- కేబినెట్లో ఒకలాగా, కేబినెట్ తీర్మానంలో మరోలాగా, ఒప్పందం ఇంకోలాగా ఉంది.
- రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్, ఐదు టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిస్ట్యూట్ అని జీవోలో చెప్పారు.
- ఒక్కో క్లస్టర్‌కు రూ.594 కోట్లు ఖర్చు చేస్తామని ఇందులో 90 శాతం సీమెన్స్ ఖర్చు గ్రాంటనెంట్ కింద అందిస్తుందని, 10 శాతం మాత్రమే ప్రభుత్వం భరీస్తుందని జీవోలో చెప్పారు. దీని ప్రకారం రూ.371 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో చెప్పారు. సీమెన్స్ సంస్థ ఈ ఒప్పందం ప్రకారం కేబినెట్లో చెప్పారు.
- గ్రాంట్ ఇన్ ఏయిడ్ వచ్చిందంటే ఈ డబ్బును మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేబినెట్ నిర్ణయానికి, జీవోకు విరుద్ధంగా గ్రాంట్ ఇన్ పేరు ఒప్పందంలో ఎగిరిపోయింది. ఈ పదమే ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం కాంట్రిబ్యూటరీని ఫైనాల్షియల్ ఎసిస్టేన్స్గా మార్చారు. ఈ మొత్తం ఒప్పందం చూస్తే..పూర్తిగా కేబినెట్ నిర్ణయం, జీవోకు విరుద్ధంగా ఒప్పందంలో స్వరూపమే మార్చేశారు. జీవోలు, ఎంవోయూ ఒప్పందాలను సభలో స్లైడ్ ద్వారా సీఎం వైయస్ జగన్ చూపించారు.
- ఈ జీవో తరువాత ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందం గమనిస్తే..జీవోను పూర్తిగా మార్చేశారు. అగ్రిమెంట్లో ఎంవోయూలు పరిశీలిస్తే..10 శాతం కాంట్రిబూషన్ అన్న పదం ఎగిరిపోయింది. ఫైనాన్షియల్ ఎసిస్టెంట్గా మారింది. ఇక్కడ డబ్బులు ఎంత అన్నది రాయలేదు..తేదీలు చెప్పలేదు. అన్ని డ్యాష్ డ్యాష్‌లు ఒప్పందంలో పేర్కొన్నారు.
- ఒప్పందం పత్రంలో ఏ లెటర్ ఆధారంగా, ఏ జీవో ఆధారంగా, ఏ తేదీన కూదుర్చున్నారో అన్న విషయాలు అన్నీ కూడా డ్యాష్ డ్యాష్ అని రాశారు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు.
- చంద్రబాబు స్క్రిప్ట్, డైరెక్షన్ లేకుండానే ఈ ఒప్పందం జరుగుతుందా?ఇన్నీ కోట్లు ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దోచుకో..తినుకో ..పంచుకో అన్న దానికి ఏ రకంగా అడుగులు పడ్డాయో గమనించాలి.
- ప్రభుత్వం నుంచి 10 శాతం నిధులు విడుదల చేసినప్పుడు సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఒక్క పైసా కూడా రాలేదు. అప్పటి ప్రభుత్వం ఐదు దఫాల్లో రూ.371 కోట్లు విడుదల చేసింది.
- ఆ మొత్తం షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు చేరిన వెంటనే మళ్లీ దఫాల వారీగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయడం ఇలా స్కామ్ జరిగింది.
- నేను బటన్ నొక్కితే డీబీటీ ద్వారా నా అక్కచెల్లెమ్మలు, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు బటన్ నొక్కగానే ప్రభుత్వ ఖాతా నుంచి అటు ఇటు తిరిగి చంద్రబాబు ఖాతాలోకి వచ్చాయి.
- డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు కొంత మంది కోరిలు పెడితే అప్పటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీకి వెంటనే నిధులు విడుదల చేయాలని చంద్రబాబు నోట్ ఫైల్లో పేర్కొన్నారు.
- ఇంకో నోట్ ఫైల్లో సీఎం చంద్రబాబు చెప్పారు కాబట్టి నిధులు నేరుగా విడుదల చేశామని ఛీప్ ఫైనాన్స్ సెక్రటరీ రాశారు.
- ఈ స్కామ్‌లో ఇన్ని సాక్షాధారాలను నేను చూపిస్తున్నాను. ఈ స్కామ్‌లో చంద్రబాబు ప్రధాన ముద్దాయి కదా?
- ప్రభుత్వం నుంచి విడుదల చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి. తీగ లాగితే డొంక కదిలింది. మన అధికారులే కాదు..సీమెన్స్ సంస్థ కూడా అంతర్గతంగా విచారణ చేపట్టింది. ఈ సంస్థ సభ్యులు మెజిస్ట్రిట్ ముందు వాగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు మా ఒప్పందాలకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ ప్రతినిధులు మెజిస్ట్రేట్ ముందు చెప్పారు.
- సీమెన్స్ ఎలాంటి ఆర్థిక కార్యాకలాపాలు నిర్వహించలేదని, ఇలాంటి స్కీమ్‌లు మా కంపెనీలో లేవని ఆ కంపెనీ ప్రతినిధులు రిపోర్టు సమర్పించారు. డబ్బులు మాకు రాలేదని ఆ సంస్థ చెబుతుంటే మరి ఎక్కడికి వెళ్లాయి. అటు ఇటు తిరిగి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరాయి. రూ.371 కోట్లు గత ప్రభుత్వంలోని చంద్రబాబు, ఆయన మనుషులు తిన్నారు.
- అనేక షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి వీరి చేతుల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని ఏసీబీకి ఒక విజన్ బ్లోవర్ 2018 జూన్‌లో రాతపూర్వకంగా అప్పటి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఏసీబీ విచారణ మొదలుపెట్టినా దర్యాప్తు ముందుకు వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు?. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్‌ను మాయం చేశారు. ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో ఒకచోట పొరపాటు చేస్తారు. వివిధ శాఖల్లోని షాడో ఫైల్ ద్వారా స్కామ్‌లో అవినీతిని తవ్వుతున్నాం. జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి వారి లావాదేవీలపై దృష్టి పెట్టారు. ఈ కంపెనీలు బోగస్ ఇన్వాయిస్తో సర్వీస్ టాక్స్ చేసినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించి విచారణ చేపట్టారు. 2017లోనే ఈ స్కామ్ బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ స్కామ్‌పై ఎలాంటి స్పందన లేదు.
- సీమెన్స్ సంస్థ అంతర్గతంగా విచారణ చేసి అసలు విషయాలను సీఐడీ అధికారుల దృష్టికి తెచ్చారు. నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేస్తే ..ఎల్లో పార్టీ, ఎల్లో మీడియాలో మాత్రం రాజకీయ కక్షసాధింపు అని చెబుతున్నారు.
- ఈ స్కామ్‌లో కేంద్ర విచారణ సంస్థ నలుగురిని అరెస్టు చేసింది. ఈడీ ట్వీట్ చేసింది. ఈ రోజుకు కూడా అరెస్టు అయిన వాళ్లు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇంత దారుణంగా పట్టుబడి దొరికిపోయారు.
- గజ దొంగల ముఠా..దోచుకో..తినుకో..పంచుకో బ్యాచ్ తట్టుకోలేక బమ్మిని తిమ్మిని చేసేందుకు కథలు అల్లుతూ చంద్రబాబును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గజ దొంగల ముఠా గత ప్రభుత్వం ఎంతగా దోచుకుందో అర్థమవుతుంది. ఇది చంద్రబాబు చేసిన నిలువు దోపిడీ. గజ దొంగల ముఠా చట్టం నుంచి తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు.
- నేరాగాళ్లకు సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తాడు, ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. వీళ్లను మళ్లీ ఏ రోజు కూడా రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి.
- ఈ విషయంపై చర్చ జరుగుతుంటే..వక్రీకరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి వద్ద ఎక్కువ మీడియా ఉంది కదా? నిజాన్ని అబద్ధంగా చెప్పే స్కిల్డ్ వారి వద్ద ఉంది. ఈ సభ ద్వారా వాస్తవాలు ఏంటి అన్నది మన ఎమ్మెల్యేలకే కాక, ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా సాక్ష్యాలు, ఆధారాలను చూపించామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.