పార్టీకి కష్టపడి పనిచేసే నాయకులే కావాలి
అరకు: వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు పార్టీ బలోపేతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నిజాయితీగా, కష్టపడి పనిచేసే నాయకులే అవసరమని, వ్యక్తులకు పని చేసే నాయకులు పార్టీకి అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. ఈ రోజు అరకు నియోజకవర్గం అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు కొర్ర సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అరకు, పాడేరు పార్టీ పరిశీలకులు ఏటివాక సత్యారావు గారితో కలిసి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీ అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పదవులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందని, అర్హులైన వారిని ముందుకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులను కూడా పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్న వారితో త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలం ఎంపీపీ తెడబరికి మితుల గారు, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి గారు, వైస్ ఎంపీపీ దూరు జయవర్థిని గారు, మండల పరిధిలోని వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.