ప్రతి ఇంటికి రూ.5 వేలు అదనపు సాయం
అమరావతి: వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఇస్తున్న సాయంతో పాటు అదనంగా రూ.5 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, నిత్యావసర వస్తువుల పంపిణీయే కాకుండా అదనంగా సాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ కూడా ఉన్నారు.