వైయస్ఆర్‌సీపీ గ్రామ అధ్యక్షుడిపై హత్యాయత్నం
ఏలూరు జిల్లా : నూజివీడు నియోజకవర్గం ఆకిరిపల్లి మండలం శోభనాపురం గ్రామ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు నక్కనపోయిన సాంబశివరావుపై హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపింది. సోషల్ మీడియాలో టీడీపీ నాయకులపై విమర్శనాత్మక పోస్టులు పెట్టారనే కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డారని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నక్కనపోయిన వేణు ప్రోద్బలంతో ఈ హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే వైయస్ఆర్‌సీపీ గ్రామ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నారని పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సహజమేనని, అయితే వాటిని హింసాత్మక దాడుల వరకు తీసుకెళ్లడం అత్యంత దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించిన వారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.