ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం
సచివాలయం: ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఆహ్వానించారు. గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయని, ఈనెల 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఈనెల 16వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. బడ్జెట్ సెషన్ కావడంతో శని, ఆదివారాల్లోనూ శాసనసభ సమావేశాలు కొనసాగుతాయని, 21, 22న అసెంబ్లీ సమావేశాలకు సెలవు ఉంటుందన్నారు. సంక్షేమ, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెడతామని చీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు.