పోలీసులకు కులం..మతం లేదు
విజయవాడ: దేశ సమగ్రతను కాపాడటంతో పోలీసులు అంకితభావంతో పని చేస్తున్నారని, వారికి కులం, మతం లేదని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో పోలీసులకు కులం, మతం అంటగట్టడం బాధాకరమన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం కోవిడ్ టైంలో పోలీసులు చాలా కష్టపడ్డారని చెప్పారు. దేవాలయాల విషయంలో సోషల్ మీడియాలో కావాలనే వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ..ఆ కథనాలను డీజీపీ ఖండించారు.
109 మంది పోలీసులు మరణించారు..
లాక్‌డౌన్, కోవిడ్‌ను పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని పని చేశారని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చొరవ తీసుకున్నారని గౌతం సవాంగ్ చెప్పారు. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారని తెలిపారు.14,340 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు..109 మంది మరణించారని వెల్లడించారు. గతేడాది పోలీస్ శాఖకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని, కావాలనే కొందరు వాస్తవాలను వక్రీకరించారని పేర్కొన్నారు. ఆలయాలపై దాడులంటూ కొందరు దుష్ప్రచారం చేశారని, ఆలయాలపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేశారని తెలిపారు. టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీసు శాఖకు 100కు పైగా అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.
35 ఏళ్ల సర్వీసులో ఎప్పుడు చూడలేదు..
పోలీసులకు మతం, కులం అంటగడుతున్నారని, ఇలాంటి ఆరోపణలు తన 35 ఏళ్ల సర్వీస్‌లోఎప్పుడూ..ఎక్కడా చూడలేదని డీజీపీ గౌతం సవాంగ్ ఖండించారు. పోలీసులకులం, మతం లేదన్నారు. రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆలయాలపై దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఆలయాల భద్రతపై నిత్యం సమీక్షిస్తున్నామని చెప్పారు. ఆలయాలకు సంబంధించి మొత్తం 44 కేసులు ముఖ్యమైనవని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అంతర్వేది ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించిందని చెప్పారు. రాష్ట్రంలోని 58,871 హిందూ ఆలయాలను జియో ట్యాగింగ్ చేశామని వెల్లడించారు.
ఆలయాల్లో 30 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు
ఇటీవల కాలంలో ఆయా దేవాలయాల్లో 30 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామని డీజీపీ తెలిపారు. రామతీర్థం టెంపుల్ జనావాలకు రెండు కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంటుందన్నారు. అక్కడ ఉన్న 16 కెమెరాలు సరిపోవని గత రెండు నెలల క్రితమే మా పోలీసులు పరిశీలించారని చెప్పారు. కొండపైకి విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావించామన్నారు. చాలా చోట్ల సెక్యూరిటీని ఏర్పాటు చేయించామని చెపపారు. హిందూ దేవాలయాల విషయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా భద్రత చర్యలు చేపట్టామని, పోలీసులపై కులం, మతం ఆధారంగా ఆరోపణలు మానుకోవాలని డీజీపీ సూచించారు.