పరకామణి కేసు - కొత్త కుట్రలకు తెర

22 Feb, 2026 17:54 IST

తిరుపతి: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్న పరకామణి కేసును రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా, తనకు నచ్చిన వారిని వేధించడం కోసమే సీఎం చంద్రబాబు మళ్ళీ తెరపైకి తెస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను, డైవర్షన్ రాజకీయాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. పరకామణి కేసుకు సంబంధించి గతంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ, సీఐడీ విభాగాలు రెండు నెలల పాటు క్షుణ్ణంగా విచారణ చేశాయని భూమన గుర్తు చేశారు. ఇద్దరు డీజీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించారని, ప్రస్తుతం మూడు వ్యాజ్యాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మళ్ళీ తిరగదోడి, కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చూడటం కేవలం ప్రజల దృష్టిని మళ్ళించడానికేనని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే దీనిపై టీటీడీ ద్వారా ఫిర్యాదు చేయించి కొత్త కేసు బనాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇందులో భాగంగా అత్యంత అవినీతిపరుడిగా ముద్రపడిన ఒక డిఎస్పీకి ఈ విచారణ బాధ్యతలు అప్పగించి, తమకు కావాల్సిన వారిని నిందితులుగా ఏరుకుని వేధించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న  సమాచారం తమ వద్ద ఉందన్న భూమన... రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి దగ్గర నివేదికలు ఉండగా, మళ్ళీ విచారణ కోరడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని  స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు కేవలం తన రాజకీయ ఉనికి కోసం దైవత్వాన్ని, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "శ్రీ వేంకటేశ్వరస్వామి దిగొచ్చి తనను కాపాడాడని చెప్పుకునే చంద్రబాబు.. తాను చేసిన పాపాల వల్లే అలిపిరిలో క్లైమోర్ మైన్స్ పేలాయని ఎందుకు అనుకోరని ప్రశ్నించారు. శివుడి మెడలోని పామును పట్టుకుని ఏదో చేస్తానని మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. అపచారాలు చంద్రబాబు చేస్తూ.. ఎదుటివారిపై నెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య" అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ ..లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని, వైయ‌స్ఆర్‌సీపీకి ఇందులో సంబంధం లేదని తేల్చి చెప్పినా చంద్రబాబు మళ్లీ అబద్ధాలకు తెరలేపారని భూమన ఆగ్రహించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేవుడి ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సర్వోన్నత న్యాయస్థానం మందలించినా చంద్రబాబులో మార్పు రాలేదని ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి మూలాలు చంద్రబాబు సొంత సంస్థలైన హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల దగ్గరే ఉన్నాయని, వీటిపై ప్రజలకు మరింతగా వివరిస్తామని తేల్చి చెప్పారు. లడ్డూ విషయంలో ప్రజల్లో వ్యతిరేకత రావడంతో, దృష్టి మళ్లించడానికి చంద్రబాబు ఇప్పుడు పాత పరకామణి కేసును తెరపైకి తెస్తున్నారని భూమన తేల్చి చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలకు పాల్పడ్డా, ఎంతటి డైవర్షన్ పాలిటిక్స్ చేసినా సత్యం దాగి ఉండదని, భగవంతుడు మరియు న్యాయస్థానాలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయమని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

● సిట్ నివేదికతో తప్పుడు ప్రచారానికి తెరతీసిన బాబు...

ఎన్ డీ డీ బీ రిపోర్టు చూసి ఆ నెయ్యిలో ఆవుకొవ్వు కలిపారని నేను చెప్పాను కానీ, లేనిపోని సమస్యలు సృష్టించడానికే వైయ‌స్ఆర్‌సీపీ వాళ్లు సుప్రీం కోర్టుకు వెళ్లారని చెప్పాడు. లేని పోని సమస్యలు సృష్టించడానికి ఎవరైనా సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తారా? ఇది తీవ్ర అభ్యంతరకరం. సమస్యలు మీరు సృష్టిస్తున్నారు కాబట్టే..మా పార్టీ నేతలు దేశ సర్వోన్నత న్యాయ స్థానానికి వెళ్లారు. మీరు చేసింది తప్పు అని, బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు అలా మాట్లాడకూడదని కూడా సుప్రీం కోర్టు మందలించింది. మరి లేని పోని సమస్యలు సృష్టిస్తున్నది ఎవరు చంద్రబాబూ? మీకు సుప్రీం కోర్టు అన్నా కూడా లేక్కలేదా? మీరు భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేసి, సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సిట్.. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు, పంది కొవ్వు  లేదని తేల్చి చెప్పడంతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు దీనికి ఏ సంబంధం లేదని కూడా చెప్పారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్లా నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను.. ఇప్పుడు ఉండే ప్రసక్తే లేదు తమ్ముళ్లూ అంటూ మరలా తప్పుడు ప్రచారానికి తెరతీస్తున్నాడు. 

● మీ హయాంలోనే.. ప్లేవర్డ్ ఘీ సాక్షిగా కల్తీ నెయ్యి..

మీరు ఎంత తప్పుడు ప్రచారం చేసినా...  కల్తీ నెయ్యి మూలాలు మీ హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల దగ్గరే ఉన్నాయన్న విషయాన్ని ప్రజలకు చెప్పడం మాత్రం ఆపేది లేదు.  కల్తీకి మూలాలు మీ ఉత్పత్తి సంస్థ అయిన ఇందాపుర్ నుంచి మీరు తీసుకొచ్చిన బోలేబాబా డెయిరీ వరకు కల్తీ వ్యవహారం ఎలా సాగిందో  
ప్రజలందరికీ మరింత వివరంగా చెబుతాం.
2019-24 మధ్య స్వామివారి లడ్డూలు సువాసన వచ్చిందా? తమ్ముళ్లూ అంటూనే రాలేదు కదా అని తానే చెబుతున్నాడు. అసలు లడ్డూ సువాసన రావడానికి 2018లోనే  ప్లేవర్డ్ ఘీని రోజుకు 975  కేజీల చొప్పున రూ.5 కోట్ల విలువైన నెయ్యి ఎందుకు కొన్నారు చంద్రబాబూ?  లడ్డూపై సువాసన రావడానికి నెయ్యి అద్దారు  అంటే మీ హయాంలో కల్తీ నెయ్యి వాడారు అనే కదా అర్ధం?  దీనికి సమాధానం చెప్పకుండా, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చనిపోయిన వాళ్లను పరామర్శించరు, తప్పు చేసిన వాళ్లను పరామర్శిస్తారని మా నాయకుడు వైయస్.జగన్ ని విమర్శిస్తున్నారు. మీరు తప్పుడు కేసులతో మా నాయకులను జైల్లో నెడుతున్నారు, అలా అన్యాయమైన నాయకులనే పరామర్శిస్తున్నారు.

● మీరు తీసుకొచ్చిన సంస్థలే నెయ్యి కల్తీలకు మూలాలు... 

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూ నాణ్యత పెంచడానికి శ్యామలరావును ఈవో గా నియమిస్తూ రెండో ఫైలుపై సంతకం చేశానని చెప్పిన చంద్రబాబు.. అదే శ్యామలరావును 20 నెలల కూడా ఉంచకుండా ఎందుకు పంపించావ్ చంద్రబాబూ? అదే శ్యామలరావుతో నెయ్యికి బదులుగా ఆవుకొవ్వు కలపారని చెప్పంచి, పంపించారు. సిట్ మెట్టికాయలు వేసినట్టుగా నివేదిక సమర్పించినా ఇంకా అబద్దాలు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా హెరిటేజ్ కు  ముడిపెతున్నామని చెబుతున్నారు. ఉన్నదే మేం చెబుతున్నాం. మీరు తీసుకొచ్చిన సంస్థలే కల్తీకు మూలాలు అన్న విషయాలనే మా పార్టీ బయటపెట్టిది. అక్రమాలకు మూలసూత్రధారులు మీరే అని చెప్పాం. లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.

● 7 కొండల జీవో రద్దు చేస్తానన్నది నువ్వు కాదా బాబూ...

ఏడు కొండలు కోసం 746 జీవో తెచ్చి.. 352 కిలోమీటర్ల పరిధి అంతా తిరుమల క్షేత్రం అని నిర్ణయించిందే వైయస్ రాజశేఖర్ రెడ్డి అయితే... చంద్రబాబు మీరు అదే 2009 ఎన్నికల సభలో జీవో 746 రద్దు చేస్తామని మైనార్టీల సభలో మాట్లాడిన వ్యక్తి మీరు. ఏం మాట్లాడినా చెల్లుతుందన్న ధీమాతో నెయ్యి కల్తీ విషయంలో కూడా మీరు, మీ మంత్రులు, మీ పత్రికలు, ప్రసారమాధ్యమాల ద్వారా మా మీద నిరంతరం విష ప్రచారం చేస్తున్నారు.  లడ్డూ విషయంలో జనంలో తీవ్రవ్యతిరేకత మూటగట్టుకున్నామని గ్రహించిన మీరు.. ఒకవైపు వైయ‌స్ఆర్‌సీపీని తిడుతూనే పరకామణి కేసును తిరగదోడాలని నిర్ణయించారు.

● వేధింపుల కోసమే మరలా పరకామణి కేసు..

వాస్తవానికి పరకామణి కేసుకు సంబంధించి రెండు నెలలు పాటు ఏసీబీ, సీఐడీ కలిపి ఇద్దరు డీజీ స్థాయి అధికారులు, హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ చేయించి కోర్టుకు నివేదించారు. దానికి సంబంధించి మూడు వ్యాజ్యాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర పెండింగ్ లో ఉండగా.. సీఎం చంద్రబాబు పరకామణికి సంబంధించి మరలా ఎఫ్ ఐ ఆర్ ను వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అత్యంత అవినీతి పరుడిగా ముద్రపడిన ఒక డిఎస్పీకి ఆ బాధ్యతలు అప్పగించి తనకు కావాల్సిన రీతిలో నిందితులను ఏరుకుని వాళ్లందరినీ వేధించడానికి రేపో, ఎల్లుండో మరలా కొత్తగా ఎఫ్ ఐ ఆర్ తీసుకుని వస్తూ.. టీటీడీ చేతనే మరలా ఫిర్యాదు చేయించే పని చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. అందుకే మీరు చెప్పినట్లు వినే వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తెచ్చుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట్లాడుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ సిట్ నివేదిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంటే మరలా ఆ కేసును తిరగదోడి, కొత్త కేసును బనాయించాలన్న ఆలోచన ఎందుకు? మరలా మా మీద రోజూ విష ప్రచారం చేయడం ద్వారా డైవర్షన్ కోసమే ఇలా చేస్తున్నారు. దీనికోసం అవినీతి అధికారులను ఎన్నికుని, అత్యంత అవినీతి అధికారి అయిన డిఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించనున్నారన్న  సమాచారం మాకు ఉంది. ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్య న్యాయస్థానాన్ని కించపరచటమే. సర్వోన్నత న్యాయ స్థానాన్ని లెక్కచేయని తనమే. సుప్రీం కోర్టు అదేశం మేరకు సీబీఐ ఆధ్వర్యంలో దర్యాపు చేసి సిట్ నివేదికను లెక్కచేయకుండా .. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం, ఇవాళ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉన్న వ్యాజ్యాలను కూడా లెక్కచేయకుండా పరకామణి కేసుపై కొత్త ఫిర్యాదు తో విచారణ చేయించాలనే కుట్రకు పాల్పడుతోంది.  

● పోలీసు సంక్షేమంపైనా చిన్నచూపు...

వాస్తవానికి పోలీసులు రెండేళ్లుగా సరండర్ లీవులు లేవు, ప్రమోషన్లు లేవు, టీఏలు లేవు, ముద్దాయిలను కోర్టులకు తీసుకెళ్లడానికి మా దగ్గర వాహనాలు లేవని డీజీపీ ప్రకటించడం దారుణం. కూటమి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆశ్చర్యకరంగా 130 మంది సీఐలు వీఆర్ లో ఉన్నారు. వీళ్లు జీతాలు లేకుండా నలిగిపోతున్నారు. ఇంత మంది వీఆర్ లో ఉండడంతో. అతి ముఖ్యమైన పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు లేరు. తిరుమల కొండ సహా చాలా ముఖ్యమైన పోలీస్ స్టేషన్లలో అధికారులు లేరు. ఇవి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

● మీ గత చరిత్ర ఇదే చంద్రబాబు...

నేను శాంతపరుడునని చెప్పుకునే చంద్రబాబు... మీరు మీ గతాన్ని మర్చిపోవద్దు. ఎన్టీఆర్ అభిమాని మల్లెల బాబ్జీ, సీఎం సెక్రటరీ రాఘవేంద్రరావు, 37 ఏళ్ల క్రితం కాపులకు అత్యంత ప్రీతిపాత్రుడైన వంగవీటి రంగా మరణాల వెనుక మీ హస్తం ఉందన్న ఆరోపణలు మీరు ఎదుర్కోలేదా? సాక్షాత్తూ ఆనాటి హోంమంత్రి హరిరామజోగయ్య తన ఆత్మకథలోనే రంగా గారి హత్యకు చంద్రబాబు కారణం అని రాసిన మాట వాస్తవం కాదా? మీ మీద ఆరోపణలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం సరికాదు. ప్రతిక్షణం తాను చేసిన తప్పులను సమర్ధించుకుంటూ.. ఎదుట వారి మీద తప్పులు బనాయిస్తూ,  డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడ్డం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఇవి ఎల్లకాలం సాగవని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. 

● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ..

వన్ మ్యాన్ కమిషన్ వేయడం చట్టవ్యతిరేకమే కాదు, సుప్రీం కోర్టు ను ధిక్కరించడం, అవహేళన చేయడమే. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ దర్యాప్తు మీద నమ్మకం లేదన్నట్టు... ఏకసభ్య కమిషన్ ను నియమించారు. సుప్రీం కోర్టు చంద్రబాబుకు మెట్టికాయలు వేయడం ఖాయమని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.