బీసీలను బానిసలుగా మార్చింది చంద్రబాబే

27 Jan, 2019 15:35 IST

విజయవాడ: బడుగు, బలహీనవర్గాల ప్రజలను చంద్రబాబు బానిసలుగా మార్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదన్నారు. చట్టబద్ధత, విలువలు లేని జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, ఆ కమిటీల దగ్గర బీసీలు చేతులు కట్టుకొని నిలబడే దుస్థితిని తీసుకొచ్చాడని మండిపడ్డారు. బీసీలను అవమానించి, అన్యాయం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని బీసీ గర్జన సభ పెట్టాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు రెండు నెలల ముందు వరాలు ప్రకటించి పెద్ద నాటకం రచించి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికీ  ప్రభుత్వం నుంచి సహకారం లేక కుల వృత్తులు మరుగునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులుS అణగదొక్కబడే ఉన్నారన్నారు. 

– తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బలహీనవర్గాలను, బానిసలుగా చూస్తోంది. అర్హత ఆధారంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. అర్హత ఉన్నవారందరికీ పథకాలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వారి దగ్గర చేతులు కట్టుకునేలా ప్రజలను బానిసలను చేశారు. పెన్షన్, ఇల్లు, రేషన్‌ కావాలన్నా.. జన్మభూమి కమిటీల దగ్గర చేతులు కట్టుకునేలా చేసింది. గర్జన అంటే ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా సంతోషంతో ప్రజలంతా బీసీ గర్జనకు రావాలి. 

– రాజమండ్రిలో అన్నపూర్ణమ్మపేట గ్రామంలో డ్వాక్రా మహిళలు గర్జన సభకు రాకపోతే సెల్‌ఫోన్‌ ఇవ్వం, రూ. పది వేలు ఇవ్వమని బెదిరిస్తున్నారు. దీంతో మహిళలకు ధర్నాకు దిగారు.  

– టీడీపీ మేనిఫెస్టోలో బలహీనవర్గాలకు అనేక ఆశలు కల్పించారు. దాదాపు 125 హామీలు బలహీనవర్గాలకు ఇచ్చారు. ప్రభుత్వం ఏ ఒక్కటైనా అమలు చేసిందేమో.. స్పష్టంగా చెప్పాలి. బలహీనవర్గాలకు మైనింగ్‌ మీద హక్కులు, ఇసుక క్వారీలు అన్నారు. కానీ ఏ ఒక్క బీసీ సంఘానికి లైసెన్స్‌ ఇచ్చిన దాఖలాలు లేవు.

– సంవత్సరం నాలుగు నెలలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేసిన పాదయాత్రలో ఎక్కవ మంది బలహీనవర్గాల ప్రజలే కలిశారు. ప్రతి కులం చంద్రబాబు పాలనతో అన్యాయం అయిపోయాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. మీరైనా సాయం చేయాలని వైయస్‌ జగన్‌ దగ్గరకు వస్తే భరోసా కల్పించారు. 

– ప్రతి కులాన్ని చంద్రబాబు అవమానించి, అన్యాయం చేశాడు. మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ ఇస్తానన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన పాపాన పోలేదు. చేపలకు మార్కెటింగ్‌ వసతులు కల్పించలేని దుస్థితి. చేపలు, రొయ్యలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్‌ స్టోరేజీ కూడా లేదు. చేపల వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు గల్లంతైన వారి కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం. 900 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్నా.. వసతులు ఏర్పాటు చేయకపోవడం మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు.

– చేనేతలకు వర్షాకాలంలో నెలకు రూ. 4 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అతీగతి లేదు. ఏం మొహం పెట్టుకొని బీసీ గర్జన పెట్టారు. సొసైటీలను నిర్వీర్యం చేశారు.

– శాలివాహనులను అన్యాయం చేసిన ప్రభుత్వం చంద్రబాబుది. కల్లబొల్లి మాటలు తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు. కుండలకు కావాల్సిన మట్టిని వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి. కారణం చెరువులన్నీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా దోచుకొని మట్టి వ్యాపారం చేసుకొని కోట్లు కొల్లగొట్టారు. 

– బలహీనవర్గాల్లో ఎక్కువ మంది కౌలు రైతులు, రుణమాఫీ చేస్తామని చెప్పి అడ్డంగా మోసం చేయడం మూలంగా బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు పుట్టని పరిస్థితి నెలకొంది. ఏ ఒక్కరోజైనా కౌలు రైతుల పరిస్థితులు అర్థం చేసుకున్నారా..? చంద్రబాబు మోసం మూలంగా అధిక వడ్డీకి ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చుకునే దుస్థితి ఏర్పడింది.  

– దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం తీసుకొచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. కానీ టీడీపీ వచ్చిన తరువాత ఫీజురియంబర్స్‌మెంట్‌ను సర్వనాశనం చేశారు. బీసీ గర్జన సభా వేదిక సభ నుంచి నూరు శాతం ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాడా..? చంద్రబాబు సమాధానం చెప్పాలి. 

– ఒకపక్క ముడుపులు తీసుకుంటూ కాలేజీలను ఫీజులు పెంచుకోమని చెబుతూ.. రూ. 30 వేలు రియంబర్స్‌మెంట్‌ ఇస్తూ బలహీనవర్గాల విద్యార్థుల జీవితాలను తాకట్టు పెడుతున్నారు. 

– ఆదరణ అంటూ మోసం చేస్తున్నారు. రూ. 2 వేల పనిముట్లను రూ. 18 వేలు, రూ. 20 వేలు అని చూపిస్తూ ఆదరణ పథకాలు బలహీనవర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికా..? టీడీపీ నాయకులు జేబులు నింపుకోవడం కోసమా? సమాధానం చెప్పాలి. 

– బీసీ సబ్‌ ప్లాన్‌ సంవత్సరానికి రూ. 10 వేల కోట్లు అని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. నాలుగు సంవత్సరాల్లో కేటాయించింది ఎంత, ఖర్చు చేసింది ఎంత..? మొదటి సంవత్సరం రూ. 2,057 కోట్లు, రెండో సంవత్సరం రూ. 2,720 కోట్లు, మూడవ ఏడాది రూ. 4,246, నాలుగవ సంవత్సరం రూ. 5,013 కోట్లు మాత్రమే కేటాయించింది. ఐదేళ్లకు రూ. 50 వేల కోట్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రూ. 15 వేల కోట్లు ఇచ్చి ప్రచారం మాత్రం రూ. 50 వేల కోట్లు అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు.  

– పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ 2017–18కి బడ్జెట్‌లో రూ. 274.5 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది రూ. 124 కోట్లు మాత్రమే. ఫీజు రియంబర్స్‌మెంట్‌ 2017–18 బడ్జెట్‌లో రూ. 1042 కోట్లు కేటాయించారు. కానీ వారు ఇచ్చింది మాత్రం రూ. 517.27 కోట్లు మాత్రమే. ఇది వాస్తవం కాదా..? గతంలో 7,07,813 మందికి ఫీజురియంబర్స్‌మెంట్‌ ఇస్తే. ఈ సంవత్సరం 4.85 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. 

– ట్యూషన్‌ ఫీజు కేటాయింపులు భారీగా చూపిస్తారు. ఆఖరికి రిలీజ్‌ చేసేటప్పుడు 40 శాతం ఇచ్చే పరిస్థితులు, విదేశీ విద్య అని చాలా గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం 2017–18 వెయ్యి మంది విద్యార్థులను రూ. 120 కోట్లు బడ్జెట్‌ కేటాయించాల్సి ఉంటే కేవలం రూ. 11.33 కోట్లు ఖర్చు చేసి 193 మందిని పంపించి బీసీ గర్జన చేయడం సిగ్గుచేటు. 

– పేదవారి జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేయలేదు. బీసీలంతా చదువులు మానుకునే పరిస్థితి చంద్రబాబు తీసుకొచ్చారు. కాలేజీలు కూడా విద్యార్థులు అవమానించే పరిస్థితులు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. 

– ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. రజకులు, నాయీ బ్రాహ్మణులు ఇలా అనేక కులాలను ఎస్సీలుగా  మార్చుతామన్నారు. బీసీ డీలో ఉన్నవారిని బీసీ ఏ కి మారుస్తామని అవమానించే పరిస్థితి. ఎన్నికలు వచ్చే సరికి బలహీనవర్గాలు కనిపిస్తారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి.

– వైయస్‌ఆర్‌ ఏ విధంగా తలెత్తుకొని బతికే విధంగా చేశారో.. అలాంటి పాలన రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి. గవర్నమెంట్‌ పాఠశాలలు మూసివేసి ఆర్థిక భాêరంతో కూడుకున్న ప్రైవేట్‌ విద్యను ప్రోత్సహించింది చంద్రబాబే. బలహీనవర్గాలకు అన్యాయం చేస్తూ మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని కపట ప్రేమ కురిపిస్తున్నారు. 

– అమ్మ ఒడి పథకంతో వైయస్‌ జగన్‌ ఒకటవ తరగతి  నుంచి ఇంటర్మీడియట్‌ వరకు రూ. 15 వేలు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చాం. బలహీనవర్గాలను అభివృద్ధి చేస్తాం. ప్రజలంతా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు. బీసీ వ్యతిరేకిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి.