సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ది వ‌జ్ర సంక‌ల్పం

16 Jun, 2020 16:13 IST

అమ‌రావ‌తి: ప‌్ర‌పంచ‌మంతా కోవిడ్‌-19 మ‌హ‌మ్మారితో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంద‌ని, ఇలాంటి ప‌రిస్థితిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆర్థిక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ద్వారా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేరుస్తున్నార‌ని, ఆయ‌న‌ది వ‌జ్ర సంక‌ల్ప‌మ‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్ట‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని  90 శాతం హామీల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏడాదిలోనే పూర్తి చేశార‌న్నారు. న‌వ‌ర‌త్నాల‌కు, విద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్య‌వ‌సాయానికి బ‌డ్జెట్‌లో పెద్ద‌పీట వేశామ‌న్నారు. అన్ని వ‌ర్గాల శ్రేయ‌స్సుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు.  అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించామ‌న్నారు. బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని బుగ్గ‌న తెలుగులోనే కొన‌సాగించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే ..బుగ్గ‌న మాట‌ల్లోనే..

వరుసగా రెండో సంవత్సరం కూడా బడ్జెట్ ను ప్రతిపాదించే అవకాశం కల్పించిన సభాపతి, ముఖ్యమంత్రి వైయస్ జగన్, సభ్యులకు నా నమస్కారాలు. ప్రపంచమంతా కోవిడ్ 19 అనే మహమ్మారితో కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇంత వరకూ మనకు తెలిసిన జీవన వ్యవహారం ప్రపంచమంతటా ఒక్కసారిగా ఆగిపోయింది. కోవిడ్ 19 మహ్మారితో సాగిస్తున్న సమరంలో మన ప్రభుత్వం ముందువరసలో ఉండటమే కాకుండా, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమర్థవంతమైన నేతృత్వంలో, పూర్తి అంకితభావంతో సాయశక్తులు ఒడ్డి పోరాడుతున్నది. అన్నిటికన్నా ముందు ఈ సమరంలో ముందు వరసలో నిలబడి నిస్వార్థంగా విధినిర్వహణ చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, గ్రామ వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సిబ్బంది, ఆశావర్కర్లు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేరుస్తున్నాం..
గత కొద్ది రోజులుగా కోవిడ్ 19 నిబంధనలను అంచెంలంచెలుగా సడలిస్తూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా మన ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ విషమ పరిస్థితుల్లో కూడా 2020-21 సంవత్సరాలకు చెందిన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని తెలియజేస్తున్నాము.

పేద‌ల‌కు భాగం క‌ల్పించిన వాడే నిజ‌మైన నాయ‌కుడు..
అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అనే మాటలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మేనిఫెస్టోను తయారు చేసి, ఆ మేనిఫెస్టోలోని వాగ్దానాల్లో 90% మొదటి సంవత్సరంలోనే నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అద్భుత విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

 
వైయ‌స్ఆర్ న‌మ్మిన సిద్ధాంతాన్ని వైయ‌స్ జ‌గ‌న్ అందిపుచ్చుకున్నారు..
 ''మన చర్యలే మన ప్రాధాన్యతలను ప్రదర్శిస్తాయి'' - దివంగత నేత ప్రియతమ నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి నమ్మిన ఈ సిద్ధాంతాన్నే అందిపుచ్చుకున్న మన ముఖ్యమంత్రి . ''ప్రజల జీవితంలో మేలి మార్పును తెచ్చినప్పుడే మన ముందు చూపుకు సార్థకత అని భావిస్తారు. మన ప్రియతమనేత అడుగు జాడల్లోనే మన ప్రభుత్వం కూడా రైతులు, కౌలు రైతులు, తల్లులు, యువత, స్వయం ఉపాధిలో ఉన్నవారు, బడుగు వర్గాల ప్రజలు ఎదుర్కుంటున్న ముఖ్య సమస్యలపై దృష్టిపెట్టి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం అంచనాలకు మించి కృషి చేస్తున్నది.  వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2019లో అధికారాన్ని అందుకున్నప్పటికీ మనం పరిష్కరించవలసిన ఎన్నో సమస్యలు, అడ్డంకులు మన ఎదుట ఉన్నాయి. ఎన్నో పెను సవాళ్లకు ఎదురీదవల్సి వచ్చింది. అప్పటికే నీరసిస్తున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారం మన భుజాలపై పడింది.

2018-19 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 8.8% మాత్రమే పెరిగింది.అప్పటికే గత ప్రభుత్వం పదే పదే ఘనంగా చెప్పుకుంటూ ఉన్న రెండంకెల వార్షిక ప్రగతి అవాస్తవం అని తేలింది. గత ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్లిన బకాయిలు 60,000 కోట్ల మేరకు పెండింగ్ బిల్లుల రూపంలో సునామీలా వచ్చి పడుతూనే ఉన్నాయి.

