ఉపాధి కూలీల కడుపు కొట్ట‌డం దుర్మార్గం 

24 Nov, 2025 14:58 IST

తాడేప‌ల్లి:  కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కూడా రాజ‌కీయ క‌క్ష‌సాధింపుల‌ కోసం వాడుకుంటూ దానిపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్న పేద కుటుంబాల కడుపుకొడుతున్నార‌ని బాప‌ట్ల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఒకప‌క్క వ్య‌వ‌సాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఇంకోప‌క్క ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర‌ల‌కు కూట‌మి ప్రభుత్వం తెర‌తీసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఉపాధి పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో త‌మ‌కు న‌చ్చిన వారిని నియ‌మించుకున్నార‌ని, వారి ద్వారా ఇటీవ‌ల ఉపాధి హామీ ప‌థ‌కంలో ఈ కేవైసీ తీసుకొచ్చి జాబ్ కార్డుల తొల‌గింపు కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని వివ‌రించారు. గ్రామాల్లో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులెవ‌రైనా ఉంటే రాజ‌కీయ క‌క్ష‌ల‌తో వారి కార్డుల‌ను తొల‌గించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని, గ‌డిచిన ఏప్రిల్ నుంచి 18.63 ల‌క్ష‌ల కార్డులు తొల‌గించార‌ని చెప్పారు. దేశ‌ వ్యాప్తంగా 22 ల‌క్ష‌ల కార్డులు తొల‌గిస్తే ఒక్క ఏపీలోనే 18.63 ల‌క్ష‌ల కార్డులు తొల‌గించారంటే ఈ ప్ర‌భుత్వం పేద‌లను ఏవిధంగా వేధిస్తుందో తెలుస్తుంద‌న్నారు. గత నెల అక్టోబ‌ర్ 8 నుంచి నేటి వ‌ర‌కు 40 రోజుల్లోనే 16 ల‌క్ష‌ల కార్డులు తొల‌గించి పేద‌ల కడుపు కొట్టడం దుర్మార్గ‌మైన చ‌ర్య‌గా మేరుగ నాగార్జున అభివ‌ర్ణించారు. కూట‌మి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల ఉపాధికి దూర‌మై 36 శాతం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే న‌ష్టపోతున్నాయ‌ని వివ‌రించారు. జాబ్ కార్డుల తొల‌గింపుపై సీఎం చంద్రబాబు, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు స‌మాధానం చెప్పాల‌ని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.... 

● వ్య‌వ‌సాయం లేదు.. కూలీ చేసుకోనివ్వ‌డం లేదు:

క‌రువు ప‌రిస్థితులతో గ్రామాల్లో జ‌రుగుతున్న వ‌ల‌స‌లు నివారించ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కానికి శ్రీకారం చుడితే, సీఎం చంద్ర‌బాబు దాన్ని కూడా రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నాడు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్సార్ నేతృత్వంలో దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా అనంత‌పురం జిల్లాలో ఈ ప‌థ‌కానికి శ్రీకారం చుట్ట‌డం జ‌రిగింది. దివంగ‌త వైయ‌స్సార్ రాష్ట్రంలో ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన తీరును చూసి ఆ త‌ర్వాత కాలంలో ఈ ప‌థ‌కాన్ని దేశవ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ నిర్ణ‌యించింది. అలా దేశ‌మంతా అమ‌లు జ‌రుగుతున్న ప‌థ‌కాన్ని వ‌ద‌ల‌కుండా చంద్ర‌బాబు రాజ‌కీయాలు చేయ‌డం సిగ్గుచేటు. ఒకప‌క్క వ్య‌వ‌సాయరంగాన్ని నిర్వీర్యం చేసిన కూట‌మి ప్ర‌భుత్వం ఇంకోప‌క్క కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం ఉపాధి హామీలో కూడా ఇష్టానుసారం జాబ్ కార్డులు తొలగించి ల‌క్ష‌లాది మంది ఉపాధి కూలీల కుటుంబాలు ఆక‌లితో అల‌మ‌టించేలా చేస్తుంది.  

● 40 రోజుల్లో 16 ల‌క్ష‌ల జాబ్ కార్డుల తొల‌గింపు:

జాబ్ కార్డులు తొలగించి పేద కుటుంబాల కడుపుకొట్టే దుర్మార్గ‌పు ఆలోచ‌న‌లు చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశం మొత్తం మీద 22 ల‌క్ష‌ల జాబ్ కార్డులు తొల‌గిస్తే, ఒక్క ఏపీలోనే 18.63 ల‌క్ష‌ల జాబ్ కార్డుల‌ను కూట‌మి ప్రభుత్వం తొల‌గించింది. అక్టోబరు 8వ తేదీ నుంచే గత 40 రోజుల్లోనే ఏకంగా దాదాపు 16 లక్షల మంది పేదలు జాబ్‌కార్డులు తొల‌గించారు. ఒక్క ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ముసుగులో చాలా గ్రామాల్లో అధికార టీడీపీ నేతలు తమకు గిట్టని వారితో పాటు ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారుల జాబ్‌ కార్డులను ఇష్టానుసారంగా తొలగించేస్తోంది. గతేడాది జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో కూట‌మి నాయ‌కులు సూచించిన వారిని నియమించింది. అప్ప‌ట్నుంచీ వీరంతా జాబ్‌ కార్డుల తొలగింపులో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఉపాధి కూలీల కడుపుకొట్ట‌డం దుర్మార్గం. జాబ్ కార్డుల తొల‌గింపుపై సీఎం చంద్రబాబు, సంబంధిత మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాధానం చెప్పాలి. తొల‌గించిన కార్డుల‌ను పున‌రుద్ధ‌రించాలి. 

● ఎస్సీ, ఎస్టీల క‌డుపుకొడుతున్నారు:

రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - సెప్టెంబరు మధ్య ఉపాధి హామీ పనుల కల్పన తగ్గడం వల్ల ఆర్నెళ్ల‌ వ్యవధిలో ఏకంగా రూ.435.40 కోట్ల మేర నష్టపోయినట్లు లిబిటెక్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు నిర్ధారించాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్లలో ఉపాధి హామీ ద్వారా 17.95 కోట్ల పనిదినాలు కల్పించగా ఈ ఏడాది అదే సమయంలో 15.51 కోట్ల పనిదినాల కల్పన మాత్రమే జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధి హామీ లబ్ధిదారులు గత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్లలో నాలుగు కోట్ల పనిదినాలు పొందగా ఈ ఏడాది 3.23 కోట్ల పనిదినాలు మాత్రమే లబ్ధి పొందారు. పని దినాలు తగ్గిపోవడంతో మొత్తంగా ఎస్సీలు 18.7 శాతం, ఎస్టీలు 17.6 శాతం, ఇతరులు 11.3 శాతం మేర ఉపాధిని కోల్పోయారు. 

● కేంద్ర నిబంధ‌న‌లు ఉల్లంఘించి కార్డుల తొల‌గింపు:

రాష్ట్రంలో యాక్టివ్‌ జాబ్‌ కార్డులున్న దాదాపు 48 లక్షల కుటుంబాలకు చెందిన 75 లక్షల మంది నిరుపేదలు ఏటా ఉపాధి హామీ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. పథకం ద్వారా దాదాపు రూ.7 వేల కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. పథకం ఖర్చులో 90 శాతం మేర కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఒకసారి జాబ్‌ కార్డు మంజూరు చేశాక తొలగించాలంటే గ్రామసభ నిర్వహించి బహిరంగ చర్చ అనంతరమే తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. కొద్ది రోజులు పనులకు హాజరు కాకపోయినా జాబ్‌ కార్డులు తొలగించవద్దని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. ఆధార్, బ్యాంకు ఖాతాలతో లింక్‌ చేసుకోలేదనే కారణాలతో జాబ్‌ కార్డులు రద్దు చేసే నిబంధన ఏదీ లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించింది. జాబ్‌ కార్డులున్న కుటుంబం ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లడం, నకిలీ అని నిరూపణ కావడం, నకిలీ పత్రాల ఆధారంగా నమోదు చేయడం లాంటి సందర్భాల్లో మాత్రమే తగిన ధ్రువీకరణ తరువాతే తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ పనులకు డిమాండ్‌ లేకపోవడం లాంటి కారణంతో రద్దు చేయకూడదన్న నిబంధ‌న‌ల‌ను ఈ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు.