రాజ్యాంగ పదవులను కొంతమంది అపహాస్యం చేస్తున్నారు
శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టిందని, ప్రజల పక్షాన న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవులను కొంతమంది అపహాస్యం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొన్ని దేశాల్లో ఇంకా లాక్డౌన్ కొనసాగుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ తెలిపారు. అయినా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వటం దారుణమని స్పీకర్ తప్పుపట్టారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా.. నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఉన్న ఏ దుష్టశక్తి ఉందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇంత రాద్ధాంతం ఎందుకని, ఓ రాజకీయ పార్టీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోందని స్పష్టమవుతోందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.