చేసిన అప్పుల‌కు లెక్క‌లు చెప్పే ద‌మ్ముందా? 

22 Feb, 2026 18:11 IST

విశాఖ‌ప‌ట్నం: కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 20 నెల‌ల్లో చేసిన అప్పుల‌కు లెక్క‌లు చెప్పాల‌ని, బ‌డ్జెట్ కేటాయింపుల‌తో పాటు ఏయే రంగాల‌కు ఎంతెంత ఖ‌ర్చు చేశారో చెప్పే ద‌మ్ముందా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా ర‌విబాబు స‌వాల్ విసిరారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రెవెన్యూ వృద్ధిలో దేశంలోనే అట్ట‌డుగు స్థానంలో ఉంద‌ని కాగ్ లెక్క‌లు చెబుతుంటే.. 11.09 శాతం జీఎస్టీడీపీ వృద్ధి సాధించామ‌ని ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశవ్ చెప్ప‌డం ప్ర‌జ‌ల‌ను మోసగించ‌డ‌మేన‌ని అన్నారు. 20 నెల‌ల్లోనే రూ.3.28 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసిన చంద్ర‌బాబు.. ఐదేళ్ల‌లో వైయ‌స్ఆర్‌సీపీ చేసిన అప్పుల‌ను చేరుకున్నార‌ని.. కానీ సూప‌ర్‌ సిక్స్‌లో ఏ ఒక్క సంక్షేమ ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉండ‌గా రూ. 14 ల‌క్ష‌ల కోట్లు అప్పుల‌య్యాయ‌ని కూట‌మి నాయ‌కులు త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని, ఇప్పుడు వారే బ‌డ్జెట్ సాక్షిగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన అప్పులు కేవ‌లం రూ. 3.39 ల‌క్ష‌ల కోట్లేన‌ని చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో పొదుపుగా పాల‌న చేసి గ్రామ స‌చివాల‌యాలు, విలేజ్ క్లీనిక్‌లు, ఆర్బీకే సెంట‌ర్లు, ఇళ్ల నిర్మాణం, పోర్టులు, మెడిక‌ల్ కాలేజీలు.. త‌దిత‌ర నిర్మాణాల‌తో సంప‌ద సృష్టించ‌డం జరిగిందని, కానీ ఆదాయం సృష్టించి అప్పులు తీర్చేస్తామ‌ని చెప్పిన‌ చంద్ర‌బాబు మాత్రం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడ‌ని కుంభా ర‌విబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

● అప్పులు చేయ‌డంలోనే వృద్ధి

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రూ.14 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌తో రాష్ట్రం శ్రీలంక అయిపోయింద‌ని కూట‌మి నాయ‌కులు తమ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్టు అస‌త్య ప్ర‌చారం చేశారు. మేం అధికారంలోకి వ‌స్తే సంప‌ద సృష్టించి రాష్ట్రం అప్పులు తీర్చేస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. వారి అబ‌ద్ధపు హామీల‌ను న‌మ్మి ఓటేసిన ప్ర‌జ‌ల‌ను పూర్తిగా వంచించారు. సంప‌ద సృష్టించ‌డం ప‌క్క‌న పెడితే 20 నెల‌ల్లోనే రూ.3.28 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌తో రాష్ట్రాన్ని దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్క‌టీ అమ‌లు చేయ‌లేదు. రాష్ట్ర రెవెన్యూ రాబ‌డిలో వార్షికాభివృద్ది కేవ‌లం 1.97 శాత‌మే అయినా 11.09 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఆదాయం పెర‌గ‌కుండా జీఎస్టీడీపీ ఎలా పెరుగుతుంద‌ని అడిగితే వారి వ‌ద్ద స‌మాధానం లేదు. గ‌తేడాది ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఏయే విభాగాల‌కు ఎంతెంత ఖ‌ర్చు చేశారో స‌భ ముందుంచాల్సిన ప్ర‌భుత్వం దానికీ స‌మాధానం చెప్ప‌డం లేదు. గ‌తేడాది రాష్ట్ర ప‌న్నులు పన్నేత‌ర ఆదాయం అంచ‌నాలు రూ. 1,25,126 కోట్లు కాగా, స‌వ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం రూ. 1,11,860 కోట్ల‌కు త‌గ్గించారు. మొద‌టి 9 నెల‌ల్లో వ‌చ్చిన ఆదాయం రూ. 67,459 కోట్లు మాత్ర‌మే. మిగిలిన మూడు నెల‌ల్లో రూ. రూ.44,407 కోట్లు రావాలి. ఈ 9 నెల‌ల్లో వ‌చ్చిన ఆదాయం క‌న్నా ఈ మూడు నెలల్లో రెట్టింపు ఆదాయం రావాలి. ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా? గ‌తేడాది కూడా ప‌న్నుల్లో వ‌చ్చిన వృద్ధి రేటు కేవ‌లం 3.4 శాతం మాత్ర‌మే. కానీ ప్ర‌జ‌ల‌కు మాత్రం అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ఏడాది రూ.3,32,205 కోట్ల‌తో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి ద్ర‌వ్య‌లోటును రూ.78,868 కోట్లుగా, రెవెన్యూ లోటును రూ. 22 వేల కోట్లు చూపించి భారీగా అప్పులు చేయాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్రంలోని ప్ర‌ధాన రాష్ట్రాల్లో ఆదాయ పెరుగుద‌ల రేటు ఏ విధంగా ఉంద‌ని కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్ర‌కారం చూస్తే అందులో చంద్ర‌బాబు నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అట్ట‌డుగున ఉంది. అస్సాం, బీహార్ రాష్ట్రాలు కూడా ఏపీ క‌న్నా ముందు వరుస‌లో ఉండ‌టం చంద్ర‌బాబుకి చెంప‌పెట్టు లాంటిది. 

● వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో సంప‌ద సృష్టి

ఏడాదిన్న‌ర కాలంగా రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచేసిన చంద్ర‌బాబు.. ఆ నెపాన్ని గ‌త వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న మీద నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌సంగంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. లోతైన గాయాలు, ఆర్థిక విధ్వంసం, విధ్వంస పాల‌న అంటూ విష ప్ర‌చారాన్ని కంట‌న్యూ చేస్తూనే ఉన్నారు. వైయ‌స్ఆర్‌సీపీహ‌యాంలో 2019-24 మ‌ధ్య చేసిన అప్పు కేవ‌లం రూ.3,39,540 కోట్లేన‌ని బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ చెప్పారు. 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు హ‌యాంలో అప్పుల పెరుగుద‌ల 22 శాతంగా ఉంటే, గ‌త వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో కేవ‌లం 15శాతమే పెరిగింది. కానీ వైయ‌స్ జ‌గ‌న్ ఆర్థిక విధ్వంసానికి పాల్ప‌డ్డారంటూ కూట‌మి నాయ‌కులు ఇష్టానుసారం ప్ర‌చారం చేశారు. గ‌త వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో 15 వేల స‌చివాయాలు నిర్మించి 1.36 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు శాశ్వ‌త ఉద్యోగాలు ఇవ్వ‌డం జ‌రిగింది. నాడు-నేడు కింద 17,710 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దారు. 10795 రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్త‌నం నుంచి విక్ర‌యం వ‌ర‌కు రైతుల‌కు అండ‌గా నిలిచారు. మారుమూల ప్రాంతాల‌కు కూడా వైద్యం అందించాల‌న్న ఉద్దేశ్యంతో 10,032 విలేజ్ క్లీనిక్‌లు నిర్మించ‌డం జ‌రిగింది. రాష్ట్రంలో ఉన్న 16,780 గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రుల‌ను అభివృద్ది చేసి అత్యాధునిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం జ‌రిగింది. అంద‌రికీ ఉచితంగా నాణ్య‌మైన వైద్యం అందించాల‌న్న సంక‌ల్పంతో దేశ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ జ‌ర‌గని విధంగా ఒకేసారి కొత్త‌గా 17 మెడిక‌ల్ కాలేజీలకు శంకుస్థాప‌న చేయ‌డంతోపాటు 7 కాలేజీల‌ను పూర్తి చేసి అడ్మిష‌న్లు తీసుకోవ‌డం జ‌రిగింది. సువిశాల సముద్ర తీర ప్రాంతాన్ని ఆస‌రాగా చేసుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాల‌న్న సంక‌ల్పంతో 4 పోర్టులు, 10 హార్బ‌ర్లు, 6 ఫిషింగ్ హార్బ‌ర్లు ఏర్పాటు చేశారు. డీబీటీ ద్వారా వివిధ ప‌థ‌కాల రూపంలో రూ 2.75 ల‌క్ష‌ల కోట్లు ల‌బ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జ‌మ చేయ‌డం జ‌రిగింది. ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల‌ల్లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్ గారికే ద‌క్కుతుంది. మంచి చేసిన ప్ర‌భుత్వాన్ని ఆర్థిక విధ్వంసం అని ప్ర‌చారం చేయ‌డం సిగ్గుచేటు. 

● మూడు సిలిండ‌ర్ల‌కే దిక్కులేదు

సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేశామ‌ని సంబ‌రాలు చేసుకుంటున్న కూట‌మి ప్ర‌భుత్వం ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్ల‌కే పింఛ‌న్ల హామీల ఊసెత్త‌డం లేదు. బ‌డ్జెట్‌లో ఆయా ప‌థ‌కాలకు ఇంత‌వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించ‌లేదు. మూడేళ్ల‌లో కొత్త‌గా ఒక్క పింఛ‌న్ ఇవ్వ‌క‌పోగా 5 ల‌క్ష‌ల పింఛ‌న్లు తీసేశారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సున్నా వడ్డీకి రుణాలిస్తామ‌ని చెప్పి మూడు బ‌డ్జెట్‌ల‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో విద్యార్థులు, ఉద్యోగులు, మ‌హిళ‌లు, నిరుద్యోగులు, రైతులు, వ్యాపారులు.. అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల‌ను నిలువునా ముంచేశారు. కానీ వారు మాత్రం ప్ర‌త్యేక విమానాలు, హెలిక్యాప్ట‌ర్ల‌లో జ‌ల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. క‌నీసం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని చెప్పిన హామీని కూడా అమ‌లు చేయ‌లేని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వంగా కూట‌మి మిగిలిపోయిందని కుంభా ర‌విబాబు అన్నారు.