ప్ర‌తికూల‌త‌ల‌ను అధిగ‌మించి..
2019-20, 2020-21 స.లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21 సంత్సరానికి సంబంధించిన డివిజబుల్ పూల్ లో తగ్గిన వాటాతో పాటు, కోవిడ్ 19 వల్ల ప్రకటించిన లాక్‌ డౌన్ చర్యల వలన తగ్గుముఖం పట్టిన మన ఆదాయ వనరులు మన ఆర్థిక సమస్యను మరింత తీవ్రం చేసింది. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు వారు నెల్సన్ మండేలా గారి వాక్యాలను నాకు గుర్తు చేసారు. ఎవరైనా తాము చేపట్టాలనుకున్న మార్పును సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే, ప్రతికూలతలను అధిగమించి విజయం సాధిస్తారు.

ప్ర‌జాధ‌నాన్ని వృథా చేసే అలవాటు లేదు..
నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రతికూల పరిస్థితుల ముందు వేరే ఏ  ప్రభుత్వం ఉన్నా పూర్తిగా చేతులు ఎత్తేసేది. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వజ్ర సంకల్పం, శక్తి సామర్థ్యాల ముందు ఈ ప్రతికూలతలు నిలబడలేకపోయాయి. సామాజిక చట్రంలో అట్టడుగున ఉన్న ప్రజలను ఆర్థిక సాయం ద్వారా పైకి తీసుకురావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలను మార్చాలని ఆయన తీసుకున్న నిర్ణయాలు పరిపాలనకు సవాళ్లుగా ఎదురు నిలబడ్డాయి.
గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని వృద్ధా చేసే అలవాటును ఈ ప్రభుత్వం వ్యతిరేకించింది. అందుకు బదులుగా మనం ప్రభావశీలమైన లక్ష్య సాధనకు నిర్దేశించిన కార్యాచరణపైనే దృష్టి పెడుతూ వచ్చాం. ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వం నమ్ముతోంది. తమ పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోడానికే అహర్నిశలూ కృషి చేస్తోంది. ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యతలను రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలతో మేళవించి ముందుకు సాగవగలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ క్రమంలో బీద ప్రజలు, బడుగు జీవుల ప్రయోజనాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించేదిశగా పెట్టుబడులను, సంతులిత ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో మనకు ఎదురౌతున్న సవాళ్లను గుర్తించి తర్వాత మన ప్రభుత్వం వాటికి అవసరమైన పరిష్కారాలను సమకూర్చేలా తన శక్తియుక్తులను మొహరిస్తోంది.

దీర్ఘ‌కాలిక వ్యూహాన్ని రూపొందించాం..
ఏపీకి ఒక ఉజ్వల భవిష్యత్తును సాధించుకునే దిశగా ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకునే పని మనం ఇప్పటికే మొదలు పెట్టాం. మనకార్యాచరణ పథం ఎలా ఉంటుందో మేనిఫెస్టోలో వివరంగా చెప్పాం. ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలో మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలు ఇప్పటికే నవరత్నాల ద్వారా అమలు చేస్తున్నాం. మేనిఫెస్టో అంటే ఎన్నికలు కాగానే మర్చిపోయే కాగితం ముక్క కాదు అని గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో నేను చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేస్తున్నాను.


మన ప్రభుత్వానికి మేనిఫెస్టో అనేది మనం దారి తప్పిపోకుండా ముందుకు తీసుకువెళ్లే దిక్సూచి అని ముఖ్యమంత్రి అనుక్షణం గుర్తు చేస్తుంటారన్నారు. మాటిచ్చేముందే ఆలోచిస్తాను...ఇచ్చాక ఆలోచించేదేముంది. ముందుకు వెళ్లాల్సిందే అని వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యాలు, నమూనాలను, వ్యూహాలను వివరిస్తానన్నారు. ఆ ప్రాధాన్యతా క్రమంలో బడ్జెట్ ప్రతిపాదనను ఏవిధంగా రూపకల్పన చేసామో తెలియజేస్తానన్నారు.

మేనిఫెస్టో తూ.చ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నాం..
కష్టాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సాయం చేయనప్పుడు, వారి ముఖాళ్లో చిరునవ్వు వెలిగించనప్పుడు, వారి జీవితాలకు కొత్త వెలుగు ప్రసాదించనప్పుడు అభివృద్ధికి అర్థమే లేదు. ఈ ఆలోచనతో పేద ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం నవరత్నాలను మేనిఫెస్టోలో పొందుపరిచి, తూ.చా తప్పకుండా అమలు చేస్తోంది. ఈ సంవత్సరం కూడా నవరత్నాల అమలు పట్ల అదే అంకిత భావంతో బీద ప్రజలకు వైయస్సార్ పింఛన్ వంటి పథకాల ద్వారా సామాజిక భద్రతను మరింత సమగ్రంగా అమలు పరుస్తోంది. ప్రజా ప్రయోజన ఆకాంక్షేగానీ, ప్రచార ఆంకాక్ష లేకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నినాదంగా జగన్‌ మోహన రెడ్డిగారి సారధ్యంలో ప్రభుత్వం ప్రజల ఉన్నతి కోసం పనిచేస్తోంది. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ధిని సంక్షేమాన్నీ సాధించలేమన్నది నేను చెప్పాలనుకుంటున్నాను.