అక్రమ కేసుపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఫిర్యాదు
విజయవాడ: మిర్చి రైతుల సమస్యలు ఆరా తీసేందుకు, మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న గుంటూరు మిర్చి యార్డు సందర్శించారు. ఆ పర్యటనకు అనుమతి లేదంటూ, ప్రభుత్వం ఏ మాత్రం భద్రత కల్పించలేదు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు వైయస్ జగన్‌గారు పర్యటించారంటూ.. అది రాజకీయ కార్యక్రమం కాకపోయినా ఆయనపై కేసు నమోదు చేశారు. వైయస్ జగన్‌గారితో పాటు, పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వైయస్ జగన్‌గారితో పాటు, గుంటూరు మిర్చియార్డుకు వెళ్లకపోయినా సరే, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తాను గుంటూరు వెళ్లకపోయినా, వెళ్లానంటూ.. అక్రమంగా కేసు నమోదు చేయడంపై పేర్ని నాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి లేఖ పంపిన ఆయన, ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేసి, తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారితో పాటు, అక్రమంగా కేసు నమోదు చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని కోరారు.